కొమ్మాలపాటి అవినీతిలో మేటి

PedakuraPadu MLA Kommalapati Sridhar Was Fully Corrupted In FIve Years  - Sakshi

సాక్షి, గుంటూరు : రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం నుంచి ఇసుక దందా వరకు.. సదావర్తి సత్రం భూములను చేజిక్కించుకోవడం నుంచి ఎర్ర మట్టి దోపిడీ వరకు.. బెట్టింగ్‌ మాఫీయా నుంచి ‘నీరు–చెట్టు’లో అవినీతి వరకు.. కాదేది ఆయన అక్రమార్జనకు అనర్హం. కన్నుపడితే దౌర్జన్యం చేయడం ఖాయం. ఒక సామాన్య వ్యక్తి నుంచి నేడు రూ.కోట్లకు పడగెత్తిన రాజకీయ నాయకుడిగా పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ సాగించిన అవినీతి కథలు రాయాలంటే పుస్తకాలే చాలవేమో.

కృష్ణమ్మ నది గర్భంలో డ్రెడ్జర్లతో భారీ లోతులో ఇసుక తవ్వకాలు జరిపి.. అమాయక ప్రాణాలను బలిగొన్నా.. బినామీల పేరుతో గ్రావెల్‌ కొట్టేసినా ఆయనకే చెల్లింది.  ఇలా ఇందు లేదు అందు లేదు.. ఎందెందు వెతికినా అందందే అవినీతిని విస్తరించి.. మద్యాన్ని ఎరులై పారించిన ప్రజాప్రతినిధి కొమ్మాలపాటి.     

రాజధాని ప్రాంతఎమ్మెల్యే కావడంతో ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్‌ అండతో ఇసుక మాఫియాను నడుపుతూ వేల కోట్లు దోచేశారు కొమ్మాలపాటి శ్రీధర్‌. అందులో చినబాబు వాటాపోను సుమారు రూ. 500 కోట్లకుపైగా వెనకేసుకున్నారు. రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌ వేసిన ప్రతి చోటా ప్రభుత్వ, పోరంబోకు భూములను ఆక్రమించి రెవెన్యూ అధికారుల ద్వారా సొంతం చేసుకున్నారు.

గత ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు దశాబ్దాల క్రితం పట్టాలు ఇచ్చిన భూములను సైతం చెరబట్టారు. నీరు–చెట్టు పేరుతో మట్టిని బొక్కేయడంతోపాటు, అమరావతి మండలంలో అతి ఖరీదైన ఎర్ర మట్టిని తవ్వేసి సుమారుగా రూ. 100 కోట్లు దండుకున్నారు. నియోజవకర్గంలో మద్యం దుకాణాల వద్ద 20 శాతం వాటా గుంజేసుకుంటున్నారు.

ఇసుక మాఫియా తీసిన గోతుల్లో పడి సుమారుగా 25 మందికిపైగా అమాయకులు బలయ్యారు. అయినా కొమ్మాలపాటి ధనదాహం మాత్రం తీర లేదు. అమరావతి, అచ్చంపేట మండలాల్లో అక్రమంగా ఇసుక రీచ్‌లను ఏర్పాటు చేశారు. ఇసుక అక్రమ రవాణా కోసం కృష్ణా నది మధ్యలో నుంచి రోడ్డు నిర్మించారు.  

నీరు–చెట్టులో అవినీతి ప్రవాహం..
నీరు–చెట్లు కార్యక్రమం అధికార పార్టీ ఎమ్మెల్యే కొమ్మాలపాటికి బంగారు బాతుగా మారింది. పథకం పేరుతో నియోజకవర్గంలోని మండలాల్లో నిధులను ఎమ్మెల్యే భారీగా మింగేశారు. బెల్లంకొండ మండలంలో నందిరాజుపాలెం గ్రామానికి చెందిన ఎస్సీలు 28 సంవత్సరాలుగా 40 ఎకరాలు భూమిని సాగు చేసుకుంటున్నారు.

టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 40 ఎకరాలు ఆక్రమించుకొని వాటిలో 10 ఎకరాల్లో నీరు– చెట్టు కింద మట్టిని తవ్వి అవినీతికి పాల్పడ్డారు. పెదకూరపాడు, అమరావతి, అచ్చంపేట, క్రోసూరు మండలాల్లో కలుపుకుని జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యే ఆయన అనుచరులు రూ. 30 కోట్ల వరకూ మట్టిని మింగేశారు. 

ప్రజల ప్రాణాలను బలిగొన్నారు...

నాలుగున్నరేళ్లలో కొమ్మాలపాటి కనుసన్నల్లో నడుస్తున్న ఇసుక మాఫియా తీసిన గోతుల్లో పడి 25 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. 2016 ఆగస్టు 16న కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం ఏటూరు, గుంటూరు జిల్లా అమరావతి మండలం దిడుగు ప్రాంతాన్ని కలిపే కృష్ణా నది పాయలో పుష్కర స్నానానికి వెళ్లి ఐదుగురు విద్యార్థులు చనిపోయారు కృష్ణానదిలో తీసిన భారీ గోతిలో ఓ విద్యార్థి మునుగుతుండగా, పక్కన ఉన్న తోటి విద్యార్థులు అతనిని రక్షించేందుకు వెళ్ళి వారు సైతం మృత్యువాత పడిన సంఘటన ఐదు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.

అదే ఏడాది గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం కోనూరు శివారులో ఉన్న కృష్ణా నదిలో జరిగిన రెండు వేరువేరు ఘటనల్లో ఐదుగురు యువకులు ఇసుక కోసం తీసిన గోతుల్లో పడి జల సమాధయ్యారు. 2017 జనవరి 15న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువకులు నీటిలో మునిగిపోయారు. ఇసుక కోసం తవ్విన గోతుల్లో పడి మృత్యువాత పడ్డ వారంతా 20 ఏళ్లులోపు. మీటరు (మూడు అడుగులు) లోతుకంటే ఎక్కువ తవ్వకూడదనే నిబంధన ఉన్నప్పటికీ కృష్ణానదిలో 20 అడుగులు తవ్వేశారు. ఇసుక తవ్వకాలకు యంత్రాలు వినియోగించరాదని సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నా, ప్రభుత్వం జీవోలు జారీ చేసినా ఇసుకాసురులు మాత్రం అడ్డగోలుగా తవ్వేస్తున్నారు.  

బెట్టింగ్‌ సామ్రాజ్యాన్ని విస్తరించి
జిల్లాలో క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్న కీలక బుకీ మాదినేని బాలజీ కొమ్మాలపాటి శ్రీధర్‌ మామ మాదినేని సుబ్బయ్య కుమారుడు కావడం గమనార్హం. బాలాజీ సొంతగా బోర్డు నడుపుతూ ఆన్‌లైన్‌ ద్వారా జిల్లాలోని అన్ని ప్రాంతాలకు లైన్‌ ఇస్తూ కోట్ల రూపాయల్లో బెట్టింగ్‌లు నిర్వహిస్తుంటాడు. ఇతని జోలికి పోలీసులు వెళ్ళకుండా కొమ్మాలపాటి చూసుకుంటారు.

బాలాజీ తమ వద్ద భూములు, స్థలాలు బలవంతంగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారంటూ అనేక మంది బాధితులు 2016 డిసెంబర్‌లో అప్పటి గుంటూరు అర్బన్, రూరల్‌ జిల్లా ఎస్పీలకు ఫిర్యాదు చేశారు. క్రికెట్‌ బుకీల ఆట కట్టించేందుకు గుంటూరు అర్బన్‌ జిల్లా ఎస్పీ విజయారావు ఇద్దరు డీఎస్పీలు, ఎస్‌లతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి బెట్టింగ్‌ బుకీల కోసం వేట సాగించారు.

