
సాక్షి, న్యూఢిల్లీ: దేశరాజధానిలోని రామ్‌లీలా మైదానంలో ఆదివారం చేపట్టనున్న భారీ ర్యాలీకి కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమయింది. 2014 ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో మోదీ ప్రభుత్వం విఫలమయిందని ఈ సందర్భంగా చాటనుంది. దీంతోపాటు త్వరలో జరిగే కర్ణాటక ఎన్నికలతో పాటు వచ్చే ఏడాది రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకుంది.
ఎన్నికల కార్యక్షేత్రంలోకి ముందుగానే దూకాలనుకుంటున్న రాహుల్..అందుకు అవసరమైన కొత్త ఏఐసీసీ కూర్పులో తలమునకలై ఉన్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటకల నుంచి పార్టీ శ్రేణులు, నేతలు పెద్ద సంఖ్యలో ఢిల్లీకి చేరుకుంటున్నారని అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా తెలిపారు. రాజధాని చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా భారీగా తరలి రానున్నారనీ, వీరంతా ఆదివారం ఉదయం నుంచి ఇక్కడికి చేరుకుంటారని అన్నారు. లక్షమందికి పైగా ర్యాలీకి తరలివస్తారని ఆయన అంచనా వేశారు.