మెట్రో పేరిట దోపిడి: రేవంత్‌ రెడ్డి

Revanth Reddy Fires On KCR Government Over Metro Project - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి మరోసారి తనదైనశైలిలో విమర్శలు గుప్పించారు. మెట్రో ప్రాజెక్ట్‌పై ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ..  మెట్రో ప్రాజెక్ట్‌ పేరుతో కేసీఆర్‌ ధనదాహం తీర్చుకుంటున్నారని ఆరోపించారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు రవాణా వ్యవస్థను జీఎమ్మార్‌ సంస్థే ఏర్పాటు చేసేలా ఆనాటి  ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందనీ, అయినప్పటికీ రాయదుర్గం-శంషాబాద్‌ రూట్‌లో కొత్తగా మెట్రో రైల్వే ప్రాజెక్ట్‌ నిర్మాణం చేపట్టడం వెనుక కారణాలేంటని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. 

కేసీఆర్‌ బంధువైన ప్రవీణ్‌ రావ్‌, మై హోమ్‌ సంస్థ, ఇతర బంధువుల భూముల విలువ పెరగటం కోసమే ఈ ప్రాజెక్ట్‌ చేపడుతున్నారని ఆరోపించారు. మెట్రో ప్రాజెక్ట్‌ నిర్మాణం అపేయాలని ఆనాడు కిరణ్‌ కుమార్‌ రెడ్డికి లేఖ రాసింది నిజమా? కాదా? అని ప్రశ్నించారు. మెట్రోను అడ్డుపెట్టుకొని కేసీఆర్‌ దోపిడి చేస్తున్నారనేది ముమ్మాటికి వాస్తవమని ఆరోపించారు. కేసీఆర్‌ చేస్తున్న మెట్రో స్కామ్‌పై కోర్టుకు వెళ్తామన్నారు. తను మెట్రో ప్రాజెక్టుపై చేసినవి అసత్య ఆరోపణలయితే ఏ శిక్షకైనా సిద్దమేనన్నారు. కేసీఆర్‌ కుటుంబం పట్టపగలే తెలంగాణను దోపిడి చేస్తుందని ధ్వజమెత్తారు. తండ్రీ-కొడుకుల దోపిడితో భవిష్యత్తులో బంగారు తెలంగాణ కాకపోగా అప్పుల తెలంగాణగా మారుతుందని రేవంత్‌ రెడ్డి ఎద్దేవాచేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top