కలెక్టర్‌కు మాజీ సీఎం వార్నింగ్‌

Shivraj Singh Chauhan Wants Chhindwara Collector - Sakshi

భోపాల్‌: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా గడుపుతున్న మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ బుధవారం సహనం కోల్పోయారు. ఛింద్వారాలో తన హెలికాఫ్టర్‌ ల్యాండింగ్‌కు అనుమతి నిరాకరించడంతో ఆయన జిల్లా కలెక్టర్‌పై బెదిరింపులకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం సాయంత్రం చౌహాన్‌ ఛింద్వారా జిల్లా ఉమ్రేత్‌లో పర్యటించాల్సి ఉంది. అందుకోసం చౌహాన్‌ హెలికాఫ్టర్‌లో సాయంత్రం 5.30 గంటలకు అక్కడికి వెళ్లేందుకు షెడ్యూల్‌ ఖరారు చేసుకున్నారు. అయితే జిల్లా అధికారులు మాత్రం సాయంత్రం 5 గంటల లోపే ఆయన హెలికాఫ్టర్‌ ల్యాండింగ్‌ అనుమతి ఇచ్చారు. దీంతో ఆగ్రహానికి లోనైనా చౌహాన్‌ కలెక్టర్‌పై విరుచుకుపడ్డారు.

‘పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ అక్కడ మా హెలికాఫ్టర్‌లు ల్యాండ్‌ కాకుండా అడ్డుకుంటుంది. ఇక్కడ మధ్యప్రదేశ్‌ సీఎం కమల్‌నాథ్‌ కూడా అలాగే వ్యవహరిస్తున్నారు. నేను ఇతర రాష్ట్రాల్లో ప్రచారంలో పాల్గొన్నాను. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో పర్యటించాను. కానీ ఇలాంటి పరిస్థితి ఎక్కడ తలెత్తలేదు. నేను వారిని సాయంత్రం 6 గంటల వరకు అనుమతివ్వమని కోరాను. కానీ వారు అందుకు అంగీకరించలేదు. నేను దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది అప్రజాస్వామిక చర్య. ప్రభుత్వాలు వస్తుంటాయి.. పోతుంటాయి కానీ ఎవరు ఇలాంటి ఘటనలకు పాల్పడరాదు. ఓ తోలుబొమ్మ కలెక్టర్‌.. నేను తిరిగి అధికారంలోకి వస్తే అప్పుడు నీకు ఏం జరుగుతుందో తెలుసా’ అంటూ హెచ్చరించారు. మూడు సార్లు మధ్యప్రదేశ్‌ ముఖ్యంత్రిగా పనిచేసిన చౌహాన్‌ ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top