వరుస భేటీలతో హస్తినలో ఉత్కంఠ

PM Modi  Meets NDA Ministers Ahead Of Amit Shahs Dinner Meet - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు ముందు ఢిల్లీలో ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. పాలక, విపక్షాలు వరుస భేటీలతో ఎన్నికల ఫలితాల అనంతరం అనుసరించాల్సిన వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. కాంగ్రెస్‌ సహా 20కి పైగా విపక్ష పార్టీలు మంగళవారం మధ్యాహ్నం సమావేశమై ఫలితాల అనంతరం ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై విస్తృతంగా చర్చించాయి.

ఈవీఎంలపై సందేహాలు వ్యక్తమవుతున్న క్రమంలో తొలుత ఈవీఎంలతో వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కించాలని  విపక్ష పార్టీలు ఈసీని కలిసి వినతిపత్రం సమర్పించాయి. మరోవైపు సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే గెలుపొంది తిరిగి అధికారం చేపడుతుందన్న ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలతో బీజేపీలో జోష్‌ నెలకొంది. విస్పష్ట ఆధిక్యత వచ్చినా, రాకున్నా ఎన్డీయే పక్షాలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెబుతున్న కమలనాధులు ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న ఎన్డీయే మంత్రుల భేటీలో ఎగ్జిట్‌ పోల్స్ సమీక్షతో పాటు ఎన్నికల ఫలితాల అనంతరం ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్లాలనే దానిపై సంప్రదింపులు జరిపారు. ఇక మంగళవారం రాత్రి ఎన్డీయే భాగస్వామ్య పక్షాలకు బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా  విందు ఇచ్చారు.

ఈ విందు భేటీలో నితీష్‌ కుమార్‌, ఉద్ధవ్‌ థాకరే, రాం విలాస్‌ పాశ్వాన్‌ సహా పలువురు ఎన్డీయే నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎన్నికల ఫలితాల అనంతరం చేపట్టాల్సిన కసరత్తుపై వారు సంప్రదింపులు జరిపారు. ఇక ఏడు దశల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఈనెల 23న వెల్లడవనున్న ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top