వైఎస్సార్‌ సీపీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలి : సజ్జల

Sajjala Ramakrishna Reddy Meeting With Party Workers At Anantapur - Sakshi

స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత నామినేటెడ్ పోస్టుల భర్తీ

వైఎస్ జగన్ దేశంలో శక్తివంతమైన నాయకుడు : సజ్జల

సాక్షి, అనంతపురం : త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ అభ్యర్థుల విజయం కోసం పోలింగ్ బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడాలని అన్నారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం పంచితే కఠిన చర్యలు తీసుకునే విధంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీచేశారని తెలిపారు. శుక్రవారం అనంతపురం జిల్లా పర్యటన సందర్భంగా అక్కడ నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు.  స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత నామినేటెడ్ పోస్టుల భర్తీ చేస్తామన్నారు.

రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు సీఎం జగన్ కృషి చేస్తున్నారని అభినందించారు. 9 మాసాల్లో 90 శాతం హామీలు నెరవేర్చిన ఘనత వైఎస్‌ జగన్‌దే అని కితాబిచ్చారు. దివంగత వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాలను జగన్ బలోపేతం చేశారని అన్నారు. దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దేందుకు సీఎం జగన్ నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు. వైఎస్ జగన్ దేశంలోనే అత్యంత శక్తివంతమైన నాయకుడని, ఆయన అమలుచేసే పథకాలపై యావత్‌దేశం ఆసక్తి చూపుతోందని పేర్కొన్నారు.

సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ‘వ్యవస్థలో మార్పు తెచ్చేందుకు సీఎం నడుం బిగించారు. గడప వద్దకే పరిపాలన అందిస్తున్న ఘనత వైఎస్ జగన్‌దే. ​ఐదేళ్ల పాలనలో చంద్రబాబు ఖజానాను ఖాళీ చేసి వెళ్లారు. అప్పులు సైతం పుట్టకూడదన్న అక్కసుతో చంద్రబాబు కుట్రలు చేశారు. ప్రజా సంక్షేమాన్ని గత టీడీపీ ప్రభుత్వం విస్మరించింది. అధికార వికేంద్రీకరణపై చంద్రబాబు దుష్ర్పచారం చేస్తున్నారు. విశాఖ, రాయలసీమ జిల్లాల్లో జై అమరావతి నినాదాలు చేసి చంద్రబాబు అభాసుపాలయ్యారు. ఆయనకు ఎల్లో మీడియా వత్తాసు పలకడం దురదృష్టకరం. టీడీపీ, కాంగ్రెస్ కలిసి అక్రమ కేసులు పెట్టినా వైఎస్ జగన్ ఎక్కడా భయపడలేదు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top