తృణమూల్‌కే డిప్యూటీ!

Opposition unity to be tested in election for Rajya Sabha deputy chairman - Sakshi

రాజ్యసభ ఎన్నికల్లో విపక్ష ఏకీకరణకు కాంగ్రెస్‌ వ్యూహం

బీజేపీయేతర పక్షాల మద్దతుకోసమే మమతకు ఆఫర్‌

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నిక విషయంలో విపక్షాలు ఐక్యతకు పావులు కదులుతున్నాయి. ఇందులో భాగంగా డిప్యూటీ చైర్మన్‌గా తృణమూల్‌ కాంగ్రెస్‌కు అవకాశం ఇవ్వాలని రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తృణమూల్‌ అధినేత్రి మమత బెనర్జీకి కాంగ్రెస్‌ తెలియజేసినట్లు సమాచారం. మమత ఎవరిని బరిలో నిలిపినా తమ మద్దతు ఉంటుందని కాంగ్రెస్‌ సందేశం పంపినట్లు తెలుస్తోంది. రాజ్యసభలో 13 మంది సభ్యులున్న తృణమూల్‌ ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోనప్పటికీ బీజేపీ వ్యతిరేక అభ్యర్థిని బరిలో నిలపాలని యోచిస్తోందని సమాచారం. ఎగువసభలో పార్టీ ఉపనేత, రెండోసారి ఎంపీ సుఖేందు శేఖర్‌ రాయ్‌ని పోటీలో ఉంచే అవకాశం కనబడుతోంది.  

కాంగ్రెస్‌ ఎందుకు వద్దనుకుంటోంది?
245 మంది సభ్యులున్న ఎగువ సభలో కాంగ్రెస్‌కు 51మంది ఎంపీలున్నారు. సహజంగానే విపక్ష పార్టీ తరఫున కాంగ్రెస్‌ అభ్యర్థే బరిలో ఉండాలి. కానీ ఎన్డీఏయేతర పక్షాల అభ్యర్థి గెలవాలంటే యూపీఏయేతర పార్టీలు కాంగ్రెస్‌కు మద్దతిచ్చే అవకాశం తక్కువే. బిజూ జనతాదళ్‌ (9), టీఆర్‌ఎస్‌ (6) వంటి పార్టీల మద్దతు తప్పనిసరి. ఈ పార్టీలూ టీఎంసీ అభ్యర్థి బరిలో ఉంటే మద్దతిస్తాయని కాంగ్రెస్‌ భావిస్తోంది. బీజేపీకి కాస్త అనుకూలంగా ఉంటున్న ఏఐఏడీఎంకే (13) చివరి నిమిషంలో తన నిర్ణయాన్ని మార్చుకోవచ్చని కాంగ్రెస్‌ నేతలంటున్నారు. 123 ఎంపీల మద్దతుంటేనే విజయం దక్కే ఈ ఎన్నికలో బీజేపీ, విపక్షాల మధ్య హోరాహోరీ పోరు తప్పదని తెలుస్తోంది. సమాజ్‌వాదీ పార్టీకి 13 మంది ఎంపీలుండగా.. 5–10 ఎంపీలున్న పార్టీలు కనీసం 8 వరకున్నాయి. మిగిలిన పార్టీలకు ఇద్దరు, ముగ్గురు సభ్యుల బలముంది.

బీజేపీలో తర్జన భర్జన
ఈ ఎన్నికలపై 69 మంది సభ్యులున్న బీజేపీ మాత్రం ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని అధికార పార్టీ చెబుతోంది. జూన్‌ 15న ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌ మధ్య జరిగిన భేటీలో టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత కే కేశవరావును బరిలో దించడంపై చర్చించినట్లు వార్తలొచ్చాయి

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top