అరె సాంబా... రాసుకో...

Pawan kalyan moves into rented house in Gajuwaka - Sakshi

గాజువాకలో స్థానికులకే పట్టం వలసవాదులను ఓటమి పాఠం చెబుతారు

నియోజకవర్గ పునర్విభజనకు ముందూ అంతే..

పవన్‌ కళ్యాణ్‌ అద్దె ఇల్లు తీసుకుని బిల్డప్‌ ఇస్తున్నారు సరే..

మరి భీమవరం సంగతేమిటి?

అమరావతిలో స్థిరనివాసం అని గతంలో అన్నారు.. దాని మాటేమిటి??

ఇంత గందరగోళమేమిటి పవనూ! 

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: జనసేన తాజా కబురు ఏమిటో తెలుసా..  పవన్‌కల్యాణ్‌ గాజువాక అరుదెంచారట... ఇక్కడే అద్దెకు ఇల్లు తీసుకున్నారట. ఏం సంబంధముందని గాజువాకలో పోటీ చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పవన్‌ ఇక్కడే బస చేసేందుకు ఇల్లు తీసుకున్నారని జనసేన పార్టీ వర్గాలు శనివారం సాయంత్రం పత్రికా ప్రకటన చేశాయి. ఎన్నికల ప్రచా ర గడువు ఇంకా పదిరోజులే ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఇల్లు తీసుకోవడం ఏమిటన్నదే ప్రశ్నార్ధకంగా ఉంది. పోనీ గెలిచినా, ఓడినా ఇక్కడే ఉంటారన్న ప్రకటనైనా పవన్‌ నుంచి వస్తుందా అంటే.. అది అసాధ్యంగానే ఉంది. అనంతపురం, ఏలూరు, పిఠాపురం, విజయవాడ సెంట్రల్‌.. ఇలా ఎన్నో నియోజకవర్గాల నుంచి పవన్‌ పోటీ చేయొచ్చొని తెరపైకి తెచ్చినప్పటికీ కుల లెక్కల ప్రాతిపదికన గాజువాకను ఎప్పుడో ఎంచుకున్నారనేది స్పష్టంగా తెలిసిపోతోంది. కనీసం గాజువాకలో పోటీ చేయాలని భావించినప్పుడైనా ముందుగా పవన్‌ కల్యాణ్‌ ఇల్లు తీసుకుని ఉంటే బాగుండేదన్న అభిప్రాయం స్వయంగా జనసేన వర్గాల నుంచే వినిపిస్తోంది.

గత ఏడాది కాలంలో నాలుగైదుసార్లు జిల్లాకు వచ్చినప్పుడు పవన్‌ .. బీచ్‌రోడ్‌లోని సాయిప్రియ రిసార్ట్స్‌లో బస చేసేవారు. కనీసం అప్పుడైనా గాజువాక కేంద్రంగా ఇల్లు తీసుకుని ఇక్కడి నుంచి ఉత్తరాంధ్ర జిల్లా పర్యటనలు చేసుంటే కొంతైనా స్థానికత వచ్చేదన్న అభిప్రాయం ఆ వర్గాల నుంచే వ్యక్తమవుతోంది. పోనీ ఎన్నికల షెడ్యూల్‌ వచ్చిన తర్వాత,.. కనీసం నామినేషన్‌ సందర్భంలోనైనా ఇల్లు తీసుకుని ఉంటే బాగుండేదని. ఇప్పుడు సరిగ్గా పదిరోజులు కూడా ప్రచార గడువు లేని పరిస్థితుల్లో  ఇల్లు.. అది కూడా అద్దె ఇల్లు తీసుకుంటే ఏం ప్రయోజనమన్న వాదన ఆ పార్టీ వర్గాల నుంచే వినిపిస్తోంది.

స్థానికులకే గాజువాక ప్రజ ఆదరణ
ఇక కుల లెక్కలు ఎలా ఉన్నా.. గాజువాక ప్రజ మొదటి నుంచి స్థానిక నేతలకే పట్టం కడుతోందన్నది నాలుగు దశాబ్దాల ఎన్నికల చరిత్ర తీస్తే అర్ధమవుతుంది. 2009లో నియోజకవర్గాల పునర్విభజనకు ముందు.. ఆ తర్వాత కూడా ఇక్కడ నివాసం ఉంటున్న నేతలనే ప్రజాప్రతినిధులుగా గాజువాక ప్రజలు ఎన్నుకుంటూ వస్తున్నారు. 1978లో గాజువాక అంతర్భాగంగా ఉన్న పెందుర్తి నియోజకవర్గ తొలి శాసనసభ్యునిగా గుడివాడ అప్పన్న ఎన్నికయ్యారు. 1980లో గుడివాడ అప్పన్న మరణంతో ద్రోణంరాజు సత్యనారాయణ పోటీ చేసి గెలిచారు.1983 ఎన్నికల్లో  పెతకంశెట్టి అప్పలనర్శింహం, 1985 ఎన్నికల్లో ఆళ్ళ రామచంద్రరావు, 1989లో గుడివాడ గురునాధరావు, 1994లో మానం ఆంజనేయులు, 1999లో గణబాబు, 2004 ఎన్నికల్లో తిప్పల గురుమూర్తిరెడ్డి గెలుపొందారు. వీరంతా ఈ ప్రాంతవాసులే. ఇక్కడే పుట్టి పెరిగారు.

