అభివృద్ధి కోసమే అధ్యయనం

Study Committee meetings For Devolopments YSRCP - Sakshi

వైఎస్సార్‌ సీపీ బీసీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి

బీసీ అధ్యయన కమిటీ సమావేశాలు ప్రారంభం

తొలిరోజు రజక మేధావులతో సమావేశం

13 జిల్లాల నుంచి హాజరైన రజక నేతలు

విజయవాడ సిటీ: బీసీ వర్గాల ప్రజల అభివృద్ధి కోసమే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు అధ్యయనం కమిటీ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామని పార్టీ బీసీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి అన్నారు. బీసీల జీవనప్రమాణాలు పెంచేందుకు తీసుకోవాల్సిన నిర్ణయాలపై జరుగుతున్న బీసీ అధ్యయన కమిటీ సమావేశాలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బీసీ సెల్‌ ఆధ్వర్యంలో విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని బీసీ వర్గాలకు సంబంధించిన వివిధ కులాల ప్రజ సంఘాలు, మేధావులు, పెద్దలతో సంప్రదింపులు జరిపి వారినుంచి సలహాలు, సూచనలు స్వీకరించాలన్న పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జంగా కృష్ణమూర్తి అధ్యక్షతన బీసీ అ«ధ్య యన కమిటీ నియమించారు. ఇందులో భాగంగా వివిధ కుల సంఘాలతో బీసీ అధ్యాయన కమిటీ సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ మేరకు తొలి రోజున రజక మేధావులతో సమావేశం నిర్వహించగా, 13 జిల్లాల నుంచి రజక నేతలు, ఉద్యోగులు, మేధావులు, మహిళలు హాజరై తమ అభిప్రాయాలను వెల్లడించారు. సమావేశంలో తొలుత మహాత్మా జ్యోతిరావుపూలే, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్, డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు.

సమస్యల పరిష్కారానికి కృషి
జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ, పార్టీలకతీతంగా వెనుకబడిన కులాల నుంచి వారి వెనుబాటుతనాన్ని పోగొట్టేందుకు అవసరమైన చర్యలు, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయపరంగా ముందుకు తీసుకెళ్లాలనే కార్యక్రమంలో భాగంగా బీసీ అధ్యాయన కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వైఎస్సార్‌ సీపీ మచిలీప్నటం జిల్లా అధ్యక్షుడు కె.పార్థసారథి మాట్లాడుతూ రజకులు సమాజంలో అన్ని వర్గాల ప్రజలతో మమేకమైన ఎంతో సేవ చేస్తున్నారని అన్నారు. రజకులను రాజకీయంగా పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఎంఎల్‌సీ స్థానాన్ని కేటాయిస్తామని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. సమావేశంలో అఖిలభారత రజక సంఘం ప్రధాన కార్యదర్శి జూపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ, దేశంలో 17 రాష్ట్రాల్లో, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇప్పటికే రజకులు ఎస్సీలుగా ఉన్నారని, 12 రాష్ట్రాల్లో మాత్రం ఎస్సీలుగా గుర్తించకపోవడం వల్ల శోచనీయమన్నారు. అందులో ఆంధ్రప్రదేశ్‌లో రజకులు వారి కుటుంబాలు నష్టపోతున్నారన్నారు. రజకుల పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్‌ లింగమయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో 72 సంవత్సరాలుగా రజకులను ఎస్సీలుగా చేరుస్తామనే వాగ్దానం నెరవేర్చడం లేదన్నారు.

డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎస్సీల్లో చేరుస్తామని ప్రయత్నిస్తున్న సమయంలో దురదృష్టవశాత్తు మృతి చెందారన్నారు. రజకులను ఎస్సీల్లో చేర్చారలనే చిరకాల వాంఛను వైఎస్‌ జగన్‌ నెరవేర్చాలని కోరారు. కడప జిల్లాకు చెందిన పన్నీట కాశియ్య మాట్లాడుతూ, రాజధానిలో రజక భవన్‌ నిర్మించాలని, అదేవిధంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కమ్యూనిటీ హాల్స్‌ నిర్మించాలన్నారు. కర్నూలుకు చెందిన రజక నేత రాంబాబు మాట్లాడుతూ, ఇస్త్రీ పెట్టెలు, ధోబీఘాట్‌లు రజకులకు ఇక ఏ మాత్రం అవసరం లేదని, వారికి కావల్సింది తమను ఇతర రాష్ట్రాలల్లో మాదిరిగా ఎస్సీల్లో చేర్చాలన్నారు. ఏపీ రజక సంఘాల ఐక్యవేదిక నాయకురాలు దుర్గంపాటి పద్మజ మాట్లాడుతూ, రజక మహిళలను వేధింపుల నుంచి రక్షణకు అట్రాసిటీ చట్టం అవసరమన్నారు. ఎన్నికల అనంతరం అసెంబ్లీలో తొలి బిల్లు రజకులను ఎస్సీల్లో చేరుస్తూ ప్రవేశపెట్టే బిల్లు కావాలన్నారు.

రజక అభివృద్ధి సంస్థ చిత్తూరు జిల్లా నేత బొమ్మగుంట రవి మాట్లాడుతూ, వైఎస్‌ జగన్‌ ఇచ్చిన మాటపై నిలబడే నేత కాబట్టి రజకుల అభివృద్ధికి పోరాడతారనే నమ్మకం ఉందన్నారు. రజక అభివృద్ధి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమ్మన్న మాట్లాడుతూ, రజకులను ఎస్సీల్లో చేరుస్తామని మేనిఫెస్టోలో పెట్టాలని డిమాండ్‌ చేశారు. మాజీ మంత్రి బీసీ అధ్యయన కమిటీ సభ్యుడు నర్సిగౌడ్‌ మాట్లాడుతూ, రజక నేతలు చెప్పిన అన్ని అంశాలను వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లి వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి రాగానే అమలుకు కృషి చేస్తామన్నారు. కమిటీ మరో సభ్యుడు మీసాల రంగన్న మాట్లాడుతూ, బీసీల్లో అన్ని కులాలను అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వైఎస్‌ జగన్‌ బీసీ అధ్యాయన కమిటీని ఏర్పాటు చేశారన్నారు. వివి ధ జిల్లాల నుంచి వచ్చిన వందలాది మంది రజక సంఘ నేతలు వినతిపత్రాలను, సలహాలు, సూచనలు అధ్యయన కమిటీకి అందజేశారు. వైఎస్సార్‌ సీపీ బీసీ సెల్‌ కేంద్ర కమిటీ కో–ఆర్డినేటర్‌ కర్నాటి ప్రభాకర్, పార్టీ విజయవాడ పార్లమెంట్‌ జిల్లా బీసీ సెల్‌ అధ్యక్షుడు కసగోని దుర్గారావు, రజక సంఘాల ఐక్యవేదిక సభ్యుడు అంజిబాబు, రజక రిజర్వేషన్‌ పోరాట సమితి నేత పొటికలపూడి జయరామ్, బీసీసెల్‌ నేతలు బొమ్మి శ్రీనివాసరావు, అవ్వారు ముసలయ్య పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top