కేయూలో అధికారి సంతకం ఫో​​​​​​ర్జరీ

Signature Forgery Done In Kakatiya University - Sakshi

పరీక్షా విభాగంలోని క్యాజువల్‌ కార్మికుడి లీల

వాల్యూయేషన్‌ చేసినట్లుగా అధ్యాపకుల పేర దొంగ బిల్లులు

సాక్షి, కేయూ: కాకతీయ యూనివర్సిటీ పరీక్షల విభాగంలోని పీజీ సెక్షన్‌లో క్యాజువల్‌ లేబర్‌గా పనిచేస్తున్న ఒకరు అధికంగా సొమ్ము సంపాదించాలనే ఆశతో అక్రమానికి తెగపడ్డాడు. ఏకంగా అదనపు పరీక్షల నియంత్రణాధికారి సంతకం ఫోర్జ​​​రీ చేసి.. వాల్యుయేషన్‌ చేసినట్లుగా కొందరు అధ్యాపకుల పేర్లతో బిల్లులు తీసుకునేందుకు యత్నించాడు. అయితే, ఈ బిల్లును పరీక్షల విభాగంలోని అకౌంట్స్‌ విభాగం అధికారులు గుర్తించడంతో సదరు క్యాజువల్‌ లేబర్‌ మోసం బయటపడింది. ఈ మేరకు ఆయనను తొలగిస్తూ రిజిస్ట్రార్‌ కె.పురుషోత్తం శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

పీజీ పరీక్ష జవాబుపత్రాలు దిద్దినట్లుగా...
కేయూ పీజీ కోర్సుల వివిధ సెమిస్టర్‌ పరీక్షలు జరిగాక జవాబుపత్రాల వాల్యూయేషన్‌ చేయిస్తారు. ఇందులో పాల్గొ నే అధ్యాపకులు తాము ఎన్ని పేపర్లు దిద్దామో చెబుతూ బిల్లులు సమర్పించాలి. వీటిని తొలుత అదనపు పరీక్షల నియంత్రణాధికారి పరిశీలించి సంతకం చేస్తే అకౌంట్స్‌ విభాగం ఉద్యోగులు పాస్‌ చేసి అకౌంట్లలో రెమ్యూనరేషన్‌ జమ చేస్తారు. దీనిని పరీక్షల విభాగం పీజీ సెక్షన్‌లో కొన్నేళ్ల నుంచి క్యాజువల్‌ లేబర్‌గా పనిచేసే రవి అనే వ్యక్తి తనకు అనుకూలంగా మార్చుకున్నాడు.

వివిధ సెమిస్టర్ల పరీక్షల జవాబుపత్రాలు ముగ్గురు అధ్యాపకులు వాల్యూయేషన్‌ చేసినట్లుగా.. ఒకరు ఓయూ అధ్యాపకుడు, మరో ఇద్దరు కేయూ అధ్యాపకుల పేరిట దొంగ బిల్లులు తయారు చేశాడు. మూడు బిల్లులు కలిపి రూ.37వేలకు పైగా సమర్పించాడు. ఆ బిల్లులపై ఏకంగా అదనపు పరీక్షల నియంత్రణాధికారి సురేఖ సంతకం పోర్జరీ చేశారు. ఆ తర్వాత బిల్లులును ఇటీవల పరీక్షల విభాగంలోని అకౌంట్స్‌ విభాగంలో అందజేయగా అక్కడి ఉద్యోగులకు అనుమానం వచ్చింది.

ముగ్గురు అధ్యాపకుల పేరిట సమర్పించిన బిల్లుల్లో పక్కన ఒకే బ్యాంకు అకౌంట్‌ నంబర్‌ ఉండడంతో ఆరా తీయగా అది రవి భార్య అకౌంట్‌గా తేలింది. దీంతో విషయాన్ని గుర్తించి బిల్లులు ఆపేయడంతో పాటు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అలాగే, పాత బిల్లులను కూడా పరిశీలించగా గత ఏడాది కూడా దొంగబిల్లు సమర్పించి రూ.2,600 కాజేసినట్లు తేలింది.

క్రిమినల్‌ కేసు పెట్టాలని ఆదేశాలు 
కాకతీయ యూనివర్సిటీ పరీక్షల విభాగంలోని పీజీ సెక్షన్‌లో క్యాజువల్‌ లేబర్‌గా పనిచేస్తున్న రవి వ్యవహారాన్ని అధికారులు ఇన్‌చార్జి వీసీ జనార్దన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రవిని తొలగించాలని సూచించగా కేయూ రిజిస్ట్రార్‌ ఆచార్య కె.పురుషోత్తం, పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎస్‌.మహేందర్‌రెడ్డిని శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా సంతకాన్ని ఫోర్జరీ చేసినందుకు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top