త్వరగా విచారణ జరపండి

Revant Reddy on the petition of the lucrative positions - Sakshi

  లాభదాయక పదవుల పిటిషన్‌పై రేవంత్‌ రెడ్డి 

  వీలును బట్టి వచ్చే వారమే విచారణ: హైకోర్టు 

సాక్షి, హైదరాబాద్‌: పలువురికి కేబినెట్‌ హోదానిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ తాను దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని త్వరగా విచారించాలని కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డి హైకోర్టును కోరారు. దీనిపై ఆయన అనుబంధ పిటిషన్‌ను దాఖలు చేశారు. అనుబంధ పిటిషన్‌ అంశాన్ని ఆయన తరఫు న్యాయవాది తేరా రజనీకాంత్‌రెడ్డి ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం దృష్టికి తీసుకురాగా.. వీలును బట్టి వచ్చే వారమే విచారిస్తామని కోర్టు స్పష్టం చేసింది. పార్లమెంటరీ కార్యదర్శులుగా లాభదాయక పదవుల్లో కొనసాగుతున్నారంటూ ఇటీవల 20 మంది ఆప్‌ ఎమ్మెల్యేలపై ఎన్నికల కమిషన్‌ అనర్హత వేటు వేసిన నేపథ్యంలో.. తెలంగాణలోనూ పలువురు కేబినెట్‌ హోదా అనుభవిస్తున్నారని, ఇది కూడా లాభదాయక పదవుల కిందకే వస్తుందని అనుబంధ పిటిషన్‌లో పేర్కొన్నారు.

వారి జీతభత్యాలకు ప్రభుత్వం కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోందన్నారు. మంత్రితో సమానంగా కేబినెట్‌ హోదా పొందడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. పదవీ కాలం ముగిసిన తరువాత వారి హోదా చెల్లదని తీర్పునిస్తే చెల్లించిన జీతభత్యాల వసూలు కష్టమవుతుందని వివరించారు. కాబట్టి తాను దాఖలు చేసిన వ్యాజ్యాన్ని త్వరగా విచారించాలని కోరారు. ఈ.బాలకిషన్, ఆర్‌.విద్యాసాగర్‌రావు, ఎ.కె.గోయల్, ఆర్‌.రామలక్ష్మణ్, బీవీ.పాపారావు, కె.వి.రమణాచారి, జీఆర్‌రెడ్డి, దేవులపల్లి ప్రభాకర్‌రావు, పేర్వారం రాములు, డాక్టర్‌ ఎస్‌.వేణుగోపాలాచారి, రామచంద్రుడు తేజావత్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, సోమారపు సత్యనారాయణ, పిడమర్తి రవి, జి.వివేకానంద, వి.ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌ తదితరులకు ప్రభుత్వం కేబినెట్‌ హోదా కల్పించడాన్ని సవాలు చేస్తూ రేవంత్‌రెడ్డి గత ఏడాది జనవరిలో హైకోర్టు పిల్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top