పైలట్‌తో 18 నెలలుగా మాటల్లేవ్‌: గహ్లోత్‌

No Talks With Sachin Pilot from past 18 months says Ashok Gehlot - Sakshi

సచిన్‌ పైలట్‌తో తనకు గడిచిన 18 నెలలుగా మాటలు లేవని సీఎం గహ్లోత్‌ సంచలన విషయం చెప్పారు. తన ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు పైలట్‌ మొదటి రోజు నుంచే ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బీజేపీలో చేరడం లేదని చెబుతున్న పైలట్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి తిరిగి వస్తే ఆలింగనంతో ఆహ్వానిస్తానని ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గహ్లోత్‌ అన్నారు.

‘గత ఏడాదిన్నర కాలం నుంచి మేం ఒక్కసారి కూడా మాట్లాడుకోలేదు. ముఖ్యమంత్రితో మాట్లాడని మంత్రి అతడు’అని అన్నారు. ‘నేను మొదటిసారి ఎంపీ అయినప్పటికి అతడి వయస్సు మూడేళ్లు. దశాబ్దాలుగా అతని కుటుంబంతో నాకు సంబంధాలు కొనసాగుతున్నాయి. మళ్లీ పార్టీలోకి వస్తే అతడిని మనస్ఫూర్తిగా ఆలింగనం చేసుకుని ఆహ్వానిస్తా’అని తెలిపారు.

గహ్లోత్‌ ప్రభుత్వానికి బీటీపీ మద్దతు
గహ్లోత్‌ ప్రభుత్వానికే తమ మద్దతని భారతీయ ట్రైబల్‌ పార్టీ (బీటీపీ) తెలిపింది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, పీసీసీ అధ్యక్షుడి సమక్షంలో శనివారం ఈ విషయం ప్రకటించారు. గహ్లోత్‌ శనివారం సాయంత్రం గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రాతో భేటీ అయ్యారు. దాదాపు 45 నిమిషాల పాటు కొనసాగిన భేటీలో రాష్ట్రంలో కోవిడ్‌పై చర్చించినట్లు సీఎం తెలిపారు.

గహ్లోత్‌ సన్నిహితులపై ఐటీ కన్ను
గహ్లోత్‌ సన్నితులైన పారిశ్రామిక వేత్తలు, వాణిజ్యవేత్తలకు పన్ను ఎగవేతకు సంబంధించి త్వరలో నోటీసులు జారీ చేయనున్నట్లు ఆదాయ పన్ను శాఖ తెలిపింది. రతన్‌కాంత్‌ శర్మ, సునీల్‌ కొఠారి, రాజీవ్‌ అరోరాలతోపాటు ఎమ్మెల్యే ధర్మేంద్ర రాథోడ్‌లను విచారించనున్నట్లు తెలిపింది. ముంబై, ఢిల్లీ, కోటా, జైపూర్‌ల్లో వీరికి చెందిన 43 ప్రాంతాల్లో ఈ నెల 13వ తేదీన జరిపిన సోదాల్లో అనేక కీలక పత్రాలు, రూ.12 కోట్ల నగదు, రూ.1.5 కోట్ల విలువైన నగలు లభ్యమైనట్లు వెల్లడించింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top