ఊహాగానాలకు చెక్‌.. అనూహ్యంగా తెరపైకి రేవణ్ణ..!

 Revanna Joins Kumaraswamy Pressmeet - Sakshi

సాక్షి, బెంగళూరు : జేడీఎస్‌ సీనియర్‌ నేత, హెచ్‌డీ దేవెగౌడ రెండో తనయుడు రేవణ్ణ బుధవారం అనూహ్యంగా తెరపైకి వచ్చారు. తన తమ్ముడు కుమారస్వామిని జేడీఎస్‌ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నామని ఆయన స్వయంగా తెలిపారు. తద్వారా తాను బీజేపీతో చేతులు కలుపబోతున్నట్టు వస్తున్న ఊహాగానాలకు రేవణ్ణ చెక్‌ పెట్టారు. జేడీఎస్‌ఎల్పీ భేటీ తర్వాత కుమారస్వామితో కలిసి రేవణ్ణ విలేకరులతో మాట్లాడారు.

కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. మ్యాజిక్‌ ఫిగర్‌కు ఆ పార్టీ కొద్ది దూరంలో నిలిచిపోవడంతో ఇతర పార్టీల నుంచి వలసలపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా దేవెగౌడ సొంత కుటుంబంలోని వర్గపోరును ఆసరా చేసుకొని.. రేవణ్ణను తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నట్టు కథనాలు వచ్చాయి. రేవణ్ణకు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి ఇస్తామని ఆఫర్‌ చేయడం ద్వారా ఆయనను తమవైపు ఆకర్షించేందుకు బీజేపీ ప్రయత్నించింది. రేవణ్ణకు 12 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండటంతో సులభంగా బలపరీక్ష గండాన్ని గట్టెక్కవచ్చునని బీజేపీ భావించినట్టు కథనాలు వచ్చాయి.

దేవేగౌడకు నలుగురు తనయులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. దేవేగౌడ మూడో కుమారుడు కుమారస్వామి. తమ్ముడు కుమారస్వామి ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై రేవణ్ణకు వ్యతిరేకత ఉన్నట్లు ప్రచారం జరిగింది. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప కూడా రేవణ్ణ వర్గం మద్దతు తమ పార్టీకి ఉందని గవర్నర్‌తో చెప్పినట్టు కథనాలు వచ్చాయి. అయితే, ఈ కథనాలకు, ఊహాగానాలకు చెక్‌ పెడుతూ.. తాను తమ్ముడి వెంటే ఉన్నానని, ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థి అని రేవణ్ణ స్పష్టం చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top