బాబు ‘ప్యాకేజీ లేఖ’

Piyush Goyal Comments On Chandrababu About AP Special Catogiry Status - Sakshi

హోదాను పణంగా పెట్టి ప్యాకేజీకి సై అంటూ కేంద్రానికి లేఖ రాసిన చంద్రబాబు

ఇదిగో ఆ లేఖ.. బయటపెట్టిన కేంద్ర మంత్రి పీయూష్‌ గోయెల్‌

లేఖపై ఆయనే స్వయంగా సంతకం చేశారు  

ప్యాకేజీని అమలు చేయాలంటూ ఎన్డీయే నుంచి విడిపోయాక కూడా 2018 జూలై 5న మరో లేఖ రాశారు  

ప్యాకేజీ కింద ఎంత ఇవ్వాలో రాష్ట్ర ప్రభుత్వమే లెక్కలు వేసింది

రూ.17,500 కోట్ల ఆర్థిక సాయం చేయాలని చంద్రబాబు కోరారు  

ప్యాకేజీ ఇవ్వడానికి నరేంద్ర మోదీ ముందుకొచ్చారు  

లేఖల ప్రతులను మీడియాకు విడుదల చేసిన పీయూష్‌ గోయెల్‌  

ఏపీకి కేంద్రం చేసిన సహాయంపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌  

హోదాతో సహా కేంద్ర సాయంపై బహిరంగ చర్చకు సిద్ధమా?

సీఎం చంద్రబాబుకు పీయూష్‌ గోయెల్‌ సవాల్‌  

రాజధాని నిర్మాణానికి రూ.3,500 కోట్లు మంజూరు చేశాం 

అందులో రూ.2,500 కోట్లు విడుదల చేశాం..  

అమరావతిలో ఒక్క శాశ్వత భవనం కూడా నిర్మించలేదు  

టీడీపీ ఇప్పుడు రాజకీయ పార్టీ కాదు.. ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ  

రాష్ట్రంలో ఐటీ, ఈడీ దాడులు జరిగితే బాబు భయపడుతున్నారు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నారని రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయెల్‌ స్పష్టం చేశారు. ప్యాకేజీకి అంగీకారం తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర సర్కారుకు చంద్రబాబు రాసిన లేఖను ఆయన బయటపెట్టారు. చంద్రబాబే స్వయంగా సంతకం చేసి ఆ లేఖను పంపారని పేర్కొన్నారు. ప్యాకేజీకి అంగీకరిస్తూ 2016 అక్టోబర్‌ 24న రాసిన లేఖతోపాటు ఎన్డీయే ప్రభుత్వం నుంచి తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చాక కూడా ప్యాకేజీని అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ 2018 జూలై 5న రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి రాసిన మరో లేఖను కూడా పీయూష్‌ గోయెల్‌ మీడియా ముందు పెట్టారు. ప్యాకేజీ కింద రాష్ట్రానికి ఎంత మొత్తం ఇవ్వాలన్నది కూడా రాష్ట్ర ప్రభుత్వమే తమ అధికారుల ద్వారా లెక్కించి, ఆ వివరాలను కేంద్రానికి నివేదించిందని వెల్లడించారు. ప్యాకేజీకి ఒప్పుకుని, ఇప్పుడు ప్రత్యేక హోదా పేరుతో రాష్ట్ర ప్రజలను వంచిస్తున్నారని చంద్రబాబుపై మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయడానికి పీయూష్‌ గోయెల్‌ మంగళవారం విజయవాడకు వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.  
 
