
సాక్షి ప్రతినిధి, చెన్నై: రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత సహ నటుడు రజనీకాంత్‌తో తనకు అభిప్రాయభేదాలు ఏర్పడ్డాయని మక్కల్ నీది మయ్యం పార్టీ చీఫ్ కమల్‌హాసన్ చెప్పారు. సినిమాల్లో ఉన్నప్పుడు రజనీతో తనకున్న స్నేహానికి రాజకీయాలు చెక్ పెట్టాయని స్పష్టం చేశారు. ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమల్ మాట్లాడుతూ.. ‘రజనీ రాజకీయాలతో నా రాజకీయ పయనాన్ని పోల్చిచూడవద్దు. రజనీ ఆధ్యాత్మిక రాజకీయాలపై నాకు నమ్మకం లేదు. నాకు ఎలాంటి మతాలు లేవు. అన్ని మతాలు సమ్మతమే.
రజనీది ఆధ్యాత్మిక పార్టీ. నా పార్టీది లౌకిక సిద్ధాంతం.. సినిమాల సమయంలో కొనసాగిన స్నేహాన్ని రాజకీయాల్లో ఆశించలేం. రాజకీయాల్లో మా ఇద్దరి మధ్య నెలకొన్న అభిప్రాయభేదాలను తలచుకుంటే బాధగా ఉంది. ఒకరినొకరం విమర్శించుకోకుండా గౌరవప్రదమైన రాజకీయాలు సాగించాలని ఇద్దరం కోరుకుంటున్నాం’ అని తెలిపారు. మరోవైపు హిమాలయాల పర్యటనలో ఉన్న రజనీకాంత్ సంపూర్ణ అరోగ్య పరీక్షల నిమిత్తం అక్కడి నుంచి నేరుగా అమెరికా వెళ్లనున్నారు.