ఆ పాటలో మీనింగ్‌ ఏంటి.. ఈ దిష్టిబొమ్మలేంటి : వర్మ

Ram Gopal Varma Response On TDP Leaders Protest - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్రానికి సంబంధించిన ‘వెన్నుపోటు’ పాటపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ టీడీపీ నేతలు ఆందోళన చేయడంపై ఆ సినిమా దర్శకుడు రాంగోపాల్‌ వర్మ స్పందించాడు. శనివారం సాక్షితో మాట్లాడుతూ.. ముందుగా ఆ పాటలోని అర్థాన్ని తెలుసుకోవాలని, అవసరమైతే దానికి కౌంటర్‌ ఇవ్వాలన్నారు. అంతేకానీ ఈ దిష్టిబొమ్మలు తగలబెడితే ఏం వస్తుందని ప్రశ్నించాడు. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు ఎందుకు తడుముకుంటున్నారని టీడీపీ నేతలను ఉద్దేశించి నిలదీశాడు. జాతిపిత మహాత్మగాంధీ బయోపిక్‌లోనే అన్ని విషయాలు చూపించారని గుర్తు చేశాడు. బయోపిక్‌ అంటే అన్ని చూపించాలని, కొంత మాత్రమే చూపిస్తే అది బయోపిక్‌ ఎలా అవుతుందన్నాడు. లక్ష్మీపార్వతి ఎన్టీఆర్‌ జీవితంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన చనిపోయే వరకు జరిగినదే లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమా అని స్పష్టం చేశాడు. రియల్‌స్టార్‌ సినిమా కాబట్టే రియల్‌ పాత్రలకు సంబంధించిన ఫొటోలు వాడినట్లు పేర్కొన్నాడు. ఇది కల్పిత కథ కాదని, ఫిల్మ్‌మేకర్‌గా తాను పరిశోధన చేసి తెలుసుకున్న కథతో సినిమా తీస్తున్నానన్నాడు. ఒక్క పాటను చూసే ఎందుకు భయపడుతున్నారని, సినిమా చూస్తేనే ఎవరేవరేం చేశారో తెలుస్తుందని తెలిపాడు. 

వైస్రాయ్‌ హోటల్లో జరిగింది వెన్నుపోటేనని ఎన్టీఆరే చాలా సార్లు చెప్పారని, తానేం కొత్తగా కల్పించలేదన్నాడు. తనకు ఎవరీ మీద కోపం, ప్రేమ లేదన్నాడు. ఎన్టీఆర్‌ జీవితంలో జరిగిందే నిజాయితీగా చూపిస్తానని, తనకు ఎవరీ మద్దతు అవసరంలేదన్నాడు. తన ట్విటర్‌ పోల్‌లో లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌కే మద్దతు తెలుపుతున్నారని ఈ సందర్భంగా వర్మ పేర్కొన్నాడు. ప్రజలకు నచ్చకపోతే చూడరని, కానీ వారెందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదన్నాడు. నిజాలు బయటకు వస్తాయనే భయం ఉన్నవారే సినిమాను ఆపడానికి ప్రయత్నిస్తారని వర్మ అభిప్రాయపడ్డాడు. ఇక వర్మ విడుదల చేసిన వెన్నుపోటు పాటకు విశేష ఆదరణ లభిస్తోంది. ఈ పాటను చూసిన నెటిజన్లు సోషల్‌ మీడియా వేదికగా వర్మపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top