ఏకగ్రీవం కావాలి

Parishad Elections are TRS Taking prestige - Sakshi

పరిషత్‌పై టీఆర్‌ఎస్‌ వ్యూహం

జెడ్పీ చైర్‌పర్సన్‌ అభ్యర్థుల గెలుపు మీ బాధ్యతే

ఎమ్మెల్యేలకు టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆదేశం   

అన్ని స్థానాల్లో గెలుపు లక్ష్యం కావాలని సూచన

సాక్షి, హైదరాబాద్‌: జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికలను టీఆర్‌ఎస్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. మొత్తం 32 జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పదవులను కచ్చితంగా గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎంపీపీల విషయంలోనూ ఇదే వ్యూహంతో ఉంది. ఎన్నికలు జరుగుతున్న అన్ని స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆ పార్టీ ఎమ్మెల్యేలను ఆదేశించారు. ప్రతి స్థానంలోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలిచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పరిషత్‌ ఎన్నికల రెండోదశ నామినేషన్‌ దాఖలు ప్రక్రియ ముగుస్తున్న నేపథ్యంలో పలువురు ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫోన్‌లో మాట్లాడారు.

జిల్లా పరిషత్‌ చైర్మన్లుగా పలువురు సీనియర్‌ నేతలకు అవకాశం ఇస్తున్నామని, వారి గెలుపు బాధ్యతను స్వయంగా చూడాలని ఆదేశించారు. టీఆర్‌ఎస్‌లోని సీనియర్‌ నేతలు కొందరికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాలేదని, అలాంటి వారికి పార్టీ ఇప్పుడు జెడ్పీ చైర్‌పర్సన్‌ పదవిని ఇవ్వాలని నిర్ణయించిందని చెప్పారు. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ అభ్యర్థుల గెలుపు విషయంలో ఎమ్మెల్యేలు అంతా తామై వ్యవహరించాలని సూచించారు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీ ఎన్నికల విషయంలో అవకాశం ఉన్న ప్రతి స్థానంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా చూడాలని ఆదేశించారు.  

స్వయంగా రంగంలోకి దిగండి...
మొదటిదశ ఎన్నికలు జరుగుతున్న 197 జెడ్పీటీసీ, 2,166 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటిదశ ఎన్నికల నామినేషన్‌ ఉపసంహరణ గడువు ఆదివారంతో ముగిసింది. అయితే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఆశించిన సంఖ్యలో ఏకగ్రీవంగా ఎన్నిక కాలేదనే అభిప్రాయంతో ఆ పార్టీ అధిష్టానం ఉంది. రెండుమూడు అసెంబ్లీ సెగ్మెంట్లు మినహా అన్ని చోట్ల ప్రతిపక్షాల అభ్యర్థులు పోటీలో ఉంటున్నారని గుర్తించింది. దీనిపై టీఆర్‌ఎస్‌ అధిష్టానం పలువురు ఎమ్మెల్యేలకు సూచనలు చేసింది. రెండు, మూడో దశల్లో అయినా స్వయంగా రంగంలోకి దిగి ఏకగ్రీవంగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలిచేలా చూడాలని ఆదేశించింది.

రెండోదశలో 180 జెడ్పీటీసీ, 1,913 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆదివారం రెండోదశ నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసింది. టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఆదేశాలతో పలువురు ఎమ్మెల్యేలు రంగంలోకి దిగి ఏకగ్రీవ ఎన్నిక కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసే క్రమంలో అనుసంధానంగా ఉండే పరిషత్‌ వ్యవస్థలపై పూర్తి ఆధిప్యతం ఉండాలని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. రాష్ట్రంలో 538 జెడ్పీటీసీ, 5,817 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. అన్ని స్థానాల్లో కచ్చితంగా తమ అభ్యర్థులను గెలిపించుకుంటే ప్రభుత్వ లక్ష్యాలు ప్రజలకు వేగంగా చేరుతాయని భావిస్తోంది. దీంతో అన్ని స్థానాల్లోనూ గెలుపే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ వ్యూహం అమలు చేస్తోంది.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top