
సాక్షి, హైదరాబాద్: టీడీపీకి గుడ్‌బై చెప్పిన రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఎల్లుండి (మంగళవారం) కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో ఆయన పార్టీలో చేరే అవకాశముంది. రేవంత్ రాకపై కాంగ్రెస్ పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. డీకే అరుణ వంటి పలువురు నేతలు ఆయన రాకను వ్యతిరేకించినట్టు కథనాలు వచ్చాయి. తాజాగా ఈ విషయమై తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ కుంతియ వివరణ ఇచ్చారు.
కాంగ్రెస్‌లోకి రేవంత్ రాకను ఎవరూ వ్యతిరేకించడం లేదని తెలిపారు. డీకే అరుణతో ఇప్పటికే మాట్లాడానని, పెద్ద వ్యతిరేకత లేదని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో షరతులతో కూడిన చేరికలు ఉండవని కుంతియ చెప్పుకొచ్చారు. నవంబర్‌లో రాహుల్ పర్యటన ఉంటుందని చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ సర్కారు చేపట్టిన పెద్దనోట్ల రద్దుకు నిరసనగా నవంబర్ 8న బ్లాక్ డేకు పిలుపునిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. రేవంత్‌రెడ్డి పార్టీలో చేరుతున్న నేపథ్యంలో కుంతియ తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణ, రేవంత్ రాక అంశాలపై చర్చించారు.