సిద్ధూకి మద్దతుగా బీజేపీ సీనియర్‌ ఎంపీ

Shatrughan Sinha Backed   Navjot Sidhu On Hug Row - Sakshi

సిద్దూకి అండగా బీజేపీ సీనియర్‌ నేత శతృఘ్న సిన్హా

మోదీ, వాజ్‌పేయి వాటేసుకోలేదా- సిన్హా

వ్యక్తుల కంటే పార్టీ గొప్పది

సంక్లిష్టమైన జీఎస్‌టీ వల్ల ప్రజలకు కష్టాలు

సాక్షి, కోలకతా: బీజేపీ సీనియర్ నేత శతృఘ్న సిన్హా మరోసారి సొంత పార్టీపై తనదైన శైలిలో స్పందించారు. పాక్‌ ఆర్మీ చీఫ్‌తో హగ్‌ వివాదంలో మాజీ క్రికెటర్‌, పంజాబ్‌ మంత్రి నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూకి  మద్దుతుగా నిలిచారు.  దేశ మాజీ ప్రధాని, దివంగత నేత అటల్‌ బిహారీ వాజ్‌పేయి, ప్రధానమంత్రి నరేంద్రమోదీ గతంలో పాకిస్తాన్‌ ప్రధానమంత్రులను  ఆలింగనం చేసుకోలేదా అని  సిన్హా ప్రశ్నించారు. పాక్‌ పర్యటనల సందర్భంగా  దేశ ప్రధానులు పాక్‌ ప్రధానులను హగ్‌ చేసుకున్నారని గుర్తుచేశారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నపుడు, ప్రస్తుత ప్రధాని మోదీ పాక్‌ పర్యటనల సందర్భంగా అప్పటి ప్రధాని నవాజ్‌షరీఫ్‌ను కౌగిలించుకోలేదా అని ప్రశ్నించారు. అలాగే ఈ విషయంపై  ఇప్పటికే  సిద్ధూ వివరణ ఇచ్చిన తరువాత ఇంకా  వివాదం ఉంటుందని తాను భావించలేదన్నారు.

కోల్‌కతాలో జరిగిన ఒక సదస్సులో శతృఘ్నసిన్హా మాట్లాడుతూ, బిజెపికి వ్యతిరేకంగా తాను ఎన్నడూ మాట్లాడలేదని, పార్టీకి అద్దంలా వ్యవహరించానని పేర్కొన్నారు. అయితే పార్టీ  ప్రభుత్వాన్ని విమర్శించినంత మాత్రాన పార్టీకి వ్యతిరేకమైనట్టు కాదని పేర్కొన్నారు. వ్యక్తుల కంటే పార్టీ గొప్పదనే సూత్రాన్ని నానాజీ దేశ్‌ముఖ్‌‌, అటల్‌బిహారీ వాజ్‌పేయి, ఎల్‌కే అద్వానీ లాంటి బీజేపీ అగ్రనేతల నుంచి తాను  నేర్చుకున్నానని గుర్తు ఆయన చేసుకున్నారు. అంతేకాదు జీఎస్‌టీ చట్టంపైనా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. జీఎస్‌టీ సంక్లిష్టమైన చట్టంగా పేర్కొన్న సిన్హా, దీనిమూలంగా ప్రజలు చాలా సమస్యలను ఎదుర్కొన్నారన్నారు.   ఈ నేపథ్యంలో జీఎస్‌టీపై  నోరు విప్పడం తన బాధ్యత  అని చెప్పారు.

కాగా గత వారం పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఈ ఇన్సాఫ్‌ పార్టీ అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌ పాకిస్థాన్‌ 22వ ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరైన  క్రికెటర్‌ టర్న్డ్‌  పొలిటీషియన​ సిద్ధూ  పాక్ ఆర్మీ ఛీఫ్ ఖమర్ జావెద్ బజ్వాను ఆలింగనం చేసుకోవడంపై  విమర్శలు వెల్లువెత్తాయి. సిగ్గుమాలిన చర్యగా  శివసేన మండిపడగా, కాంగ్రెస్‌ నాయకులు పాకిస్తాన్‌ ఏజెంట్లు అంటూ బీజేపీ కాంగ్రెస్‌పార్టీపై విరుచుపడిన సంగతి తెలిసిందే.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top