వైఎస్సార్‌సీపీలోకి మేడా మల్లికార్జునరెడ్డి

Rajampet MLA Meda MallikarjunaReddy Joins YSRCP - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, రాజంపేట శాసనసభ్యుడు మేడా మల్లికార్జునరెడ్డి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో అనుచరులతో కలిసి వైఎస్సార్‌సీపీలోకి వచ్చారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీలో కొందరు నేతల దుశ్చర్యలు చూడలేకపోయానని, తనను అన్యాయంగా పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారని ఇదివరకే మేడా మల్లికార్జునరెడ్డి చెప్పారు. వైఎస్సార్‌సీపీ నుంచి రాజంపేట అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టినా కలిసి పనిచేస్తామన్నారు. 2014 ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ జిల్లాలో పోటీ చేసి.. గెలిచిన ఏకైక టీడీపీ అభ్యర్థి మేడా మల్లికార్జునరెడ్డి. ఆయనతోపాటు రాజంపేట నుంచి భారీ ఎత్తున వచ్చిన ఆయన అనుచరులు వైఎస్సార్‌సీపీలో చేరారు. ప్రతి ఒక్కరినీ పలకరించిన వైఎస్‌ జగన్‌.. కండువాలు కప్పి వారిని పార్టీలో ఆహ్వానించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సందడి నెలకొంది.

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశా: మేడా
వైఎస్సార్‌సీపీలో చేరిన సందర్భంగా మేడా మల్లికార్జునరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేసినట్టు ఆయన వెల్లడించారు. స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామా లేఖను తాను పంపానని తెలిపారు. వైఎస్‌ జగన్‌తోనే ఏపీ అభివృద్ధి సాధ్యమని చెప్పారు. గత నాలుగున్నరేళ్లుగా అమలు చేయని హామీలు ఇప్పుడు ఎలా చంద్రబాబు అమలు చేస్తారని మేడా ప్రశ్నించారు. ఎన్నికల నేపథ్యంలోనే చంద్రబాబు కొత్త వాగ్దానాలు ఇస్తున్నారని, ఆయన హామీలను ప్రజలు నమ్మబోరని పేర్కొన్నారు.

గతవారం వైఎస్‌ జగన్‌తో భేటీ!
వైఎస్సార్‌ సీపీ జిల్లా రాజంపేట నియోజకవర్గానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే, ఏపీ ప్రభుత్వ విప్‌ మేడా మల్లిఖార్జున రెడ్డి గత మంగళవారం వైఎస్‌ జగన్‌ను కలిసిన సంగతి తెలిసిందే. టీడీపీలో ఇమడలేకపోతున్నానని, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరుతానని ఆయన వైఎస్‌ జగన్‌ను కోరారు. ఎమ్మెల్యే సహా అధికార పదవులన్నింటికీ రాజీనామా చేయాలని ఈ సందర్భంగా ఆయనకు వైఎస్‌ జగన్‌ సూచించారు. తమ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్టు కొని చంద్రబాబు విలువలు దిగజార్చారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు విలువలు, విశ్వసనీయత ముఖ్యమని పునరుద్ఘాటించారు.

చదవండి: బాబును నమ్మితే రాష్ట్రం సర్వనాశనమవుతుంది : మేడా

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top