
సాక్షి, హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీని వీడిన రేవంత్ రెడ్డి...కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు ముహూర్తం ఖరారైంది. నెలాఖరులో ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ నెల 31న ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణలోని పరిణామాలపై చర్చ జరగనుంది. అదే రోజు పార్టీ ఉపాధ్యక్షుడు రాహూల్‌గాంధీ సమక్షంలో రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డితో పాటు మరో 30మంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ కుంతియా ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్ రానున్నారు. ఆయనతో రేవంత్‌రెడ్డి భేటీ కానున్నట్లు సమాచారం. కాగా రేవంత్‌తో పాటు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే ఆ ముప్పైమంది ఎవరా? అనే దానిపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి.
ఇక సొంత నియోజకవర్గం కొడంగల్‌లో రేవంత్ రెడ్డి... కార్యకర్తలతో భేటీ కానున్నారు. భవిష్యత్ కార్యాచరణపై ఆయన చర్చించనున్నట్లు తెలుస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా అనంతరం తొలిసారి ఆయన ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్‌కు రానున్నారు. అలాగే సోమవారం ఉదయం ఆయన జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం నగరంలోని జలవిహార్‌లో అనుచరులతో కీలక సమావేశం నిర్వహిస్తారు. అనంతరం భవిష్యత్ కార్యాచరణపై ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.