చస్తే చస్తాం గానీ.. బీజేపీలో విలీనం చేయబోం

Pawan Kalyan : What He Said About BJP in The Past - Sakshi

2019లో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌

వివిధ సందర్భాల్లో బీజేపీ, ప్రధాని మోదీపై పవన్‌ ఘాటు విమర్శలు

సాక్షి, అమరావతి: ‘‘చస్తే చస్తాం గానీ.. జనసేన పార్టీని ఎప్పటికీ భారతీయ జనతా పార్టీలో విలీనం చేయం. మనం కలుపుతామా భారతీయ జనతా పార్టీలో జనసేన పార్టీని. చస్తే చస్తాం.. ఉంటే ఉంటాం.. పోతే పోతాం.. కానీ తెలుగుజాతి ఉన్నతిని, గౌరవాన్ని ఎప్పటికీ కాపాడుకుంటూనే ఉంటాం’’ అంటూ  ప్రజాపోరాట యాత్ర సందర్భంగా గత ఏడాది అక్టోబరులో పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు సభలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేశారు. తర్వాత కూడా ఆయన బీజేపీ, ప్రధాన నరేంద్ర మోదీ గురించి పలుమార్లు పలు విధాలుగా మాట్లాడారు. వివిధ సందర్భాల్లో పవన్‌ కల్యాణ్‌ ఏం మాట్లాడారంటే...

పాచిపోయిన లడ్డూ లాంటి ప్రత్యేక ప్యాకేజీ కూడా మోదీ సర్కారు రాష్ట్రానికి సరిగా ఇవ్వలేదు. ఉడుముకు ముఖంపై రాసిన తేనెలా రాష్ట్రం పరిస్థితి తయారైంది. కేంద్ర ప్రభుత్వం సృష్టించిన అయోమయ పరిస్థితి వల్ల రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలను నాలుగేళ్లుగా అమలు చేయలేదు. నన్ను, బీజేపీని, టీడీపీని భాగస్వాములుగా ప్రజలు భావించారు. అందువల్ల వారికి నైతికంగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది.
– సంయుక్త నిజ నిర్ధారణ కమిటీ (జేఎఫ్‌సీ) నివేదికపై తుది కసరత్తు అనంతరం హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో (04–03–2018)

ప్రధానమంత్రి మోదీ ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేయకుండా మోసం చేశారు. సీఎం చంద్రబాబు మీద కోపం ఉంటే ఆయన మీద చూపించండి. మా రాష్ట్రం మీద ఎందుకు చూపిస్తారు?
– తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జరిగిన పార్టీ ఆవిర్భావ  దినోత్సవంలో(14–3–2019)

రూ.10 లక్షల సూట్‌ వేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ వృథా చేసేంది ప్రజాధనమే. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహం ఏర్పాటు విషయంలో ప్రధాని మోదీని అడగాల్సి ఉంది.
– బీఎస్పీతో జనసేన పొత్తు నేపథ్యంలో విశాఖలో మీట్‌ ది ప్రెస్‌లో (03–04–2019)

నా దేశభక్తిని శంకిస్తున్న బీజేపీ నేతలు హద్దుల్లో ఉండాలి. అవాకులు, చెవాకులు పేలితే సహించే ప్రశ్నే లేదు. నేను మొదలు పెడితే బీజేపీ నేతలు నోరు తెరవలేరు.
– చిత్తూరులో జరిగిన బహిరంగ సభలో (02–03–2019)

వెనుకేసుకురావడానికి నాకు బీజేపీ బంధువూ కాదు. మోదీ అన్నయ్యా కాదు. అమిత్‌షా బాబయ్యా కాదు. వారిని ఎందుకు వెనుకేసుకొస్తాను? రాజకీయ జవాబుదారీతనం లేనందునే ఆంధ్రప్రదేశ్‌కు దక్కాల్సిన ప్రత్యేక హోదా దక్కలేదు. ఈ విషయంలో ప్రధానమంత్రి మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇద్దరూ మాట తప్పారు.
–విజయవాడలో జనసేన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా (13–10–2018)

2014 ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరాలని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా కోరినా నేను వెళ్లలేదు.
– పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి బస్టాండ్‌ వద్ద సభలో (09–10–2018)

చదవండి: పవన్‌ కల్యాణ్‌పై కేఏ పాల్‌ సంచలన వ్యాఖ్యలు

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top