2009 పునర్విభజనతో ఏర్పాటైన గాజువాక నియోజకవర్గం నుంచి తొలి ఎమ్మెల్యేగా చింతలపూడి వెంకట్రామయ్య ప్రజా రాజ్యం అభ్యర్థిగా గెలుపొందారు. వాస్తవానికి తూర్పు గోదావరి జిల్లా అయినవల్లికి చెందిన వెంకట్రామయ్య మూడు దశాబ్దాల క్రితమే వైజాగ్‌ వచ్చి స్థిరపడ్డారు. ఇక 2014లో టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు గెలుపొందారు. ఆయన గాజువాకలోని జోగవానిపాలెం గ్రామ నివాసి. ఇలా నాలుగు దశాబ్దాల చరిత్ర చూస్తే.. స్థానికులకే గాజువాక ప్రజ పట్టం కడుతున్నారనేది స్పష్టమవుతోంది. ఈ లెక్కన పవన్‌ కల్యాణ్‌ను ఇక్కడి ప్రజలు ఆదరించడమనేది అనుమానంగానే ఉంది. కేవలం అభిమానుల కోలాహలం, సామాజికవర్గ సమీకరణాలు వేసుకుని గాజువాకకు దిగుమతి అయిన పవన్‌కు ఇప్పుడు వాస్తవ లెక్కలతో సినిమా కనిపిస్తోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అందుకే అర్జంట్‌గా ఇల్లు తీసుకున్నారని అంటున్నారు. 

కొసమెరుపు
సరే గాజువాకలో అద్దె ఇల్లు తీసుకున్నారు.. అంతవరకు బాగానే ఉందనుకుందాం. మరి భీమవరంలో పరిస్థితి ఏమిటి.. అక్కడా ఇల్లు తీసుకోవాలి కదా?... అక్కడ ఎన్ని రోజులు ఉంటారు.. ఇక్కడ ఎన్ని రోజులు ఉంటారు. మరోవైపు అమరావతిలోనూ ఇల్లు కొన్నారు కదా?.. హైదరాబాద్‌లో సొంతిల్లు ఉంది కదా??.. వీటిలో దేన్ని పర్మినెంట్‌ అని చెప్పుకుంటారు???.. తనను కలసి సమస్యలు చెప్పాలనుకునే వారిని ఎక్కడికని రమ్మంటారు!.. ఎన్ని చోట్లకు తిరగమంటారు. 

కాపులు అంత అమాయకంగా కనిపించారా..
అసలు గాజువాకతో పవన్‌కల్యాణ్‌ ఏం సంబంధం ఉందని పోటీ చేస్తున్నారని కాపునాడు జేఎసీ సభ్యురాలు, ఉత్తరాంధ్ర కాపునాడు నాయకురాలు పీలా వెంకటలక్ష్మి ప్రశ్నించారు. కేవలం కాపుల సంఖ్య ఎక్కువగా ఉంటే చాలా.. స్థానికత, అర్హత, ఇక్కడి సమస్యలపై అవగాహన ఏమీ అక్కర్లేదా... అని ఆమె నిలదీశారు. గాజువాకలో తమ సామాజికవర్గం ఎక్కువగా ఉందని పవన్‌ పోటీ చేస్తున్న విషయం బహిరంగ రహస్యమేనని లక్ష్మి అన్నారు. తన సినీగ్లామర్‌ చూసి కాపులు మోజుతో ఓట్లు వేస్తారని పవన్‌ భావిస్తున్నారని. కానీ వారిలోనూ చైతన్యం వచ్చిందన్నారు. తమ ప్రాంత సమస్యలపై ఎవరు పోరాడుతున్నారో తెలుసుకుంటున్నారన్నారు. అందుకే పవన్‌ను గాజువాకలో తమ సామాజికవర్గ ఓటర్లు ఆదరించరని స్పష్టం చేశారు. కాపు వర్గీయుల సమస్యలపై  ఏనాడైనా పవన్‌ స్పందించారా అని నిలదీశారు. వారికి చేసిన మేలు ఒక్కటైనా చెప్పగలరా అని సవాల్‌ చేశారు.  – పీలా వెంకటలక్ష్మి, కాపునాడు జేఏసీ సభ్యురాలు         

                        

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top