పార్లమెంట్‌లో హోరా హోరీ!

Parliament Moonsoon Session Starts From Today - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్‌ సమావేశాలు సజావుగా సాగాలని తాము కోరుకుంటున్నామని ప్రతి రాజకీయ పార్టీ చెబుతుంది. తీరా సమావేశాలు ప్రారంభమయ్యాక ఎవరి సత్తా మేరకు వారు గోల చేస్తారు. తప్పు మీదంటే మీదంటూ పాలక, ప్రతిపక్ష సమావేశాలు ప్రత్యక్ష ప్రసారాల సాక్షిగా పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటాయి. తాజాగా బుధవారం నాడు ప్రారంభమైన పార్లమెంట్‌ వర్షాలకాల సమావేశాలు కూడా హోరెత్తనున్నాయి. రెండు రోజుల ముందు, అంటే సోమవారం నాడు 13 ప్రతిపక్ష పార్టీలు సమావేశమై పరస్పర సహకారంతో పార్లమెంట్‌ సమావేశాలకు అంతరాయం కలుగకుండా చూడాలని బలంగా నిర్ణయించుకున్నారు.

దేశంలో నెలకొన్న అస్తవ్యస్థ ఆర్థిక వ్యవస్థ, నిరుద్యోగం, బ్యాంకు కుంభకోణాలు, వ్యవసాయ సంక్షోభం, దళితులు, ఆదివాసీలు, మహిళలపై వరుసగా జరుగుతున్న దాడులకు ప్రభుత్వాన్ని బాధ్యున్ని చేయడమే తమ లక్ష్యం అని కూడా సమావేశంలో అభిప్రాయపడ్డారు. తానే పార్లమెంట్‌ సమావేశాలకు అంతరాయం కలిగించి నిందను ప్రతిపక్షం మీద వేయడానికి ఆస్కారం ఇవ్వకుండా పరస్పర సహకారంతో సమావేశాలు నిరాటంకంగా సాగేలా చూడాలని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు గులాం నబీ ఆజాద్‌ తోటి ప్రతిపక్షాలను కోరారు. గత పార్లమెంట్‌ సమావేశాల సందర్భంగా ఎన్డీయే వర్గాలు ప్రదర్శించిన తీరును గుర్తు చేసింది. ఈ సమావేశాలకు సమాజ్‌వాది పార్టీ, బహుజన సమాజ్‌ పార్టీ, రాష్ట్రీయ జనతా దళ్, తణమూల్‌ కాంగ్రెస్‌. డీఎంకే, కాంగ్రెస్, వామపక్షాలు హాజరయ్యాయి.

ఏప్రిల్‌ ఆరవ తేదీన ముగిసిన బడ్జెట్‌పార్లమెంట్‌ సమావేశాలే ఘోరమైనవని, 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని సమావేశాలకన్నా ఈ సమావేశాలే పేలవంగా ఉన్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ లాంటి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలే కాకుండా సార్వత్రిక ఎన్నికలు కూడా సమీపిస్తున్న నేపథయంలో పార్లమెంట్‌ సమావేశాలు పాలక, ప్రతిపక్షాలకు కూడా ప్రతిష్టాత్మకంగా తయారయ్యాయి.

రాహుల్‌ వర్సెస్‌ నరేంద్ర మోదీ
ఈ పార్లమెంట్‌ సమావేశాలు కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీ వాగ్వాదం కొనసాగే అవకాశాలు ఉన్నాయి. పార్లమెంట్‌ వెలుపలు ఇప్పటికే ఇరువురు మాటల తూటాలతో పేల్చుకుంటున్నారు. ‘కాంగ్రెస్‌ పార్టీ ముస్లింల పార్టీ అని కొంత మంది ముస్లిం మేథావులతో రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు’ అంటూ ‘ఇంక్విలాబ్‌’ అనే ఉర్దూ పత్రిక గత గురువారం ఓ వార్తను ప్రచురించడంపై బీజేపీ వివాదం లేవదీసింది. ఆ వార్తలో ఇసుమంత కూడా నిజం లేదని కాంగ్రెస్‌ పార్టీ ఖండిస్తున్నప్పటికీ బీజేపీగానీ, నరేంద్ర మోదీగానీ ఆ విషయాన్ని వదిలిపెట్టడం లేదు. ఉత్తరప్రదేశ్‌లోని ఆజంగఢ్‌లో శనివారం నాడు నరేంద్ర మోదీ మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ ముస్లింల పార్టీ అని ఓ పత్రికలో చదివానని, అది ఒక్క ముస్లిం పురుషుల పార్టీ మాత్రమేనా, ముస్లిం మహిళల పార్టీ కూడానా? అని ఈ సందర్భంగా తాను అడుగుతున్నానని అన్నారు.

త్రిపుల్‌ తలాక్‌ను రద్దు చేస్తూ తీసుకొచ్చిన బిల్లును దష్టిలో పెట్టుకొనే మోదీ ఈ ప్రశ్న వేశారని సులభంగానే గ్రహించవచ్చు. పాలకపక్షం మెజారిటీ వున్న లోక్‌సభలో ఈ బిల్లును గత డిసెంబర్‌ నెలలోనే ఆమోదించగా, ప్రతిపక్షం మెజారిటీలో ఉన్న రాజ్యసభలో పెండింగ్‌లో పడిపోయిన విషయం తెల్సిందే. బిల్లులోని కొన్ని అంశాల పట్ల కాంగ్రెస్‌ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాన్ని సెలక్ట్‌ కంపెనీకి పంపించాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. ముస్లిం మహిళలను మంచి చేసుకునేందుకు మోదీ తలాక్‌ ప్రస్థావన తీసుకొచ్చిన నేపథ్యంలో దానికి కౌంటర్‌గా కాంగ్రెస్‌ పార్టీ చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశాన్ని ముందుకు తీసుకొచ్చింది. ఈ విషయమై రాహుల్‌ గాంధీ, ప్రధాని మోదీకి ఓ లేఖ కూడా రాశారు.

రాజ్యసభ డిప్యూటీ చైర్‌పర్సన్‌
రాజ్యసభ డిప్యూటీ చైర్‌పర్సన్‌ ఎన్నిక కూడా పార్లమెంట్‌ సమావేశాలను వేడెక్కించనున్నాయి. ఈ పదవికి ఉమ్మడి అభ్యర్థిని పోటీకి నిలబెట్టాలని కూడా సోమవారం నాడు జరిగిన సమావేశంలో ప్రతిపక్షాలు నిర్ణయించాయి. అయితే ఎవరి పేరు పరిశీలనకు రాలేదు. జూలై ఒకటవ తేదీ వరకు ఆ పదవిలో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు పీజే కురియన్‌ కొనసాగారు. రాజ్యసభలో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించినప్పటికీ డిప్యూటీ చైర్‌పర్సన్‌ను ఎంపిక చేసుకునేంత మద్దతు లేదు. అయినప్పటికీ మిత్రపక్షమైన శిరోమణి అకాలీదళ్‌కు చెందిన నరేష్‌ గుజ్రాల్‌ను నిలబెట్టాలని యోచిస్తోంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top