ప్యాకేజీ కింద రూ.17,500 కోట్లు ఇవ్వాలన్నారు  

ప్రత్యేక ప్యాకేజీ కింద ఏపీకి ఎన్ని నిధులు ఇవ్వాలన్నది కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది కాదని.. ప్యాకేజీగా రూ.17,500 కోట్ల ఆర్థిక సహాయం చేయాలని చంద్రబాబే తన రాష్ట్ర ప్రభుత్వ అధికారుల ద్వారా లెక్కలు వేయించి పంపారని పీయూష్‌ గోయెల్‌ చెప్పారు. రాష్ట్రంలో అమలు చేసే పథకాలకు కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులు ఇస్తుంది, ప్రత్యేక హోదా ఉంటే 90 శాతం నిధులను కేటాయిస్తుంది. హోదా ద్వారా 90 శాతం నిధులు రాష్ట్రానికి వస్తే ప్రతిఏటా ఏపీకి రూ.3,500 కోట్లు అదనం వస్తాయని కేంద్రానికి నివేదించారని పేర్కొన్నారు. అవన్నీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన వివరాలేనని, కావాలంటే లేఖలో చూసుకోవచ్చంటూ ఆ ప్రతులను మీడియాకు విడుదల చేశారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల అనంతరం ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు ఇచ్చే నిధులను రెవెన్యూ లోటు భర్తీ రూపంలో అందజేయాలని కేంద్రం నిర్ణయించిందని గుర్తుచేశారు. ఈ మేరకు ఈశాన్య రాష్ట్రాలు, జమ్ముకశ్మీర్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌కు రెవెన్యూ లోటు భర్తీ కింద నిధులు అందజేస్తుందని చెప్పారు. రెవెన్యూ లోటు భర్తీ రూపంలో రూ.22,113 కోట్లు ఇస్తూనే, ఏపీ అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ కట్టుబడి ఉండడం వల్లే ప్రత్యేక ప్యాకేజీ కింద మరో రూ.17,500 కోట్లు ఇవ్వడానికి ముందుకొచ్చారని వివరించారు.  
 
చంద్రబాబుకు సవాల్‌ విసురుతున్నా..  
ప్రత్యేక హోదా అంశంతోపాటు ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు, మంజూరు చేసిన సంస్థల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని పీయూష్‌ గోయల్‌ తేల్చిచెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి మంజూరు నిధుల గురించి అరగంట పాటు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. చంద్రబాబుకు సవాల్‌ విసురుతున్నానని, బహిరంగ చర్చకు ఆయన ఎప్పుడైనా ఢిల్లీకి రావచ్చని, చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ‘‘ఏపీ అభివృద్ధి కోసం నరేంద్ర మోదీ ఏం చేశారో దేశ ప్రజలందరికీ తెలియాలి. బహిరంగ చర్చకు రండి’’ అని పీయూష్‌ గోయెల్‌ సవాల్‌ విసిరారు.  
 
రాజధానిలో అంతా అవినీతే..  
ఐదేళ్లలో కేంద్ర పన్నులో రాష్ట్ర వాటాగా ఇచ్చే రూ.2.42 లక్షల కోట్లకు తోడు వివిధ అభివృద్ధి కార్యక్రమాల కింద మరో రూ.5 లక్షల కోట్ల విలువైన పనులను కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు మంజూరు చేసిందని పీయూష్‌ గోయెల్‌ చెప్పారు. రాజధాని నిర్మాణానికి రూ.3,500 కోట్లు మంజూరు చేసి, అందులో రూ.2,500 కోట్లు విడుదల చేసినప్పటికీ అమరావతిలో ఇప్పటిదాకా ఒక్క శాశ్వత భవన నిర్మాణం చేపట్టిన దాఖలాలు లేవని విమర్శించారు. ఆ డబ్బులు ఏం చేశారో తెలియదన్నారు. రాజధానిలో చిన్న వర్షానికే లీకయ్యే తాత్కాలిక భవనాలను చదరపు అడుగుకు రూ.10 వేలు ఖర్చు పెట్టి నిర్మించారని ఆక్షేపించారు. అంతా అవినీతేనని దుయ్యబట్టారు. విశాఖపట్నంలో కొత్త రైల్వేజోన్‌తో పాటు రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దీనివల్ల రైల్వేలో తెలుగువారికి, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుందన్నారు.  
 
కేంద్ర పథకాలకు బాబు స్టిక్కర్‌  
కేంద్రంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏపీ ప్రజలకు ఎంతో చేసిందని, రాష్ట్రంలో చంద్రబాబు ఏం చేశారో ప్రజలకు చెప్పాలని పీయూష్‌ గోయెల్‌ డిమాండ్‌ చేశారు. విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని, కేంద్ర పథకాల పేర్లు మార్చి అవి చంద్రన్న పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. కేంద్ర పథకాలకు చంద్రబాబు తన స్టిక్కర్లు వేసుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఇప్పుడు మిగులు విద్యుత్‌ ఉందంటే.. అది కేంద్రం సహకారం వల్లేనని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి నరేంద్ర మోదీ కట్టుబడి ఉన్నారని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం చేస్తున్న సహాయంపై చంద్రబాబు ప్రభుత్వం, అధికార తెలుగుదేశం పార్టీ అబద్ధపు ప్రచారం సాగిస్తున్నాయని తప్పుపట్టారు. దుగరాజపట్నం పోర్టు బదులు మేజరు పోర్టు నిర్మాణానికి ప్రత్యామ్నాయ స్థలం చూపాలని అడిగితే.. రామాయపట్నంలో మైనర్‌ పోర్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వమే శంకుస్థాపన చేసుకుని ప్రజలను మోసం చేయాలని చూస్తోందని మండిపడ్డారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం విషయంలో మరో నాటకం మొదలుపెట్టి, శంకుస్థాపన చేశారని అన్నారు. ఇవన్నీ ఎన్నికల సమయంలో ప్రజలను మోసం చేయడానికి ఆడుతున్న డ్రామాలని దుయ్యబట్టారు.  
 
