
సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌లో జరిగిన పుల్వామా ఉగ్రదాడి విషయంలో ఇంటిలిజెన్స్ వైఫల్యం ఏమీ లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. బుధవారం లోక్‌సభలో జరిగిన చర్చలో భాగంగా ఆయన ఈ ప్రకటన చేశారు. దేశ భద్రత కోసం ఇంటిలిజెన్స్, భద్రతా సిబ్బంది ఎంతో సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు. గడిచిన మూడు దశాబ్ధాల కాలంలో అనేక మంది ఉద్రవాదులను భారత బలగాలు హతమార్చాయని ఆయన గుర్తుచేశారు. పుల్వామా ఉగ్రదాడికి కారణమైన జైషే ఏ మహ్మద్ స్థావరాలపై దాడులు చేసి.. ప్రతీకార చర్యలను కూడా చేపట్టామన్నారు.
దేశంలో అశాంతి అనే పదం వినపించకుండా పాలించడమే ప్రభుత్వం లక్ష్యమని కిషన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదుల కుట్ర కారణంగానే ఫిబ్రవరి 14న జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మరణించారని వెల్లడించారు. దానిలో భాగంగా ఫిబ్రవరి 26న పాక్ సరిహద్దులోని బాలాకోట్‌పై భారత వైమానిక దళాలు మెరుపు దాడులు చేపట్టినట్లు కిషన్‌రెడ్డి గుర్తుచేశారు.