హిందీని బలవంతంగా రుద్దొద్దు

One language should not be imposed on others - Sakshi

కర్ణాటక సీఎం కుమారస్వామి వ్యాఖ్య

ఉత్తరాదివాళ్లు తమిళం, మలయాళం నేర్చుకోవాలన్న శశిథరూర్‌

బెంగళూరు: హిందీయేతర రాష్ట్రాల్లో ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచి హిందీని బోధించాలన్న ముసాయిదా ప్రతిపాదనపై అసమ్మతి స్వరాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే డీఎంకే అధినేత స్టాలిన్‌ కేంద్రంపై తీవ్రస్థాయిలో మండిపడగా, తాజాగా కర్ణాటక సీఎం కుమారస్వామి ఆయనకు తోడయ్యారు. త్రిభాషా ఫార్ములా పేరుతో ఓ భాషను రాష్ట్రాలపై బలవంతంగా రుద్దడం సరికాదని తెలిపారు. త్రిభాషా ఫార్ములాను తిరస్కరించడం సమస్యకు పరిష్కారం కాదని కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌ అభిప్రాయపడ్డారు. ‘దక్షిణాది రాష్ట్రాల్లోని చాలామంది హిందీని రెండో భాషగా నేర్చుకుం టారు. కానీ ఉత్తరాది వాళ్లెవరూ తమిళం, లేదా మలయాళంను నేర్చుకోవడం లేదు. ఈ సమస్యను పరిష్కరించాలంటే త్రిభాషా ఫార్ములాను దేశవ్యాప్తంగా అమలు చేయాలి’ అని చురకలు అంటించారు. భారత విభజన శక్తులు ఈ ప్రతిపాదనను చూసి భయపడుతున్నాయని బెంగళూరు సౌత్‌ ఎంపీ, బీజేపీ నేత తేజస్వీ సూర్య విమర్శించారు. రాష్ట్రాలపై హిందీని బలవంతంగా రుద్దితే తీవ్రమైన భాషాదురభిమానానికి దారితీస్తుందని సీపీఎం హెచ్చరించింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top