‘ఆర్థిక భారత’ ఆర్కిటెక్ట్‌

PV Narasimha Rao Special Story - Sakshi

 బహు భాషాకోవిదుడు..అపర చాణక్యుడు

దేశ ప్రధానిగా, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా సేవలు

కేంద్రీయ విద్యాలయాల సృష్టికర్త

మోత్కూరి శ్రీనివాస్‌–మంథని :దేశంలో గాడితప్పిన ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టి ప్రపంచ ముఖచిత్రంలో భారత ఖ్యాతిని నెలబెట్టిన ఘనత పీవీ నరసింహారావుకే దక్కింది. 1991లో భారత ఆర్థిక నిల్వలు తరిగిపోయిన పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థను దారిలో పెట్టి దార్శనికత ప్రదర్శించిన పీవీ.. ఆర్థిక రంగానికి మార్గదర్శిగా నిలిచారు. ప్రధానిగా పగ్గాలు చేపట్టిన ఆయన అపర చాణక్యత ప్రదర్శించి సుస్థిరతకు మారుపేరుగా నిలిచారు.

విపక్షాలు ఎంత వాదించినా తలొగ్గకుండా ఆర్థిక నిపుణుడు మన్మోహన్‌సింగ్‌కు ఆర్థిక మంత్రిత్వశాఖ బాధ్యతలు అప్పగించి పూర్తి స్వేచ్ఛ కల్పించిన ఘనుడు పీవీ నరసింహారావు. ఆయన ఐదేళ్ల కాలంలో భారత ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడమే కాకుండా దేశం ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి బాటలు వేశారు. ఎనిమిదేళ్ల క్రితం అనేక దేశాలు ఆర్థికంగా అతలాకుతం అయినప్పటికీ దాని ప్రభావం మన దేశంపై నామమాత్రమైనా పడలేదంటే నాడు పీవీ ముందుచూపుతో ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలనే చెప్పవచ్చు.

ఓటమి నుంచి ప్రారంభమైన రాజకీయ ప్రస్థానం
విద్యాభ్యాసం తర్వాత న్యాయవాదిగా ప్రాక్టీస్‌ ప్రారంభించేందుకు వచ్చిన పీవీ.. స్వామి రామానంద తీర్థ శిష్యరికంలో మొదట 1952లో కరీంనగర్‌ పార్లమెంట్‌ నుంచి పోటీచేసి కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి బద్దం ఎల్లారెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు. అటు తర్వాత 1957లో మొట్టమొదటిసారిగా మంథని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అలాగే 1962, 67, 72 సంవత్సరాలలో జరిగిన ఎన్నికల్లో నిలిచి శాసనసభ్యునిగా విజయం సాధించారు. 1972లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1977 వరకు అవే బాధ్యతలు నిర్వర్తించారు. అటు తర్వాత హన్మకొండ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి గెలుపొందారు. ప్రధాని ఇందిరాగాంధీ మృతితో 1980లో మధ్యంతర ఎన్నికలు రావడంతో మళ్లీ అదే స్థానం నుంచి పోటీచేసి విజయం సాధించారు. తిరిగి 1984లో హన్మకొండ నుంచి, మహారాష్ట్రలోని రాంటెక్‌ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసిన ఆయన హన్మకొండలో ఓటమి చవిచూశారు. రాంటెక్‌ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచిన ఆయన కేంద్ర విదేశీ వ్యవహారాలు, హోంమంత్రిగా పనిచేశారు. 1984లో అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీకి ముఖ్య సలహాదారుగా వ్యవహరించారు. అనంతరం కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖలో పనిచేశారు. కాగా రాజీవ్‌ హత్యానంతరం రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉన్నారు.

ప్రధానిగా దేశానికి దిశానిర్దేశం..
1991లో రాజీవ్‌ హత్యానంతరం కాంగ్రెస్‌ బాధ్యతలు ఎవరు చేపట్టాలనే ప్రశ్న పార్టీలో తలెత్తింది. నిజానికి ఆ సమయంలో పీవీ రాజకీయాలకు దూరంగా ఉన్నారు.రాజీవ్‌ హత్యానంతరం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ సంపూర్ణ మెజారిటీ సాధించింది. ప్రధానిగా పీవీ పేరును కాంగ్రెస్‌ పార్టీలోని అందరూ ప్రతిపాదించారు. పీవీనే ప్రధాని పదవికి అర్హుడని ఏకగ్రీవంగా మద్దతు తెలపడంతో ప్రధాని పగ్గాలు అప్పగించారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆరు మాసాల్లోపు కర్నూలు జిల్లా నంద్యాల నుంచి ఎంపీగా పోటీచేసి గెలుపొందారు. 1991 నుంచి 96 వరకు దేశ ప్రధానిగా సమర్థంగా వ్యవహరించారు. అదే సమయంలో ఆయన ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు దేశాన్ని ప్రగతి పథంలో నడిపించడమే కాక భారత ప్రగతి ప్రస్థానాన్ని కొత్త మలుపు తిప్పాయి.

కేంద్రీయ విద్యాలయాల రూపకర్త
దేశ ప్రధానిగా పీవీ నరసింహారావు పనిచేసిన సమయంలో కేంద్రీయ విద్యాలయాలను, నవోదయ విద్యాసంస్థలను ఏర్పరిచారు. నాడు ఆయన ప్రవేశపెట్టిన ఈ విద్యాలయాలు నేడు ఎందరో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు వరంగా మారాయి. 

భూ సంస్కరణలు ఆయన చలవే..
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పీవీ పనిచేసిన సమయంలో భూ సంస్కరణ చట్టం తీసుకొచ్చి వందలాది ఎకరాలను కలిగి ఉన్న భూస్వాముల నుంచి  భూములను ఒకే చట్టం ద్వారా ప్రభుత్వం స్వాధీనం చేసుకునేట్టు చేశారు. భూస్వాముల ఆగ్రహావేశాలను లెక్క చేయకుండా భూసేకరణ చట్టం పకడ్బందీగా అమలు చేసిన ధైర్యశాలి. పీవీ స్వతహాగా భూస్వామ్య కుటుంబానికి  చెందిన తన వద్ద ఉన్న 1200 ఎకరాల భూమిని వదులుకున్న ధైర్యశాలి. పీవీ ముఖ్య మంత్రిగా ఉన్న కాలంలో పెత్తందార్లు అడవుల్లో వన్యమృగాలను చంపడంతో చలించిపోయి వాటి సంరక్షణకు వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని తీసుకొచ్చారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top