మోదీ నియోజకవర్గంలో ఏబీవీపీకి షాక్‌.. 

NSUI Won All seats In Sanskrit University of Varanasi - Sakshi

వారణాసి : వారణాసిలోని సంపూర్ణానంద్ సంస్కృత విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం ఎన్నికల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌(ఏబీవీపీ)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఎన్నికల్లో ఏబీవీపీ ఘోరంగా ఓడిపోయింది. మొత్తం నాలుగు సీట్లను కాంగ్రెస్‌ విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యూఐ కైవసం చేసుకుంది. విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్‌ఎస్‌యూఐకి చెందిన శివమ్‌ శుక్లా ఏబీవీపీ నాయకుడు హర్షిత్‌ పాండే మీద భారీ మెజారిటీతో గెలుపొందారు. 

అలాగే ఎన్‌ఎస్‌యూఐకి చెందిన చందన్‌ కుమార్‌ ఉపాధ్యక్షుడిగా, అవ్నీశ్‌ పాండే జనరల్‌ సెక్రటరీగా, రజనీకాంత్‌ దుబే లైబ్రెరియన్‌గా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారి ప్రొఫెసర్‌ శైలేష్‌ కుమార్‌ ఫలితాలు ప్రకటించిన తరువాత.. యూనివర్సిటీ వైఎస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ రాజరామ్‌ శుక్లా.. వారిచేత సంస్కృతంలో ప్రమాణం చేయించారు. అలాగే వివాదాలకు దూరంగా ఉండేందుకు గెలిచిన అభ్యర్థులు క్యాంపస్‌లో ఊరేగింపు చేపట్టరాదని శుక్లా సూచించారు. అయితే గెలిచిన ఎన్‌ఎస్‌యూఐ నేతలు వారి ఇళ్లకు వెళ్లేటప్పుడు పోలీసు భద్రత కల్పించారు. అయితే ఈ ఎన్నికల్లో కేవలం 50.82 శాతం మంది విద్యార్థులు మాత్రమే ఓటు వేయడం గమనార్హం. కాగా, ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గం పరిధిలోని యూనివర్సిటీ ఎన్నికల్లో ఏబీవీపీ ఓడిపోవడం చర్చనీయాంశంగా మారింది. గతేడాది జేఎన్‌యూ విద్యార్థి సంఘం ఎన్నికల్లో కూడా ఏబీవీపీ ఒక్క సీటులో గెలుపొందని సంగతి తెలిసిందే.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top