పార్లమెంట్‌ గడప తొక్కని..జిల్లా ‘మహిళ’!

No Women Candidate For Nalgonda Lok Sabha Elections - Sakshi

1952 నుంచి ఇప్పటి దాకా ఎంపీలు కాలేకపోయిన మహిళలు

ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసింది ఒకే ఒక్కరు

మల్లు స్వరాజ్యానికి అవకాశం ఇచ్చిన సీపీఎం 

సాక్షి, నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రెండు పార్లమెంట్‌ నియోజకవర్గాలున్నా.. స్వతంత్ర భారతంలో 1952 నుంచి మొదలై ఇప్పటి దాకా జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో ఒక్కరంటే ఒక్క మహిళ కూడా ఇక్కడి నుంచి ఎంపీగా గెలవలేదు.. పార్లమెంట్‌ గడప తొక్కలేదు. నల్లగొండ పార్లమెంట్‌ నియోజకవర్గానికి 1952 నుంచి 2014 వరకు పదిహేడు పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో పీడీఎఫ్, కాంగ్రెస్, సీపీఐ, టీపీఎస్, టీడీపీలు ప్రాతినిథ్యం వహించాయి. కానీ, ఈ పార్టీల నుంచి ఇప్పటి దాకా ఒక్క మహిళ కూడా ఎంపీలుగా పోటీ చేసింది లేదు.  మరోవైపు 2004 వరకు ఉనికిలో ఉన్న మిర్యాలగూడ పార్లమెంట్‌ నియోజకవర్గం 1962 నుంచి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నియోజకవర్గం రద్దయ్యే వరకు 12 సార్లు ఎన్నికలు జరగగా.. ఒక్క మహిళ కూడా ఎంపీగా గెలిచింది లేదు. ఇక్కడి నుంచి సీపీఎం 1996 ఎన్నికల్లో ఒక్కసారి మల్లు స్వరాజ్యాన్ని పోటీకి నిలబెట్టింది.

అసెంబ్లీకి వెళ్లినా... దక్కని పార్లమెంట్‌ యోగం
ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలుగా ప్రాతినిథ్యం వహించిన వారు, మంత్రులుగా పనిచేసిన మహిళలు ఉన్నా.. ఎంపీలుగా మాత్రం వారికి అవకాశం దక్కలేదు. ఎమ్మెల్యేలుగా... ఆరుట్ల కమలా దేవి, మల్లు స్వరాజ్యం, కమలమ్మ, గడ్డం రుద్రమదేవి,  ఉమా మాధవరెడ్డి, సునీతా మహేందర్‌రెడ్డి, ఉత్తమ్‌పద్మావతి... వంటి వారు ఎమ్మెల్యేలుగా పనిచేశారు. ఆరుట్ల కమలాదేవి, ఉమా మాధవరెడ్డి మూడేసి సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఉమా మాధవరెడ్డి రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. గత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో విప్‌గా పనిచేసిన సునీతామహేందర్‌ రెడ్డి ఆలేరు నుంచి రెండో సారి కూడా విజయం సాధించారు.

శాసన సభలో జిల్లా మహిళకు చోటు దక్కినా.. వారికి పార్లమెంట్‌ యోగం మాత్రం దక్కలేదు. వాస్తవానికి వారిని అభ్యర్థులుగా నిలబెట్టడంలో ఆయా పార్టీలు విఫలమయ్యాయన్న అభిప్రాయం బలంగా ఉంది. మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి 1996 పోటీ సీపీఎం అభ్యర్థిగా పోటీ చేసిన వీర తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. కాంగ్రెస్‌ అభ్యర్థి బద్దం నర్సింహారెడ్డి చేతిలో ఆమె 43,876 ఓట్ల తేడాతో ఓడిపోయారు. జిల్లా పార్లమెంట్‌ ఎన్నికల చరిత్రలో సీపీఎం మాత్రమే తన అభ్యర్థిగా మహిళను బరిలోకి దింపింది.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top