మాకిది కావాలని అడిగేవారు తక్కువ!

sidda raghava rao speech in janmabhoomi closing program - Sakshi

జన్మభూమి ముగింపు సభలో మంత్రి శిద్దా

ఒంగోలు టౌన్‌: జిల్లాలో మాకిది కావాలని అడిగేవారు చాలా తక్కువగా ఉన్నారని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి శిద్దా రాఘవరావు అన్నారు. పదిరోజుల పాటు జరిగిన ఐదో విడత జన్మభూమి – మాఊరు కార్యక్రమ ముగింఫు సభ శుక్రవారం స్థానిక ఏ–1 కన్వెన్షన్‌ హాలులో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రేషన్‌ కార్డులు, పింఛన్లు, ఇళ్లు కావాలంటూ జిల్లాకు చెందిన ప్రజలు దరఖాస్తు చేసుకున్నారని, వాటన్నింటినీ త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. జిల్లాలో పోలీసు, రెవెన్యూ శాఖలకు సంబంధించిన సమస్యలు క్లియర్‌ చేయడంతో జన్మభూమి–మాఊరు సాఫీగా సాగిందన్నారు. ప్రజాస్వామ్యంలో సమస్యలు వస్తుంటాయని, ఆ సమస్యల పరిష్కారానికి జన్మభూమి–మాఊరు వేదికగా నిలిచిందని చెప్పారు. ఇదే స్ఫూర్తితో రానున్న కాలంలో పనిచేసి ప్రభుత్వాలకు మంచిపేరు తీసుకురావాలని కోరారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అధికారులు సమన్వయంతో అందరికీ అందేలా చూడాలన్నారు.

సీఎంను నవ్వుతూ పంపించారు..
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవ్వేది చాలా తక్కువని, అలాంటి ఆయన్ను జిల్లాలో జరిగిన జన్మభూమి సభ అనంతరం అధికారులు నవ్వుతూ పంపించారని శాసనమండలి సభ్యుడు కరణం బలరామకృష్ణమూర్తి ప్రశంసించారు. జిల్లాలో మైనస్‌ 72శాతం రెయిన్‌ ఫాల్‌ ఉందని, రాబోయో రోజుల్లో మరింత క్రిటికల్‌గా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్‌డబ్ల్యూఎస్, ఇరిగేషన్‌ అధికారులపై చాలా ఒత్తిడి ఉంటుందన్నారు. లీకేజీలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి అందుబాటులో ఉండే నీటిని సక్రమంగా సరఫరా చేసేలా చూడాలని సూచించారు.

బాగా పనిచేశారు: కలెక్టర్‌
జన్మభూమి కార్యక్రమ నిర్వహణకు సంబంధించి భయం, ఆందోళనకరంగా ఉన్నా అధికారులు బాగా పనిచేశారని కలెక్టర్‌ వి. వినయ్‌చంద్‌ ప్రశంసించారు. చిట్టచివరి గ్రామాల వరకు జన్మభూమి గ్రామసభలు సజావుగా జరిగాయన్నారు. జన్మభూమి గ్రామసభల్లో ప్రజల నుంచి వచ్చే అర్జీలను ఏరోజుకారోజు స్వీకరించి వాటిని ట్యాబ్‌ల ద్వారా అనుసంధానం చేసి నేరుగా తనతో పాటు ముఖ్యమంత్రి చూసే విధంగా ఏర్పాట్లు చేశారని చెప్పారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉండేందుకు డ్వాక్రా మహిళలను సాధికార మిత్రులుగా నియమించినట్లు తెలిపారు. 35 కుటుంబాలకు ఒక సాధికార మిత్రను నియమించి 15 రకాల భద్రతలు, 10 రకాల హామీలు ప్రజలకు చేరువయ్యే విధంగా చూస్తున్నారన్నారు. సభలో యర్రగొండపాలెం శాసనసభ్యుడు పాలపర్తి డేవిడ్‌రాజు, జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి, జాయింట్‌ కలెక్టర్‌–2 మార్కండేయులు పాల్గొన్నారు. దర్శిలో జన్మభూమి – మాఊరు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించిన సమయంలో ఆయన్ను ఆకట్టుకున్న ముండ్లమూరు మండలం బృందావనం గ్రామానికి చెందిన 8వ తరగతి విద్యార్థి విజయకుమార్‌ పేరున సీఎం ఆదేశాల మేరకు 50 వేల రూపాయల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ బాండ్‌ను మంత్రి శిద్దా అందించారు.

