ఇక అన్ని ఎన్నికల్లో గెలుపు మాదే

Rahul Gandhi returns to Ramlila Maidan as Congress starts to get its act together for 2019 - Sakshi

అవినీతి, వ్యవసాయ సంక్షోభంపై మోదీ స్పందించరా?

జన ఆక్రోశ్‌ ర్యాలీలో రాహుల్‌ గాంధీ

అందరినీ మోదీ వంచించారు: సోనియా గాంధీ

ప్రమాదంలో మన ప్రజాస్వామ్యం: మన్మోహన్‌

న్యూఢిల్లీ: ఈ ఏడాది దేశవ్యాప్తంగా జరిగే అసెంబ్లీ ఎన్నికలతోపాటు, 2019 సాధారణ ఎన్నికల్లోనూ విజయం తమదేనని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఆదివారం కాంగ్రెస్‌ చేపట్టిన జన ఆక్రోశ్‌ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు 2014లో తమ పార్టీపై అసత్యాలు ప్రచారం చేశాయని, అయితే వాస్తవాలు ఇప్పుడు బయటకొస్తున్నాయని, ప్రజలు వాటిని గమనిస్తున్నారని చెప్పారు.

ప్రధాని మోదీ, ఎన్డీఏ ప్రభుత్వంపై రాహుల్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ.. అవినీతి, రాజ్యాంగ సంస్థల నిర్వీర్యం తదితర అంశాలపై దేశ కాపలాదారు (చౌకీదారు)గా చెప్పుకుంటున్న ప్రధాని ఎందుకు మౌనం వహిస్తున్నారని నిలదీశారు. జడ్జి లోయా కేసు, వ్యవసాయ సంక్షోభంపై ప్రధాని కనీసం నోరువిప్పలేదని రాహుల్‌ ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌లు కూడా మోదీ ప్రభుత్వ విధానాల్ని తూర్పారబట్టారు. ‘ఇటీవలి చైనా పర్యటనలో డోక్లాంపై మోదీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆయన ఏ తరహా ప్రధాని?’ అని రాహుల్‌ ప్రశ్నించారు. ‘ప్రధాని మోదీ మనకు నిరుద్యోగం, గబ్బర్‌ సింగ్‌ ట్యాక్స్‌(జీఎస్టీని తప్పుపడుతూ)ను ఇచ్చారు. బేటీ పఢావో.. బేటీ బచావో అని చెప్పే ఆయన హయాంలోనే బీజేపీ ఎమ్మెల్యే అత్యాచారానికి (ఉన్నావ్‌ రేప్‌) పాల్పడ్డారు’ అని విమర్శలు గుప్పించారు.

బీజేపీని ఓడిస్తాం: రాహుల్‌
కర్ణాటక, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధిస్తుందని రాహుల్‌ ధీమా వ్యక్తం చేశారు. సీనియర్లు, యువ నేతల్ని కాంగ్రెస్‌ పార్టీ ఒకేలా గౌరవిస్తుందని, పార్టీలో వ్యక్తమయ్యే విభిన్న అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకుంటుందని చెప్పారు. కాంగ్రెస్‌ చేతులకు ముస్లింల రక్తపు మరకలు అంటాయని ఇటీవల కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సల్మాన్‌ ఖుర్షీద్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘పార్టీ విధానాలకు విరుద్ధంగా సల్మాన్‌ ఖుర్షీద్‌ కొన్ని రోజుల క్రితం తన అభిప్రాయాల్ని వెల్లడించారు. పార్టీలో విభిన్న అభిప్రాయాలు ఉండాలన్న విషయాన్ని నేను అంగీకరిస్తా. పార్టీకి లబ్ధి చేకూర్చే వేర్వేరు అభిప్రాయాల్ని అనుమతిస్తా. అయితే ఆర్‌ఎస్‌ఎస్‌పై పార్టీ పోరాడుతున్న ఈ సమయంలో మనం ఐక్యంగా, స్నేహభావంతో సాగాలి’ అన్నారు. ఆ సమయంలో ఖుర్షీద్‌ చప్పట్లు కొట్టడం గమనార్హం.

