సర్వాంగ సుందరంగా శివాజీ పార్క్‌

Preparations underway at Shivaji Park for the swearing-in ceremony of Uddhav Thackeray - Sakshi

ముంబై/న్యూఢిల్లీ: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే (59) ప్రమాణ స్వీకారోత్సవానికి చకచకా ఏర్పాట్లు జరగుతున్నాయి. శివాజీ పార్క్‌ గ్రౌండ్‌లో గురువారం సాయంత్రం 6.40 గంటలకు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ల కూటమి ‘మహారాష్ట్ర వికాస్‌ అఘాడి’ తరఫున ఆయన ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేయనున్నారు.

తొలిసారి ఠాక్రే కుటుంబ సభ్యుడు ముఖ్యమంత్రి పదవి స్వీకరిస్తుండటంతో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. ప్రమాణ స్వీకారం జరగనున్న శివాజీ పార్క్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రజలు, శివసేన కార్యకర్తలు భారీగా తరలివస్తారని భావిస్తున్నారు. వేదికపైనే 100 మంది కూర్చునేలా భారీ వేదికను శివాజీ పార్క్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేస్తున్నారు. మైదానంలో 70 వేల కుర్చీలు వేస్తున్నారు.

ప్రమాణ స్వీకారానికి అతిరథ మహారథులు
ముఖ్యమంత్రిగా ఉద్ధవ్‌ ప్రమాణ స్వీకారోత్సవానికి  కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ సోనియాగాంధీని ఆయన కొడుకు ఆదిత్య ఠాక్రే ఆహ్వానించారు. సోదరుడు, మహారాష్ట్ర నవనిర్మాణసేన (ఎమ్మెన్నెస్‌) అధ్యక్షుడు రాజ్‌ ఠాక్రేను ఉద్ధవ్‌ స్వయంగా ఆహ్వానించారు. కార్యక్రమానికి సోనియాగాంధీతోపాటు  పశ్చిమబెంగాల్, ఢిల్లీ, రాజస్తాన్‌ సీఎంలు, డీఎంకే చీఫ్‌ స్టాలిన్‌ తదితరులు హాజరయ్యే అవకాశముందని తెలిపాయి. ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్‌ అమిత్, బీజేపీ అగ్రనేత అద్వానీలను కూడా శివసేన ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ప్రమాణ స్వీకారానికి మహారాష్ట్రకు చెందిన 400 మంది రైతులను శివసేన ఆహ్వానించింది. వారిలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబ సభ్యులు ఉన్నారు.  

భద్రతపై హైకోర్టు ఆందోళన
ప్రమాణ కార్యక్రమాన్ని శివాజీ పార్క్‌లో జరపడాన్ని బొంబాయి హైకోర్టు తప్పుబట్టింది. ప్రమాణస్వీకారంపై తాము స్పందించడం లేదని, కేవలం శివాజీ పార్క్‌ వంటి బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల తలెత్తే భద్రతాపరమైన సమస్యలపైనే ఆందోళన వ్యక్తం చేస్తున్నామని జస్టిస్‌ ధర్మాధికారి, జస్టిస్‌ చాగ్లాల బెంచ్‌ బుధవారం వ్యాఖ్యానించింది. వీకామ్‌ ట్రస్ట్‌ అనే ఎన్జీవో వేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా కోర్టుపై వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి భారీ బహిరంగ కార్యక్రమాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగరాదని కోరుకుంటునట్టు పేర్కొంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top