రేవంత్‌ వ్యాఖ్యలు నన్ను బాధించాయి: పయ్యావుల

Payyavula Kesav reacts on Revanth reddy comments - Sakshi

టీడీపీలో రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యల ప్రకంపనలు

25 ఏళ్లుగా పార్టీ ఎజెండానే నా ఎజెండాగా పనిచేశా

పార్టీకి నష్టం చేకూర్చే పని నేనెప్పుడు చేయలేదు

నా గురించి మాట్లాడే అర్హత రేవంత్‌కు లేదు

సాక్షి, అనంతపురం : రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలు తనను ఎంతగానో బాధించాయని టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌ అన్నారు. రెండురోజుల క్రితం పయ్యావుల కేశవ్‌పై రేవంత్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై పయ్యావుల సోమవారమిక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ...‘ రేవంత్‌ వ్యాఖ్యలపై స్పందించాలా? లేదా? అనే సంగిద్ధంలో పడ్డా. స్పందించపోతే జనంలోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయనే మాట్లాడుతున్నా. 25 ఏళ్లుగా పార్టీ ఎజెండానే నా ఎజెండాగా పనిచేశా. పార్టీకి నష్టం చేకూర్చే పని నేనెప్పుడు చేయలేదు. రేవంత్‌ ఆరు నెలలుగా చేస్తున్న ఢిల్లీ పర్యటన వివరాలు నా దగ్గర ఉన్నాయి. అయినా నేను స్పందించలేదు. కాంగ్రెస్‌లో చేరిక ఊహాగానాలపై నాకు తెలుసు....కానీ ఇప్పుడు మాట్లాడను.

రేవంత్‌కు చంద్రబాబు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారు. వ్యక్తిగత ఎజెండా కోసమే పనిచేసే వ్యక్తి రేవంత్‌. అలాంటి రేవంత్‌ నాకో, యనమల రామకృష్ణుడికో సర్టిఫికెట్‌ ఇవ్వాల్సిన అవసరం లేదు. రేవంత్‌ రెడ్డి అరెస్ట్‌ అయినప్పుడు ఫస్ట్‌ మాట్లాడింది నేనే. ప్రభుత్వం నుంచి ఇబ్బందులుంటాయని ఆయన బెయిల్‌ కోసం తిరిగాం. కేసీఆర్‌కు, నాకు సంబంధాలు అంటగట్టడం దుర్మార్గం.  పరిటాల కుటుంబానికి, నాకు తెలంగాణలో ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవు. నేను తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి కాంట్రాక్ట్‌లు పొందలేదు.  మర్యాదపూర్వకంగా కేసీఆర్‌ను కలిస్తే తప్పా?. కావాలనే ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించేందుకు చేసిన కుట్ర’  అని వ్యాఖ్యానించారు.

బార్‌కు, బీర్‌ కంపెనీకి తేడా తెలియదా?
తన మేనల్లుడు, నలుగురు స్నేహితులు కలిసి ప్రారంభించిన చిన్న వ్యాపారాన్ని రేవంత్‌ రెడ్డి రాజకీయంగా వాడుకోవడం సరికాదని పయ్యావుల మండిపడ్డారు. వాళ్లలో పరిటాల బంధువులు ఎవరో తనకు తెలియదన్నారు. రేవంత్‌...బార్‌కు, బీర్‌ కంపెనీకి తేడా తెలియని వ్యక్తి కాదంటూ... తనకు హైదరాబాద్‌లో బార్‌ మాత్రమే ఉందని, అదికూడా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటే వచ్చిందే అని అన్నారు. తన వ్యాపారాల కంటే ఆయన వ్యాపారాల గురించి మాట్లాడితే బాగుంటుందన్నారు. కేసీఆర్‌ కూతురు కవితో కలిసి రేవంత్‌ వ్యాపారం చేసింది నిజం కాదా అని నిలదీశారు. సన్నిహితుల ఒత్తిడితో వ్యాపారం నుంచి బయటకు వచ్చింది మర్చిపోయారా అని ప్రశ్నించారు. ఒక పెళ్లిలో జరిగిన యాదృశ్చిక ఘటనను సొంత ప్రయోజనాల కోసం రేవంత్‌ వాడుకోవడం సరికాదన్నారు.  కేసీఆర్‌ను కలిస్తే ఇంత యాగీ చేస్తారా?. నా గురించి మాట్లాడే అర్హత రేవంత్‌కు లేదు. మొదట బీజేపీ, తర్వాత టీఆర్‌ఎస్‌, ఇప్పుడు టీడీపీలో ఉన్న రేవంత్‌ ...రేపు ఎక్కడుంటాడో ఎవరికీ తెలియదు అని పయ్యావుల ఘాటు వ్యాఖ్యలు చేశారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top