రాజ్యాంగ సంస్థల్ని బలహీనపర్చారు: సోనియా
తన వాగ్దానాల్ని నిలబెట్టుకోకుండా బీజేపీ ప్రజల్ని మోసగించిందని, ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక అవినీతి లోతుగా పాతుకుపోయిందని కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తప్పుపట్టారు. ‘రాజ్యాంగ సంస్థల్ని బలహీన పరచడంలో ఏ అవకాశాన్ని బీజేపీ వదిలిపెట్టలేదు. ప్రత్యర్థి పార్టీల్ని లక్ష్యంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థల్ని దుర్వినియోగం చేస్తోంది. దేశ అత్యున్నత న్యాయవ్యవస్థలో ఇటీవలి పరిణామాలు.. గతంలో ఎప్పుడూ చోటు చేసుకోలేదు’ అని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ అందరినీ వంచించారనీ దుయ్యబట్టారు. ఈ పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

ఆందోళనలో యువత: మన్మోహన్‌
మోదీ ప్రభుత్వం రాజ్యాంగ సంస్థల్ని బలహీన పరచడంతో దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ‘గత నాలుగేళ్లలో అన్ని వర్గాల మధ్య విద్వేషాలు పెరిగాయి. ఉద్యోగ అవకాశాలు పూర్తిగా కనుమరుగవడంతో యువత ఆందోళనతో ఉంది. దేశమంతా నైరాశ్యం అలముకుంది’ అని అన్నారు.

మానస సరోవర యాత్రకెళ్తా
కర్ణాటక ఎన్నికల అనంతరం టిబెట్‌లోని కైలాశ్‌ మానస సరోవర యాత్రకు వెళ్లాలనుకుంటున్నానని రాహుల్‌ తెలిపారు. ఈ ఆలోచన తనకు ఇటీవల తాను ప్రయాణిస్తున్న విమానం సాంకేతికలోపంతో నేలవైపు దూసుకెళ్తున్న సమయంలో వచ్చిందన్నారు. ‘రెండ్రోజుల క్రితం కర్ణాటకకు విమానంలో వెళ్తున్నాం. ఒక్కసారిగా విమానం ఒక కుదుపునకు లోనైంది. ఎడమవైపు ఒరిగిపోయి, వేగంగా నేలవైపు దూసుకుపోసాగింది.

8 వేల అడుగులు వేగంగా కిందకు దిగింది. ఇక అంతా అయిపోయిందనే అనుకున్నాను. అదే సమయంలో అకస్మాత్తుగా ఒక ఆలోచన వచ్చింది. ఆది దేవుడైన శివుడు జ్ఞాపకమొచ్చాడు. ఆ క్షణంలోనే కైలాశ్‌  మానస సరోవర యాత్ర చేయాలన్న తలంపు వచ్చింది. అందుకే ఇప్పుడు మీ అనుమతి కోరుతున్నా. కర్ణాటక ఎన్నికలు అయిపోయిన తరువాత ఒక 10–15 రోజులు సెలవు తీసుకుని, మానస సరోవర యాత్రకు వెళ్తాను’ అని రాహుల్‌ వివరించారు.

రాహుల్‌వి పగటి కలలే: బీజేపీ
ఇకపై అన్ని ఎన్నికల్లో విజయం తమదేనంటూ రాహుల్‌ పగటి కలలు కంటున్నారని బీజేపీ విమర్శించింది. నిరుత్సాహంలో ఉన్న పార్టీ కేడర్‌లో ఉత్సాహం నింపేందుకు రాహుల్‌ ప్రయత్నిస్తున్నారని కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అన్నారు. ‘ఒక రాష్ట్రం తర్వాత మరో రాష్ట్రంలో జన ఆదేశ్‌తో(ప్రజా తీర్పు) వారు అధికారం కోల్పోయారు. ఇప్పుడు జన ఆక్రోశ్‌(ప్రజాగ్రహం)కు ప్రతినిధులుగా నటిస్తున్నారు. నిజానికిది ‘పరివార్‌ ఆక్రోశ్‌’ ర్యాలీ’ అని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా విమర్శించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top