సైదిరెడ్డికి బీఫామ్‌ అందజేసిన కేసీఆర్‌

Sanampudi Saidi Reddy as Huzurnagar TRS candidate - Sakshi

హుజూర్‌నగర్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: హుజూర్‌నగర్‌ ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేయనున్న శానంపూడి సైదిరెడ్డికి పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ సోమవారం బీఫారం అందజేశారు. సోమవారం ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ను సైదిరెడ్డి కలిశారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ఈ ఎన్నికలో విజయం సాధించిరావాలని కేసీఆర్‌ సూచించారు. పార్టీ నేతలు, శ్రేణులతో సమన్వయం చేసుకోవడంతోపాటు అన్నివర్గాల్లోకి ఎన్నికల ప్రచారాన్ని బలంగా తీసుకెళ్లాలని కేసీఆర్‌ సూచించారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల గడపగడపకూ వెళ్లేవిధంగా ప్రచార ప్రణాళిక రూపొందించుకోవాలని చెప్పినట్లు సమాచారం. నామినేషన్‌ దాఖలు కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొనేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కేసీఆర్‌ చేతుల మీదుగా బీఫారం తీసుకున్న సైదిరెడ్డి నల్లగొండలో జరిగిన పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను కలిసేందుకు బయలుదేరి వెళ్లారు. బీఫారం అందినప్పటికీ నామినేషన్‌ దాఖలు తేదీని నిర్ణయించాల్సి ఉందని సైదిరెడ్డి సన్నిహితులు తెలిపారు. ఈ నెల 30లోగా నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉండగా రెండు, మూడు రోజుల్లో సైదిరెడ్డి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసే అవకాశం ఉంది.   

సీఎంను కలిసిన ఎమ్మెల్యేలు 
పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ సభ్యుడిగా తనను నియమించినందుకు నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తా కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం ప్రగతిభవన్‌లో ఆయన సీఎంను కలిశారు. దక్షిణ మధ్య రైల్వే యూజర్స్‌ కమిటీ మెంబర్‌గా, శాసనసభ బీసీ వెల్ఫేర్‌ కమిటీ సభ్యుడిగా తనను నియమించినందుకు వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ సోమ వారం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top