ఈ బృందం కీలక బుకీ బాలాజీతోపాటు, మరో నలుగురిని అదుపులోకి తీసుకుని వారిని పూర్తి స్థాయిలో విచారించడంతో కళ్ళు చెదిరే వాస్తవాలు బయటకు వచ్చాయి. వీరు ఇచ్చిన సమాచారంతో బాలాజీ సోదరుడు, అమరావతికి చెందిన మండల స్థాయి టీడీపీ నేతతోపాటు జిల్లాలోని అనేక మంది కీలక క్రికెట్‌ బుకీల పాత్ర ఉన్నట్లు తేలింది. బాలాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి బావమరిది కావడంతో వారి జోలికి వెళ్లొద్దంటూ అధికార పార్టీ ముఖ్యనేతల నుంచి పోలీసు ఉన్నతాధికారులకు ఒత్తిళ్లు వచ్చాయి.

దీంతో ఆ మరుసటి రోజు ఐదుగురు క్రికెట్‌ బెట్టర్లను అరెస్టు చూపించారు. అందులో కీలక బుకీ బాలాజీ ఎవరనేది కూడా విలేకరులకు చెప్పకుండా.. కనీసం కోర్టులో హాజరు పర్చకుండా 41 నోటీసు ఇచ్చి వదిలేశారు. అమరావతిలో గతంలో పేకాట కూడా నిర్వహించారు. 

ఎర్ర మట్టి దోపిడీ..

అమరావతి మండల పరిధిలోని ఎండ్రాయి, కర్లపూడి, లేమల్లె గ్రామాలలో దళితులకు ఇచ్చిన అసైన్డ్‌ భూములలో కోట్లాది రూపాయల ఎర్ర గ్రావెల్‌ దోచుకున్నారు. ఎమ్మెల్యే బినామీలైన పెదకూరపాడు మండలం కంభంపాడుకు చెందిన మాదినేని సుబ్బయ్య కుమారుడు శ్రీనివాసరావు, పెదకూరపాడుకు చెందిన ఏటుకూరి గంగాధరరావు ఈ భూముల్లో తవ్వకాలు జరిపి కోట్ల రూపాయలు దండుకున్నారు.

ఈ భూములు కలిగిన ఎండ్రాయి, లేమల్లె గ్రామాలకు చెందిన షేక్‌ మస్తాన్‌బీ డీకె పట్టా రద్దు చేయిస్తామని బెదిరించి సర్వే నెంబరు 95/1, 95/2లో ఉన్న 1.98 ఎకరాలు లేమల్లెలోని మేకల యేసోబుకు చెందిన 96/2లో ఉన్న ఎకరం భూమిని మాదినేని శ్రీనివాసరావు లీజుకు రాయించుకున్నాడు. దీంతోపాటుగా 2013 నవంబరు 23వ తేదీన చనిపోయిన కట్టెపోగు వందనం భార్య చిట్టెమ్మ పేరు మీద 96/2 నంబరులో ఉన్న 1.25 ఎకరాల భూమిని కూడా 2017 ఏప్రిల్‌ 1న నోటరీ అఫిడవిట్‌ ఇచ్చినట్లు ఏటుకూరి గంగాధరరావు పేరు మీద ఫోర్జరి చేసి లీజు అగ్రిమెంట్‌ సృష్టించినట్లు సమాచారం.

రెవెన్యూ అధికారులు ఇచ్చిన ఆర్‌సీ నెం.402/2017బీ అర్డరులో డీకే పట్టాగా పేర్కొన్న భూములు మైనింగ్‌ మెమో నెం.1418/టీపీలో మాత్రం పట్టా భూమి అని చూపించారు. మొత్తం మీద 6150 క్యూబిక్‌ మీటర్ల గ్రావెల్‌ తవ్వేశారు. ప్రస్తుతం కర్లపూడి ఎస్సీ కాలనీకి దగ్గరలో ఉన్న గంగమ్మచెరువు వద్ద ప్రత్తిపాటి బేబమ్మ, ప్రత్తిపాటి బూదమ్మలకు పూర్వార్జితంగా సంక్రమించిన రెండు ఎకరాల భూమిని కొమ్మాలపాటి బంధువులు కొనుగోలు చేసి   అక్రమ తవ్వకాలకు తెర తీశారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top