రిటర్న్ గిఫ్ట్ రెడీగా ఉంది: తలసాని

Talasani Srinivas Yadav Fire On TDP Over Governance In AP - Sakshi

సాక్షి, భీమవరం(పశ్చిమ గోదావరి): ‘ఏపీ ప్రజలు బాగుండాలని మేము కోరుకుంటున్నాం అందుకే ప్రత్యేక హోదాకు మద్దతిస్తున్నాం’ అంటూ మాజీ మంత్రి, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వాన్ని ఏపీ ప్రజలు అసహ్యించుకుంటున్నారని ధ్వజమెత్తారు. సీఎం చంద్రబాబు నాయుడుకు రిటర్న్ గిఫ్ట్ రెడీగా ఉందని.. వచ్చే ఏపీ ఎన్నికల్లో తప్పకుండా రంగంలోకి దిగుతామని స్పష్టం చేశారు. టీడీపీ ప్రభుత్వం అవినీతిలో దేశంలోనే నెంబర్‌ వన్‌గా ఉందని ఆరోపించారు. 24 గంటల నిరంతర విద్యుత్‌ ఇస్తున్న టీఆర్‌ఎస్‌ పాలన గొప్పదా లేక అవినీతిలో కూరుకపోయిన టీడీపీ పాలన గొప్పదా అంటూ ప్రశ్నించారు. గోదావరి జిల్లాలో జరుగుతున్న సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మీడియా సమావేశంలో టీడీపీ పాలనపై విరుచుకపడ్డారు.  తలసాని ఇంకా ఏమన్నారంటే ఆయన మాటల్లోనే..

మీలా చిల్లర రాజకీయాలు చేయను
‘గోదావరి జిల్లాలలో సంక్రాంతి సంబరాలు బాగా జరుగుతున్నాయి. ఈ ప్రాంతానికి వచ్చి రాజకీయాలు మాట్లాడవద్దని కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు కామెంట్స్‌ చేస్తున్నారు.. నేను రాజకీయాలే మాట్లాడతాను. నేను మీలాగా(టీడీపీ) చిల్లర రాజకీయాలు చేయను. తప్పకుండా రాజకీయాలు చేస్తాం. ఏపీకి ప్రత్యేక హోదా కావాలని ఇక్కడ ఆందోళనలు జరిగినప్పుడు మా ఎంపీ కవిత పార్లమెంట్‌లో మద్దతు పలికారు.. మీరు మాత్రం ప్రత్యేక హోదా సంజీవనా అని అసెంబ్లీలో మాట్లాడారు. జాతీయ ప్రాజెక్టు పోలవరం నిర్మాణాన్ని టీడీపీ ఎందుకు చేస్తోంది?. కమీషన్లు దండుకోవడానికే టీడీపీ ప్రభుత్వం పోలవరం చేపట్టింది.  

ఏపీలో గ్రాఫిక్స్‌ ప్రభుత్వం
చంద్రబాబు పాలన ఆశాజనకంగా లేదు. మా కొద్దు చంద్రబాబు అన్ని ఏపీ ప్రజలు అంటున్నారు.  ఏపీలో గ్రాఫిక్స్‌ ప్రభుత్వమే నడుస్తోంది. మీ తాటాకు చప్పుళ్లకు మేమే భయపడం. ఏపీలో బీసీలకు నాయకత్వం వహించే నేతలు లేరు. రాబోయే ఎన్నికలలో ఏపీలో బీసీలకు నాయకత్వం వహిస్తాను.. దిశా నిర్దేశం చేస్తాను. గత ఎన్నికలలో 15 సీట్లు గెలుచుకున్న పశ్చిమ నుంచే టీడీపీ ఓటమి ప్రారంభం కాబోతోంది. తెలంగాణలో 13 సీట్లకు టీడీపీ వెయ్యి కోట్లు ఖర్చుపెట్టింది. ఎన్నికలలో డబ్బులు పంపిణీ ప్రారంభించింది చంద్రబాబే. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిన టీడీపీని చంద్రబాబు ఆ పార్టీలో కలిపేశారు.’అంటూ తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ టీడీపీపై నిప్పులు చెరిగారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top