ఎన్టీఆర్‌ను కూలదోసిన వారితో దోస్తీనా?  
బీజేపీతో తెలుగుదేశం పార్టీ కలిసి ఉన్నా లేకున్నా 2019లో కేంద్రంలో మరోసారి నరేంద్ర మోదీ ప్రభుత్వం రాబోతోందని పీయూష్‌ గోయెల్‌ చెప్పారు. పార్టీలను మార్చడంలో చంద్రబాబు గత చరిత్రను అందరూ గమనించాలని అన్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావును ముఖ్యమంత్రి పదవి నుంచి కూలదోసిన పార్టీతో, అందుకు కారణమైన కుటుంబ వ్యక్తులతోనే ఇప్పుడు చంద్రబాబు దోస్తీ చేస్తూ, కౌగిలింతలు చేసుకుంటున్నారని విమర్శించారు. ఇలాంటివి చంద్రబాబుకు కొత్త కాదన్నారు. వాజ్‌పేయ్‌తో చేతులు కలిపి మోసం చేశారని, మోదీతో జట్టుకట్టి మోసం చేశారని, ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్‌తో జత కలిశారని అన్నారు. అవినీతి, కుటుంబ పాలన సాగిస్తున్న చంద్రబాబును ఈ ఎన్నికల్లో ప్రజలు దూరం పెట్టడం ఖాయమని పేర్కొన్నారు. టీడీపీ రాజకీయ పార్టీ స్థాయి నుంచి ఇప్పుడు ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ స్థాయికి పడిపోయిందన్నారు. పార్టీ ద్వారా పదవులు సంపాదించుకుంటున్నారని, అవినీతి చేసి లాభాలు పొందుతున్నారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్, బావమరిది బాలకృష్ణ, బావమరిది చిన్న అల్లుడితోపాటు ఆ కుటుంబం నుంచి ఇంకెంత మంది పోటీ చేస్తున్నారో తనకు తెలియదని పీయూష్‌ గోయెల్‌ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఎక్కడ ఐటీ, ఈడీ దాడులు జరిగినా చంద్రబాబు భయపడుతున్నారంటే ఆయన ఏ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారో ఊహించుకోవచ్చని చెప్పారు. దేశ భద్రతను కాపాడే ప్రభుత్వం అవసరమని, నరేంద్ర మోదీతోనే ఇది సాధ్యమని పునరుద్ఘాటించారు. ఏపీలో అవినీతి రహిత పాలనకు బీజేపీ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ప్రజలను కోరారు.  


 ప్రత్యేక ప్యాకేజీ కోసం 2016 అక్టోబర్‌ 24న అరుణ్‌ జైట్లీకి సీఎం చంద్రబాబు రాసిన లేఖ 
​​​​​​​

ఎన్ని హామీలు అమలు చేశావు బాబూ: కన్నా  
రాష్ట్రంలో గత ఐదేళ్లలో తాను చేసింది ఏమిటో చెప్పుకోలేక సీఎం చంద్రబాబు రోజూ ఎవరో ఒకరిని తిడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు 600కిపైగా హామీలిచ్చారని, వాటిలో ఎన్ని అమలు చేశారో చెప్పాలన్నారు. చంద్రబాబు తన ప్యాలెస్‌ను హైదరాబాద్‌లో నిర్మించుకొని, ఇంకెవరినో హైదరాబాద్‌లో ఉంటున్నారని విమర్శలు చేస్తున్నారని అన్నారు. పీయూష్‌ గోయెల్‌తో చర్చకు చంద్రబాబు సిద్ధపడాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మేనిఫెస్టో కమిటీ కన్వీనర్‌ ఐవైఆర్‌ కృష్ణారావు, ఎంపీ గోకరాజు గంగరాజు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మురళీధరన్, సహ ఇన్‌చార్జి సునీల్‌ దియోధర్, కేంద్ర సంఘటనా కార్యదర్వి సతీష్‌జీ, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు, ఎమ్మెల్సీ మాధవ్, దాసరి శ్రీనివాస్, విజయబాబు, తురగా నాగభూషణం, సుధీష్‌ రాంబొట్ల తదితరులు పాల్గొన్నారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top