బెస్టు అవార్డులు
జన్మభూమి–మాఊరు కార్యక్రమాల్లో ప్రతిభ కనబరచిన జిల్లాస్థాయి అధికారులు, మండలాలు, నగర పంచాయతీ అధికారులకు బెస్టు అవార్డులు ప్రకటించారు. శుక్రవారం స్థానిక ఏ–1 కన్వెన్షన్‌ హాలులో జరిగిన ముగింపు సభలో మంత్రి శిద్దా రాఘవరావు, ఎమ్మెల్సీ కరణం బలరామకృష్ణమూర్తి, శాసనసభ్యుడు పాలపర్తి డేవిడ్‌రాజు, కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి అవార్డులు అందించారు.

జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి రాజ్యలక్ష్మి, పశుసంవర్థకశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ రవీంద్రనాధ్‌ఠాగూర్, ఎల్‌డీఎం వెంకటేశ్వరరావు, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి యతిరాజు, ఐసీడీఎస్‌ పీడీ సరోజిని, సీపీఓ కేటీ వెంకయ్యలకు ఉత్తమ అధికారులుగా అవార్డులు అందించారు. అదేవిధంగా నియోజకవర్గ ప్రత్యేక అధికారులు పోలప్ప (యర్రగొండపాలెం), రవి (దర్శి), ప్రభాకరరావు (పర్చూరు), శ్రీనివాసరావు (అద్దంకి), మురళి (చీరాల), శ్రీనివాసరావు (సంతనూతలపాడు), అన్నపూర్ణ (ఒంగోలు), మల్లికార్జున(కందుకూరు), ఉమాదేవి (కొండపి), కొండయ్య (మార్కాపురం), కిషోర్‌(గిద్దలూరు), కైలాస్‌ గిరీశ్వర్‌ (కనిగిరి)లకు అవార్డులు అందించారు. ఉత్తమ మండలాలుగా మార్కాపురం, జరుగుమల్లి మండలాలను ఎంపిక చేశారు. ఉత్తమ మునిసిపాలిటీలుగా కందుకూరుకు మొదటి స్థానం, మార్కాపురానికి రెండో స్థానం కింద అవార్డులు ఇచ్చారు. ఉత్తమ పంచాయతీలుగా అద్దంకి మండలం ధేనువకొండ, అర్ధవీడు మండలం అయ్యవారిపల్లి గ్రామాలకు అవార్డులు అందించారు. ఉత్తమ నగర పంచాయతీలుగా అద్దంకి, చీమకుర్తిలకు అవార్డులు అందించారు. చీరాల మునిసిపాలిటీలోని 1వ వార్డు, గిద్దలూరులోని 14వ వార్డు, కందుకూరులోని 12వ వార్డు, కనిగిరిలోని 15వ వార్డు, మార్కాపురంలోని 13వ వార్డు, ఒంగోలులోని 10వ డివిజన్‌ను ఎంపిక చేసి అవార్డులు అందించారు.

చేదు అనుభవం
ఐదో విడత జన్మభూమి–మాఊరు ముగింపు సభకు హాజరైన వారికి చేదు అనుభవం ఎదురైంది.  సభకు జిల్లా నలుమూలల నుంచి అనేకమంది వచ్చారు. జిల్లా యంత్రాంగం వారికి అరకొరగా భోజన వసతి కల్పించింది. అతిథుల ప్రసంగాలు, సత్కారాలు ముగిసిన అనంతరం భోజనం చేసేందుకు వెళ్లిన వారికి అక్కడ టేబుళ్లు ఖాళీగా దర్శనమిచ్చాయి. ఒకవైపు జనాలు ఉండటంతో ఆతృతగా అక్కడకు వెళ్లారు. అక్కడి సర్వర్లు తమ వద్ద మిగిలిన కిళ్లీలను ఇవ్వడం ప్రారంభించడం గమనార్హం.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top