బాబును నమ్మితే రాష్ట్రం సర్వనాశనమవుతుంది : మేడా

Rajampet MLA Meda Mallikarjuna Reddy Likely To Join YSRCP - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : చంద్రబాబు గంజాయి వనం నుంచి జగన్‌ తులసి వనంలోకి వచ్చినట్లుగా ఉందని రాజంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ మేడా మల్లికార్జున రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్య విలువలు లేని చంద్రబాబు దగ్గర ఉండలేకపోయామని అందుకే ఇన్నాళ్లు పార్టీకి దూరంగా ఉన్నానని తెలిపారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. ఈనెల 31న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితో సమావేశమైనట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా అన్ని పదవులకు రాజీనామా చేసిన తర్వాతే పార్టీలో చేరమని జగన్ సూచించారని.. ఈ క్రమంలో విప్, ఎమ్మెల్యే పదవులకు, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన లేఖను బుధవారం టీడీపీ అధిష్టానానికి పంపిస్తానన్నారు. దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చానని ప్రస్తుతం సొంత ఇంటికి వచ్చిన భావన కలుగుతోందని ఆనందం వ్యక్తం చేశారు.

నరకయాతన అనుభవించా
టీడీపీలో నాలుగన్నరేళ్లు నరకయాతన అనుభవించానని మేడా ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబును నమ్మి ఇంకా అక్కడ ఉండలేనని, ఆయన చెప్పేది ఒకటి చేసేది ఇంకోటి అని విమర్శించారు. రైతులకు, డ్వాక్రా రుణమాఫీ చేస్తామని, కాపులకు రిజర్వేషన్‌ ఇస్తామంటూ కల్లబొల్లి మాటలు చెప్పి గెలిచిన చంద్రబాబును ప్రజలు ఇప్పుడు నమ్మడం లేదని ఎద్దేవా చేశారు. బాబును ఇంకా నమ్మితే రాష్ట్రం సర్వనాశనం అవుతుందని అన్నారు. వైఎస్సార్‌ రాజకీయ భిక్షం పెడితే ఆదినారాయణ రెడ్డి గెలిచారని.. తర్వాత వంచన చేసి, టీడీపీలో చేరి.. మంత్రి అయ్యారని గుర్తుచేశారు. అటువంటి వ్యక్తికి తనను విమర్శించే అర్హత లేదని ఘాటుగా విమర్శించారు. తనను గెలిపించిన ప్రజల కోసం నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడ్డానని మేడా వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్‌, షర్మిల చేపట్టిన పాదయాత్రలు చరిత్ర సృష్టించాయని.. ప్రజలు వైఎస్సార్‌ సీపీ వైపే ఉన్నారని పేర్కొన్నారు.

 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top