పటీదార్‌ వర్సెస్‌ కాంగ్రెస్‌ కార్యకర్తల కొట్లాట

Patidar Clashes with Congress Workers - Sakshi - Sakshi

అహ్మదాబాద్‌ : గుజరాత్‌ ఎన్నికల్లో భాగంగా పటీదార్‌ అనమత్‌ ఆందోళన్‌ సమితితో పొత్తు కుదిరిందని ప్రకటన వెలువడిన కాసేపటికే పరిస్థితులు తారుమారయ్యాయి. టికెట్ల పంపిణీ చిచ్చు రాజుకుని సూరత్‌లోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం వద్ద పటేల్‌ వర్గీయులు-కాంగ్రెస్‌ కార్యకర్తలు బాహాబాహికి దిగారు. ఈ క్రమంలో పార్టీ ఆఫీస్‌ను పూర్తిగా ధ్వంసం చేసేశారు.

ముందుగా పటీదార్‌ మద్దతుదారులు పార్టీ కార్యలయం ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం అక్కడికి చేరుకున్న కాంగ్రెస్‌ కార్యకర్తలు వారితో వాగ్వాదానికి దిగారు. ఒకానోక క్రమంలో ఇరు వర్గాలు ఒకరినొకరిని తోసుకోవటంతో కొట్లాట మొదలైంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పటీదార్‌ కార్యర్తలను అరెస్ట్‌ చేశారు. మొత్తం 77 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్‌ అందులో కేవలం మూడు స్థానాలను మాత్రమే పటేల్‌ వర్గానికి కేటాయించింది. దీనికి నిరసనగానే సూరత్‌, అహ్మదాబాద్‌లో పీఏఏఎస్‌ వ్యతిరేక ప్రదర్శనలు చేపట్టింది. మరోపక్క పటీదార్‌ నేత దినేశ్‌ పటేల్ పలువురు కార్యకర్తలను వెంటపెట్టుకుని గుజరాత్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు భరత్‌సిన్హ్‌ సోలంకి ఇంటికి వెళ్లారు. అయితే భరత్‌ మాత్రం వారిని కలిసేందుకు నిరాకరించటంతో బయటే ఆందోళన చేపట్టారు.

కాగా, ఘటనకు నిరసనగా నేడు కాంగ్రెస్‌ వ్యతిరేక పదర్శనలు నిర్వహించేందుకు పటీదార్‌ వర్గం సిద్ధమైంది. ‘‘కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ఇచ్చే అంశంపై పునరాలోచన చేస్తాం. నిర్ణయాన్ని త్వరలోనే ప్రకటిస్తాం. మేము వారిని(కాంగ్రెస్‌) అడిగేది ఒక్కటే. అధికారంలోకి వచ్చాక పటేల్‌ వర్గానికి ఇచ్చిన హామీలను(రిజర్వేషన్లను) ఎలా నెరవేర్చబోతున్నారు అన్నది తేల్చాలి. అప్పుడే వారి తరపున ప్రచారానికి మేము సిద్ధంగా ఉంటాం.. అని దినేశ్‌ పటేల్‌ మీడియాకు తెలిపారు. పోలీసులు కూడా తమపై దౌర్జన్యానికి తెగపడ్డారని ఆయన ఆక్షేపించారు.

ఇక హార్దిక్‌​ పటేల్‌ లేకుండానే ఆదివారం కాంగ్రెస్‌ పార్టీతో పీఏఏఎస్‌ కీలక సమావేశం నిర్వహించింది. అనంతరం పీఏఏఎస్‌ కన్వీనర్‌ దినేశ్‌ బాంభానియా మాట్లాడుతూ.. రిజర్వేషన్ల ఫార్ములాపై మాత్రమే ఒప్పందం కుదరిందని.. సీట్ల పంపకం గురించి చర్చించలేదని వెల్లడించారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చే అంశాలను సోమవారం రాజ్‌కోట్‌ సభలో తమ అధినేత హార్దిక్‌ పటేల్‌ స్పష్టత ఇస్తారని దినేశ్‌ ప్రకటించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top