బాంబులు జేబులో వేసుకోవడానికే వచ్చా: పవన్‌

Pawan Kalyan Slams Ruling TDP Leaders In Ganapavaram - Sakshi

గణపవరం : తెలుగుదేశం పార్టీ నాయకులు కాలర్‌ ఎగరవేసి తిరగడానికి కారణం జనసేన పార్టీయేనని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ప్రజా పోరాట యాత్రలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా గణపరం సభలో మాట్లాడుతూ..జనసేన పార్టీ ఆవిర్భావానికి కారణం మిగిలిన రాజకీయ పార్టీ నాయకుల భయమే కారణమన్నారు. రాజకీయాల్లోకి డబ్బులు సంపాదిద్దామని రాలేదని వ్యాక్యానించారు. జనసేన అభిమానుల ప్రేమతూటాలు, బాంబులు జేబులో వేసుకోవడానికే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. తాను తలచుకుంటే 2-014 ఎన్నికల అనంతరం రాజ్యసభ, ఎంపీ సీటు తీసుకునే సత్తా ఉన్నా తీసుకోలేదని వెల్లడించారు.

దెందులూరు, ఉంగుటూరు ఎమ్మెల్యేలు జనసేన అభిమానుల, కార్యకర్తల లోన్లు ఆపేస్తున్నారని చెప్పారు. పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. భీమడోలు ప్రభుత్వ ఘగర్‌ ఫ్యాక్టరీని 2014 ఎన్నికలకు ముందు తెలుగుదేశం ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు అతి తక్కువ టోకు ధరకు ధారాదత్తం చేసి ఫ్యాక్టరీ కార్మికులకు అన్యాయం చేయడం దారుణమన్నారు. కొల్లేరుకి సరైన రహదారులు లేవని, ప్రాథమిక అవసరాలు తీర్చగలిగే నాయకులు లేరని విమర్శించారు. తినడానికి పనికి రాని బియ్యాన్ని ప్రజలకు ఇచ్చి అధికార పార్టీ నాయకులు రాష్ట్రాన్ని దోచేస్తున్నారని మండిపడ్డారు.

తాము అధికారంలోకి రాగానే ఆర్ధికంగా వెనకబడిన అగ్రవర్ణాల విద్యార్థులకు కార్పొరేషన్‌, హాస్టల్‌ వసతి ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ సున్నితమైన సమస్య..ఇది ముఖ్యమంత్రి పెట్టిన చిచ్చని విమర్శించారు. మాల మాదిగలు సోదరభావంతో ఉంటేనే రాజ్యాధికారం సాధ్యమని, అందుకు జనసేన కృషి చేస్తుందని అన్నారు. ముస్లింల సంక్షేమానికి సచ్చార్‌ కమిటీ సూచనలు ఆచరణలోనికి తీసుకువస్తామని వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగుల సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పారు.

చింతమనేని కాళ్లు విరగ్గొడతా

గణపవరం సభ ముగిసిన తర్వాత ఏలూరు సభలో పవన్‌ కల్యాణ్‌ ప్రసగించారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఓ రౌడీ ఎమ్మెల్యే అని వ్యాఖ్యానించారు. ఆయనకు చెబుతున్నా ఏలూరు వచ్చి దౌర్జన్యాలకు దిగితే కాళ్లు విరగ్గొట్టి ఇంట్లో కూర్చోబెడతానని హెచ్చరికలు పంపారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని వంటి వారు ఉత్తర్‌ ప్రదేశ్‌లో సందుకు ఒకరు ఉంటారని చెప్పారు. ఈ ప్రభుత్వం హత్యలు, నేరాలు చేసే వారిపై కేసులు నమోదు చేయదు..వారిపై చర్యలు తీసుకోదని విమర్శించారు. కొల్లేరులోని ప్రజలు బయటకు రావడానికి రోడ్లు లేవని, జనసేనకు 18 శాతం ఓటు బ్యాంకు ఉందని వెల్లడించారు. తనకు చెగువేరా అంటే చాలా ఇష్టమని తెలిపారు. ఎన్టీఆర్‌ లాగా తొమ్మిది నెలలో ముఖ్యమంత్రి అవ్వాలని రాలేదని చెప్పారు.

ప్రభుత్వ పథకాలు ఒక్క టీడీపీ నాయకులకే దక్కుతున్నాయని అన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఈ విధంగా పరిస్థితులు ఉండబట్టే యువత నక్సల్స్‌ వైపు మొగ్గు చూపుతున్నారని వ్యాఖ్యానించారు. బాక్సైట్‌ తవ్వకాలు ఆపవలసిన అవసరం ఉంది..ఇలాంటి ద్వంద్వ విధానాల వల్ల యువత మావోయిస్టు వైపు వెళ్తోందన్నారు. మావోయిస్టులు ఎందుకు పోరాడుతున్నారో ఆలోచించాలని హితవు పలికారు. మీరు కోరుకున్నట్లు నేను సీఎం అయితే మహిళలకు ఉచితంగా గ్యాస్‌ ఇస్తానని తెలిపారు. ఉచిత రేషన్‌ బదులు మహిళల ఖాతాల్లో నేరుగా 2500 నుంచి 3500 రూపాయలు వేస్తామని వెల్లడించారు. మహిళలకు రిజర్వేషన్‌ 33 శాతం కల్పించి తీరుతామన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top