అడ్డంకులు, ఆలస్యం వారి నైజం

PM Modi inaugurates KMP Expressway, attacks Congress over delay - Sakshi

కాంగ్రెస్‌ పాలనపై ప్రధాని మోదీ విమర్శలు

కేఎంపీ ఎక్స్‌ప్రెస్‌ హైవేను ప్రారంభించిన ప్రధాని

గుర్‌గ్రామ్‌: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. అడ్డంకులు సృష్టించడం ద్వారా ప్రాజెక్టులను జాప్యం చేసి ప్రజలను మోసగించిందని విమర్శించారు. సోమవారం ఆయన హరియాణా రాష్ట్రం గుర్‌గ్రామ్‌ జిల్లాలోని 83 కిలోమీటర్ల కుండ్లి–మనేసర్‌–పల్వాల్‌ (కేఎంపీ) ఎక్స్‌ప్రెస్‌ వేను ప్రారంభించారు. అనంతరం సుల్తాన్‌పూర్‌లో జరిగిన సభలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా 3.2 కిలోమీటర్ల వల్లభ్‌గఢ్‌– ముజేసర్‌ మెట్రో రైల్‌ లింక్‌ ప్రారంభోత్సవం, పల్వాల్‌ జిల్లాలో శ్రీ విశ్వకర్మ స్కిల్‌ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ..‘హర్యానా ప్రజలకు ఇది చాలా ముఖ్యమైన రోజు. చేపట్టిన పనిని దృఢ సంకల్పంతో పూర్తి చేయడమనే మా ప్రభుత్వ వైఖరితోపాటు గత పాలకులు ఇదే పనిని అసంపూర్తిగా వదిలేసిన తీరును మనం ఇక్కడ గమనించాలి. వాస్తవానికి ఈ ప్రాజెక్టు 9 ఏళ్ల క్రితమే ఢిల్లీలో కామన్వెల్త్‌ క్రీడల సమయంలోనే పూర్తి కావాల్సి ఉంది. కానీ, అలా జరగలేదు. 12 ఏళ్లు పట్టింది. అంచనా వ్యయం రూ.1,200 కోట్ల నుంచి భారీగా పెరిగిపోయింది. కామన్‌వెల్త్‌ క్రీడల నిర్వహణలో (సీడబ్ల్యూజీ కుంభకోణం) జరిగిందే, ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణంలోనూ చోటుచేసుకుంది.

అవాంతరాలు కల్పించడం, తప్పుదోవ పట్టించడం, ఆలస్యం చేయడం (అట్కానా, భట్కానా, లట్కానా) గత పాలకుల నైజం. దీనివల్ల రాష్ట్ర ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ప్రజల డబ్బు వృథా కావడంతోపాటు, ప్రజలకు అన్యాయం ఎలా జరిగిందో చెప్పేందుకు ఇది ఒక ఉదాహరణ’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ సత్యదేవ్‌ నారాయణ్‌ ఆర్య, ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.

135 కిలోమీటర్ల పొడవైన కేఎంపీ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ.6,400 కోట్లు వెచ్చించింది. దీనిలోని 52 కిలోమీటర్ల రహదారి 2016లోనే అందుబాటు లోకి వచ్చింది. వల్లభ్‌గఢ్‌– ముజేసర్‌ మెట్రో రైల్‌ లింక్‌ నిర్మాణానికి రూ.580 కోట్లు ఖర్చు కాగా, శ్రీ విశ్వకర్మ స్కిల్‌ యూనివర్సిటీ నిర్మాణానికి రూ.989 కోట్లు కేటాయించారు. జాతీయ రాజధాని ప్రాంతంలోని కేఎంపీ ఎక్స్‌ప్రెస్‌ వే అందుబాటులోకి రావడంతో ఢిల్లీకి వాహనాల రాకపోకల రద్దీ గణనీయంగా తగ్గడంతోపాటు రాజధాని ప్రాంతంలో కాలుష్యం కూడా తగ్గుముఖం పట్టనుంది.

పూర్తికాని కేఎంపీతో ముప్పు: కాంగ్రెస్‌
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అసంపూర్తి కేఎంపీ ఎక్స్‌ప్రెస్‌వేను చట్టవిరుద్ధంగా ప్రారంభించి ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేసిందని కాంగ్రెస్‌ ఆరోపించింది. ఎన్నికల సమయంలో తక్షణ లబ్ధి పొందే ఉద్దేశంతోనే ప్రధాని మోదీ ఎక్స్‌ప్రెస్‌వేపై రాకపోకలను ప్రారంభించారని విమర్శించింది.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top