మజ్‌బూత్‌? మజ్‌బూర్‌?

PM Modi addresses BJP national council meeting - Sakshi

ఏ ప్రభుత్వం కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలి

మహాకూటమి విఫల ప్రయోగం

బీజేపీ జాతీయ మండలి సమావేశంలో మోదీ

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ‘నిజాయితీపరుడు, కష్టించి పనిచేసే వ్యక్తా? లేక దేశంలో ఉండాల్సిన సమయంలో విదేశాలకు వెళ్లే అవినీతిపరుడా? ప్రధానిగా ఎవరు కావాలో ప్రజలు ఎన్నుకోవాలి’ అని బీజేపీ జాతీయ మండలి సమావేశాల వేదికగా ప్రధాని మోదీ రాబోయే లోక్‌సభ ఎన్నికలకు సమరశంఖం పూరించారు. విపక్షాలు ఏర్పాటుచేయాలనుకుంటున్న మహాకూటమి విఫల ప్రయోగమవుతుందని ఎద్దేవా చేశారు. బంధుప్రీతి, అవినీతి కోసం నిస్సహాయ, బలహీన(మజ్‌బూర్‌) ప్రభుత్వం ఏర్పడాలని ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయని ఆరోపించారు.

కానీ దేశ సమగ్రాభివృద్ధి కోసం బలమైన(మజ్‌బూత్‌) ప్రభుత్వం ఉండాలని బీజేపీ పాటుపడుతోందని అన్నారు. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో శనివారం ముగిసిన బీజేపీ జాతీయ మండలి సమావేశాల్లో మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా రామ మందిర నిర్మాణ అంశాన్ని ప్రస్తావించిన మోదీ..సుప్రీంకోర్టులో కేసు త్వరగా పరిష్కారం కాకుండా కాంగ్రెస్‌ తన లాయర్ల ద్వారా అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు. అగ్రవర్ణ పేదలకు 10 శాతం కోటా కల్పించడం వల్ల ఇతర వర్గాల ప్రయోజనాలు దెబ్బతినవని చెప్పారు.  

అవినీతి లేని ఏకైక ప్రభుత్వమిదే..
దేశ చరిత్రలో అవినీతి ఆరోపణలు రాని ఏకైక ప్రభుత్వం తమదేనని మోదీ చాటిచెప్పారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పనిచేయడమే ప్రాథమిక లక్ష్యంగా ఏర్పడిన పార్టీలు ఇప్పుడు అదే పార్టీతో చేతులు కలిపాయని పరోక్షంగా విపక్షాల సిద్ధాంతాల్ని తప్పుపట్టారు. ‘ కేంద్రంలో బలహీన ప్రభుత్వం ఉంటే విచ్చలవిడిగా అవినీతికి పాల్పడొచ్చని, తమ బంధువులు, మిత్రులకు దోచిపెట్టొచ్చని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. నల్లధనం, అవినీతిపై చౌకీదార్‌ సాగించిన పోరాటంతో రాజకీయాల్లో పెనుమార్పులు వచ్చాయని తెలిపారు. ‘ ఇంట్లో పని ఉన్న సమయంలో విహారయాత్రలకు వెళ్లే పనివాడిని ఎవరైనా కావాలనుకుంటారా? ఆయన (పరోక్షంగా రాహుల్‌ గాంధీ) అప్పుడప్పుడు ఎక్కడికి వెళ్తారో ఎవరికీ తెలియదు. మరి ఈ దేశానికి ఎలాంటి పనివాడు కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలి’ అని అన్నారు.

రైతులే నవభారత చోదక శక్తులు..
2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు కేంద్రం పగలూ రాత్రి కష్టపడుతోందని మోదీ చెప్పారు. గత ప్రభుత్వాలకు రైతులంటే కేవలం ఓటర్లేనని, కానీ తమ ప్రభుత్వం వారి సమస్యల పరిష్కారానికి పాటుపడుతోందని అన్నారు. ‘స్వామినాథన్‌ కమిటీ సిఫార్సులను అమలుచేసింది బీజేపీ ప్రభుత్వమే. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం ఫలితంగానే రైతులు ఈరోజు దుర్భర స్థితిలో ఉన్నారు. ఉత్పత్తి వ్యయానికి 1.5 రెట్ల కనీస మద్దతు ధర అందించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఎదుర్కొంటున్న సమస్యల్ని తొలగించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం’ అని మోదీ అన్నారు. విద్య, ఉద్యోగాల్లో అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడం ద్వారా నవభారతం విశ్వాసం పెంపొందుతుందని మోదీ అన్నారు. కొత్త కోటా వల్ల ఇతరుల ప్రయోజనాలకు ఎలాంటి భంగం వాటిల్లదని హామీ ఇచ్చారు.

ఆ ఓటమితో ఢీలా పడొద్దు: షా
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ప్రసంగిస్తూ..ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ వైఫల్యం పట్ల ఢీలా పడొద్దని కార్యకర్తలకు ఆయన సూచించారు. మూడు ఉత్తరాది రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ గెలిచినా కూడా తమ పార్టీ మూలాలు పటిష్టంగానే ఉన్నాయని వారిలో ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం చేశారు. కులతత్వం, బంధుప్రీతి, బుజ్జగింపు రాజకీయాలకు కాంగ్రెసే కారణమని, ఫలితంగా ప్రజాస్వామ్యం బలహీనపడి, అభివృద్ధి మందగించిందని మండిపడ్డారు. ప్రచార సమయంలో దేశంలోని ప్రతి ఓటరుకు చేరువకావాలని సూచించారు. పోలింగ్‌ రోజున తమ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులంతా ఉదయం 10.30 గంటల లోపే ఓటుహక్కు వినియోగించుకునేలా చూడాలని ఆదేశించారు. మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ స్పందించింది. రాబోయే లోక్‌సభ ఎన్నికలు నియంతృత్వం, ప్రజాస్వామ్యం మధ్యే జరుగుతాయని కాంగ్రెస్‌ పేర్కొంది.

స్థిరత్వమా? అస్థిరతా?
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు..స్థిరత్వం, అస్థిరతలలో ఒకదాన్ని ఎన్నుకోవాలని, నిజాయితీ, ధైర్యశాలి నాయకుడైన మోదీకి..నాయకుడు తెలియని అవకాశవాద కూటమికి మధ్య పోటీ అని శనివారం ఆమోదించిన తీర్మానంలో బీజేపీ పేర్కొంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమి నుంచి పార్టీ కార్యకర్తలు పాఠాలు నేర్చుకుని, లోక్‌సభ ఎన్నికల కోసం ఉత్సాహంగా పనిచేయాలని సూచించింది. ఈ తీర్మానం వివరాల్ని కేంద్ర మంత్రి రవిశంకర్‌  వెల్లడిస్తూ..మోదీపై విద్వేషమే విపక్షాలను ఒకటి చేస్తోందన్నారు. ఎన్డీయే హయాంలో భారత్‌ వర్ధమాన ప్రపంచ శక్తిగా, మోదీ ప్రపంచ స్థాయి నేతగా ఎదిగారని పేర్కొన్నారు. ఒకవేళ ప్రతిపాదిత విపక్ష కూటమి అధికారంలోకి వస్తే 1990ల నాటి అస్థిర ప్రభుత్వం ఏర్పడుతుందని హెచ్చరించింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top