సర్వేపల్లిలో మళ్లీ కాకాణికే పట్టం

Once Again Kakani Govardhan Reddy Won In YSRCP PSR Nellore seat - Sakshi

సాక్షి, వెంకటాచలం: సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు మరోసారి వైఎస్సార్‌సీపీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డికే పట్టం కట్టారు. గత ఎన్నికల్లో ఓటమి చెంది, దొడ్డిదారిన మంత్రి పదవి పొంది నియోజకవర్గంలో అభివృద్ధి మాటున అవినీతికి పాల్పడిన సోమిరెడ్డికి మరోసారి ఓటుతోనే ప్రజలు బుద్ధి చెప్పారు. 2014 ఎన్నికల్లో 5,744 ఓట్ల ఆధిక్యంతో కాకాణి గెలుపొందారు.  ప్రస్తుతం గురువారం ప్రకటించిన ఎన్నికల ఫలితాల్లో 13,866 ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. నియోజకవర్గంలో 282 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో 2,30,417మంది ఓటర్లుండగా 1,89,916 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.

మొత్తం 10 మంది అభ్యర్థులు పోటీపడగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. నెల్లూరు గ్రామీణ మండలం కనుపర్తిపాడు ప్రియదర్శిని ఇంజినీరింగ్‌ కళాశాలలో  తిరుపతి పార్లమెంటరీతోపాటుగా ఆ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపులో తొలుత పోస్టల్‌ బ్యాలట్‌ ఓట్లు లెక్కిస్తారని భావించగా అధికారులు ఈవీఎంలలో రౌండ్లవారిగా లెక్కింపును చేపట్టారు. తొలి రౌండ్‌ పొదలకూరు మండలం సూరాయపాళెం నుంచి ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభానికి ముందే సోమిరెడ్డి కౌంటింగ్‌ కేంద్రానికి చేరుకున్నారు. తొలి రౌండ్‌లో వైఎస్సార్‌సీపీకి 1,758 ఓట్ల ఆధిక్యం వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. అప్పటి నుంచి మధ్యాహ్నం వరకు జరిగిన రౌండ్ల ఓట్ల లెక్కింపునకు సంబంధించిన ఫలితాలు ఆలస్యంగా బయటకు వచ్చాయి.

ఐదు మండలాల్లోనే కాకాణిదే హవా
ఎన్నికల ఫలితాల్లో మొదటి రౌండ్‌ నుంచి చివరిదైన 21వ రౌండ్‌ వరకు కాకాణి గోవర్ధన్‌రెడ్డిదే హవా కొనసాగింది. తొలి ఐదు రౌండ్లు పొదలకూరు మండల పరిధిలోని పోలింగ్‌ కేంద్రాల ఓట్లను లెక్కించారు. ఈ లెక్కింపులో కాకాణి గోవర్ధన్‌రెడ్డికి 4,223 ఓట్ల ఆధిక్యం లభించింది. ఆ తర్వాత తోటపల్లి గూడూరు, ముత్తుకూరు, వెంకటాచలం, మనుబోలు మండలాల్లో వరుసగా అన్ని రౌండ్లలోనూ కాకాణి ఆ««ధిక్యతను సాధించారు. వెంకటాచలం మండలం తిక్కవరప్పాడు పంచాయతీ పరిధిలోని 215పోలింగ్‌ బూత్‌తోపాటుగా ముత్తుకూరు మండలంలోని 150వ పోలింగ్‌ బూత్‌ ఓట్ల లెక్కింపు ఈవీఎంల సమస్య కారణంగా మధ్యలో నిలిపివేశారు.

21 రౌండ్లు పూర్తయిన తరువాత ఆ ఓట్లు లెక్కింపును చేపట్టారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో వైఎస్సార్‌సీపీకి 541, టీడీపీకి 435 పోలైంది.  అప్పటికే  కాకాణి గోవర్ధన్‌రెడ్డి విజయం ఖరారు కావడంతో ఆరు గంటలు దాటిన తరువాత ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి కౌంటింగ్‌ కేంద్రం వద్దకు చేరుకున్నారు. తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడు, సర్వేపల్లి నియోజకవర్గ ఎన్నికల అధికారుల నుంచి ధ్రువీకరణ పత్రాన్ని కాకాణి గోవర్ధన్‌రెడ్డి అందుకున్నారు. ఆ తరువాత లెక్కించిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలోనూ కాకాణి గోవర్ధన్‌రెడ్డికే  మెజారిటీ లభించింది. ఆరంభం నుంచి ఎక్కడా వైఎస్సార్‌సీపీ ఆధిక్యత తగ్గకపోవడంతో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు నియోజకవర్గం అంతటా ఉదయం నుంచే సంబరాల్లో మునిగితేలారు.    

అన్ని రౌండ్లలో కాకాణిదే ఆధిక్యం  
వెంకటాచలం: సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో సర్వేపల్లి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తొలి రౌండ్‌ నుంచి చివరి రౌండ్‌వరకు తన ఆధిక్యతను చాటుకున్నారు. 2014 ఎన్నికల్లో మొత్తం 17 రౌండ్లలో ఓట్ల లెక్కింపు చేపట్టగా అందులో 12 రౌండ్లలో కాకాణి ఆధిక్యతను సాధించారు. మిగిలిన ఐదు రౌండ్లలో మాత్రమే తన సమీప టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆధిక్యత సాధించినా చివరకు ఓటమి చెందారు. ప్రస్తుతం 2019 ఎన్నికలకుసంబంధించి ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్‌లో తన సమీప టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపై 1,758 ఓట్ల ఆధిక్యతను సాధించారు. పొదలకూరు మండలం సూరాయపాళెం పోలింగ్‌ బూత్‌ నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. రెండో రౌండ్‌లో 105, మూడవ రౌండ్‌లో 914, నాల్గో రౌండ్‌లో 111, ఐదో రౌండ్‌లో 1443, ఆరవ రౌండ్‌లో 421, ఏడో రౌండ్‌లో 951, ఎనిమిదో రౌండ్‌లో 874 ఓట్ల ఆధిక్యాన్ని సాధంచారు.

అలాగే తొమ్మిదో రౌండ్‌లో 1154, పదో రౌండ్‌లో 1588, 11రౌండ్‌లో 354, 12రౌండ్‌లో 71 ఓట్లు ఆధిక్యత లభించింది. 13రౌండ్‌లో 201, 14రౌండ్‌లో 228, 15 రౌండ్‌లో 628, 16రౌండ్‌లో 751, 17రౌండ్‌లో 857, 18రౌండ్‌లో 206, 19రౌండ్‌లో701, 20వ రౌండ్‌లో 210, 21వ రౌండ్‌లో 340 ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు. వెంకటాచలం మండలం తిక్కవరప్పాడులోని 215 పోలింగ్‌ బూత్‌తో పాటుగా ముత్తుకూరు మండలంలలో మరొక పోలింగ్‌బూత్‌కు సంబంధించి ఈవీఎంల సమస్య కారణంగా ఓట్ల లెక్కింపు ఆలస్యమైంది. వీటి లెక్కింపును చివరగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు అనంతరం లెక్కించారు. మొత్తంగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తన సమీప అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపై 13,886 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.    

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top