యూపీలో ఎస్పీ–బీఎస్పీ జట్టు!

SP, BSP join hands for 2019 - Sakshi

లోక్‌సభ ఎన్నికల కోసం కూటమి ఏర్పాటుకు సమ్మతి

త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం

కాంగ్రెస్‌కు చోటుపై సందిగ్ధత  

లక్నో: త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల కోసం ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ)లు జట్టు కట్టడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. ఈ రెండింటితోపాటు రాష్ట్రీయ లోక్‌ దళ్‌ (ఆర్‌ఎల్‌డీ) వంటి చిన్న పార్టీలు కూడా ఈ కూటమిలో ఉండనున్నాయి. అయితే కాంగ్రెస్‌ ఒంటరిగా పోటీ చేస్తుందా లేక ఎస్పీ–బీఎస్పీల కూటమితో కలిసే సాగుతుందా అన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. ఒకవేళ కూటమితో కాంగ్రెస్‌ కలిస్తే, ఆ పార్టీకి అతి తక్కువ స్థానాల్లోనే టికెట్లు దక్కనున్నాయి. ఎస్పీ–బీఎస్పీల కూటమిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఎస్పీ జాతీయ అధికార ప్రతినిధి రాజేంద్ర చౌదరి చెప్పారు.

అమేథీ, రాయ్‌బరేలీల్లో పోటీ చేయం..
ఎస్పీ నేత అఖిలేశ్‌ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతిలు ఇప్పటికే పలుమార్లు సమావేశమై కూటమి ఏర్పాటుపై చర్చించారనీ, తాజాగా శుక్రవారం వారు ఢిల్లీలో భేటీ అయ్యి మాట్లాడారని రాజేంద్ర చెప్పారు. కూటమి ఏర్పాటుకు వీరిరువురూ సూత్రప్రాయ అంగీకారం తెలిపారన్నారు. కూటమిలో కాంగ్రెస్‌ ఉండాలా లేదా అన్న అంశాన్ని అఖిలేశ్, మాయావతిలు తర్వాత నిర్ణయిస్తారనీ, అయితే కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్, యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీల నియోజకవర్గాలైన అమేథీ, రాయ్‌బరేలీల్లో మాత్రం తమ కూటమి అభ్యర్థులను పోటీలో నిలపకుండా ఆ సీట్లను కాంగ్రెస్‌కే విడిచిపెట్టాలని నిర్ణయించామన్నారు. యూపీసీసీ అధ్యక్షుడు రాజ్‌ బబ్బర్‌ మాట్లాడుతూ అఖిలేశ్‌–మాయావతిల భేటీపై అధికారిక ప్రకటనేదీ లేదనీ, దీనిపై తాను మాట్లాడేదీ లేదంటూ ఆయన స్పందించేందుకు నిరాకరించారు. యూపీలో 80 లోక్‌సభ స్థానాలుండగా గత ఎన్నికల్లో 71 సీట్లు బీజేపీ, మరో రెండు సీట్లు బీజేపీ మిత్రపక్షం అప్నాదళ్‌ గెలిచాయి. ఎస్పీ ఐదు, కాంగ్రెస్‌ రెండు సీట్లు గెలవగా బీఎస్పీ ఒక్క స్థానంలోనూ గెలవలేదు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top