చిన్నమ్మకు బినామీ ఉచ్చు

sasikala compleat one year her prison life - Sakshi

ఒకే చిరునామాలో బినామీ సంస్థలు

లావాదేవీలు, ఐటీ రిటర్న్‌ లేవు

రూ.380 కోట్ల ఆస్తుల జప్తు

ఇప్పటికే అనేక చిక్కుల్లో పీకల్లోతుల్లో మునిగి ఉన్న చిన్నమ్మ మెడకు బినామీ ఉచ్చుబిగుసుకుంటోంది. నకిలీ సంస్థలు, అక్రమంగా విదేశీ మారకద్రవ్యాల వ్యవహారం బైటపడింది. అన్నాడీఎంకే బహిష్కృతనేత శశికళ బంధువులకు సంబంధించిన రూ.380 కోట్ల విలువైన బినామీ ఆస్తులను ఆదాయపు పన్నుశాఖ జప్తు చేసిన సంగతి బుధవారం వెలుగుచూసింది. జప్తు చేసిన ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు అధికారులు కదలడంతో విషయంబైటపడింది. ఐటీ అధికారి ఒకరు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి.

సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత, శశికళ బంధువులు, మిత్రులకు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాలపై గత ఏడాది ఐటీ శాఖ భారీ ఎత్తున ఆకస్మికదాడులు నిర్వహించింది. జయ, శశికళ పేర్లతో అనేక బినామీ సంస్థలు పనిచేస్తున్నట్లు అధికారుల దాడులతో వెలుగుచూసింది. వీటిల్లో అనేక సంస్థలను చెన్నై టీనగర్‌లోని ఒక అపార్టుమెంటును చిరునామాగా చూపి ప్రారంభించారు. పైగా వీటిల్లో కొన్ని కంపెనీలు పేరుకు మాత్రమే పరిమితమై ఆస్తులను కొనుగోలు చేయడం వంటి కార్యకలాపాలకు మాత్రమే పాల్పడ్డారు. ఇతర వ్యాపార లావాదేవీలు, ఐటీ రిటరŠన్స్‌ చేసిన దాఖలు లేవు. నల్లధనం లెక్కలు చూపేందుకే ఇలాంటి సంస్థలను స్థాపించినట్లు అధికారులు గుర్తించారు. దీంతో సదరు ఆస్తులను, బ్యాంకు ఖాతాలను ఐటీ అధికారులు గతంలోనే జప్తు చేసిన సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు కొనసాగింపుగా చెన్నై ఎంఏఆర్‌సీ నగర్‌లోని ఆది ఎంటర్‌ప్రైజెస్‌కు సొంతమైన రూ.380 కోట్ల విలువైన 4.3 ఎకరాల ఫిర్‌హెవెన్‌ ఎస్టేట్‌ను ఇటీవల జప్తు చేశారు. ప్రస్తుత మార్కెట్‌ «ధర కాకుండా 2015లో ఆ ఎస్టేట్‌ కొనుగోలు విలువనే అధికారులు జప్తులో లెక్క చూపారు.

రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ పూర్తిగా పడిపోయి ఉన్న సమయంలోనే ఇంతపెద్ద మొత్తం పెట్టి కొనుగోలు చేయడంపై అధికారులు విస్తుపోయారు. గుజరాత్‌కు చెందిన సునీల్‌ కెట్పాలియా, మనీష్‌ బార్మర్‌ అనే వ్యక్తుల నుంచి ఆ ఎస్టేట్‌ను కొనుగోలు చేసినట్లు తెలిసింది. గత ఏడాది ఐటీ దాడుల తరువాత నుంచి ఇప్పటి వరకు జరిపిన విచారణలో ఇదే ఎస్టేట్‌కు సంబంధించి రూ.70 కోట్లు జప్తు చేసి ఉన్నారు. ఆది సంస్థ పెద్ద ఎత్తున వ్యాపారం ఏమీ చేయకుండానే కోట్లాది రూపాయల లావాదేవీలు నిర్వహించింది. మారిషస్‌ దేశంలోని పసిట్టోలోస్‌ ఇన్వెస్టిమెంట్‌ లిమిటెడ్‌ నుంచి రూ.250 కోట్లు విదేశీమారక ద్రవ్యంగా ఆది సంస్థకు ముట్టింది. ఈ నిధులను వెచ్చించే ఆది సంస్థ చెన్నైలో ఖరీదైన ఆస్తులను కొనుగోలు చేసింది. అలాగే సునీల్‌ కెట్పాలియా డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న ఎడిసన్‌ ఎనర్జీ ఇండియా ప్రయివేట్‌ లిమిటెడ్‌ సంస్థ ఆది సంస్థలో రూ.30 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు అధికారులు కనుగొన్నారు.

ఎడిసన్‌ ఎనర్జి సంస్థలో మరో డైరెక్టర్‌గా వ్యక్తి అన్నాడీఎంకేలోని ఒక ప్రముఖ నేత సన్నిహితుడిని పరోక్షంగా శశికళను ఉద్దేశించి ఐటీ అధికారులు తెలిపారు. సునీల్, మనీష్‌ కలిసి 2015లో పెరంబూరు బేరక్స్‌ రోడ్డులో లాండ్‌మార్క్స్‌ గ్రూపునకు చెందిన ఒక భారీ  అపార్టుమెంటు నిర్మాణాన్ని చేపట్టారు. ఇలా మనీష్‌ సుమారు 12 బినామీ సంస్థలను నిర్వహించి భారీ ఎత్తున నల్లధనం కూడగట్టినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. అలాగే సునీల్‌ కెట్పాలియాకు ఎందరో అన్నాడీఎంకే నేతలు, మాజీ మంత్రులతో సంబంధాలు ఉన్నాయని తెలుసుకున్నారు. అంతేగాక అన్నాడీఎంకే నేతలకు అనేక పనులు చేసిపెట్టే బ్రోకర్‌గా కూడా సునీల్‌ పనిచేసినట్లు తెలుసుకున్నారు. 2011లో అన్నాడీఎంకే అధికారంలోకి వరకు సదరు సునీల్‌ చిన్నపాటి వడ్డీ వ్యాపారం, శశికళ బినామీ కంపెనీల్లో ఉద్యోగిగా ఉండేవాడు. ఈవిధంగా ఏర్పడిన పరిచయాలతో తానే ఒక బినామీ సంస్థ యజమానిగా ఎదిగినట్లు ఐటీ అధికారులు చెబుతున్నారు. శశికళ బంధువులు, బినామీలను గుర్తిస్తూ ఆస్తుల జప్తునకు పూనుకోవడం రాష్ట్రంలో కలకలం రేపుతోంది.

జైలు జీవితం ఏడాది పూర్తి: ఆస్తుల కేసులో నాలుగేళ్ల జైలుశిక్షను ఎదుర్కొంటున్న శశికళ బుధవారంతో ఏడాది జైలు జీవితాన్ని పూర్తి చేసుకున్నారు. గత ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన తుదితీర్పు వెలువడగా 15వ తేదీన శిక్ష ఖైదీగా ఆమె బెంగళూరు జైల్లోకి వెళ్లారు. చిన్నమ్మతోపాటు ఆమె వదిన ఇళవరసి, అక్క కుమారుడు సుధాకరన్‌ సైతం అదే రోజున జైలు జీవితాన్ని ప్రారంభించారు. జయలలిత తొలి వర్ధంతి గత ఏడాది డిసెంబర్‌ 5వ తేదీన మౌనవ్రతాన్ని ప్రారంభించిన శశికళ మంగళవారం శివరాత్రి పర్వదినం సందర్భంగా విరమించినట్లు తెలుస్తోంది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top