ఏపీ టీడీపీపై రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Revanth fires on AP TDP leaders - Sakshi

కేసీఆర్‌ మమ్మల్ని జైళ్లల్లో పెట్టిస్తుంటే మీరు దండాలు పెడతారా?

ఏపీ మంత్రి యనమలకు కేసీఆర్‌ రూ.2వేల కోట్ల కాంట్రాక్టు ఇచ్చారు

తెలంగాణలో చంద్రబాబుకు దక్కని గౌరవం.. ఏపీలో కేసీఆర్‌కు ఎందుకు? 

సాక్షి, హైదరాబాద్‌ : దీపావళికి ఒకరోజు ముందే తెలంగాణ టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి థౌజండ్‌ వాలా పేల్చారు. ఏపీ టీడీపీ నేతలే టార్గెంట్‌గా మాటల రాకెట్లు పేల్చారు.

తెలంగాణ సీఎం కేసీఆర్‌.. ఇక్కడి టీడీపీ నేతలను జైల్లళ్లో పెడుతుంటే.. ఏపీ టీడీపీ నేతలు మాత్రం ఆయనకు వంగివంగి దండాలు పెట్టడం ఎంతవరకు సమయంజసమని ప్రశ్నించారు. బుధవారం హైదరాబాద్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

 చంద్రబాబును టీ నేతలు పట్టించుకున్నారా? : ‘‘కేసీఆర్‌ ఏపీ మంత్రి పరిటాల ఇంట్లో పెళ్లికి వెళ్లినప్పుడు ఆయనకు ఏపీ టీడీపీ నేతలు వంగివంగి దండాలు పెట్టారు. అదే, చంద్రబాబు.. సీతక్క ఇంట్లో పెళ్లికి వచ్చినప్పుడు టీఆర్‌ఎస్‌ మంత్రులుగానీ, నాయకులుగానీ ఏపీ సీఎంను పట్టించుకున్నారా? ఇది టీడీపీ నేతల అత్యుత్సహప్రదర్శనకాదా! ఏపీలో పయ్యావుల కేశవ్‌ను ప్రజలు ఎప్పుడో తిరస్కరించారు. ఆయన గురించి నేను మాట్లాడేది ఏముంటుంది?’’ అని రేవంత్‌ వ్యాఖ్యానించారు.

యనమలకు కేసీఆర్‌ రూ.2వేల కోట్లు : ఏపీ టీడీపీ సీనియర్‌ నేత, మంత్రి యనమల రామకృష్ణుడుకు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు మధ్య ఆర్థిక సంబంధాలున్నాయని రేవంత్‌ వ్యాఖ్యానించారు. ‘‘యనమలకు కేసీఆర్‌ రూ.2000 కోట్ల కాంట్రాక్టులు ఇచ్చారు. అందుకే కేసీఆర్‌పై ఈగవాలనీయకుండా యనమల చూసుకుంటారు. ఏపీ టీడీపీ నేతలు.. అన్నం పెట్టేవాడికి సున్నం పెట్టేవారిలా తయారయ్యారు.’’ అని రేవంత్‌ అన్నారు.

తెలంగాణలో పార్టీలు లేవు : ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ పార్టీలంటూ లేవని,  సీఎం కేసీఆర్‌, ఆయనపై వ్యతిరేకులు మాత్రమే ఉన్నారని రేవంత్‌ అన్నారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా రాజకీయ పునరేకీకరణకు తాను నాయకత్వం వహిసస్తానని చెప్పుకొచ్చారు. పలు ఉద్యమాల నుంచి మొన్నటి సింగరేణి ఎన్నికల దాకా కాంగ్రెస్‌ పార్టీతో కలిసి తాము పనిచేశామని గుర్తుచేశారు.

చంద్రబాబు మాకు స్వేచ్ఛ ఇవ్వాలి : ‘‘స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పొత్తులు పెట్టుకునే స్వేచ్ఛను చంద్రబాబు మాకు ఇవ్వాలి. ఒకవేళే పొత్తు పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు కాంగ్రస్‌తో కలిస్తే తప్పేంటి? విదేశీ పర్యటన నుంచి చంద్రబాబు తిరిగొచ్చిన వెంటనే ఆయనను కలుస్తా. టీఆర్‌ఎస్‌లో టీటీడీపీ విలీనం లేదా పొత్తు వ్యవహారంపై బాబు చెప్పే మాటను బట్టి నేను నిర్ణయం తీసుకుంటా’’ అని రేవంత్‌ వెల్లడించారు.

అందుకే దత్తాత్రేయ మంత్రి పదవి తొలిగించారు : తెలంగాణలో బీజేపీ లేదు కనుకనే బండారు దత్తాత్రేయను కేంద్ర మంత్రి పదవి నుంచి తొలిగించారని రేవంత్‌రెడ్డి అన్నారు. ఏపీలో కూడా పొత్తు ఉండబోదని బీజేపీ తేల్చిచెప్పింది. మరలాంటప్పుడు తెలంగాణలో పార్టీని ఎలా కాపాడుకోవాలనేదానిపై టీడీపీకి స్పష్టత ఉండాలికదా అని వ్యాఖ్యానించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top