మహా ఉత్కంఠ : ఎన్సీపీ కీలక ప్రకటన

NCP Hints At Supporting Shiv Sena To Form Government - Sakshi

ముంబై : మహారాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. బీజేపీ, శివసేనలు ఎవరికి వారు సొంతంగా ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు ముమ్మరం చేస్తుండగా ఎన్సీపీ కీలక సంకేతాలు పంపింది. ప్రభుత్వ ఏర్పాటుకు శివసేనకు మద్దతిస్తామని ఎన్సీపీ సూచనప్రాయంగా వెల్లడించింది. బీజేపీ తోడ్పాటు లేకుండా ఛత్రపతి శివాజీ పేర్కొన్న తరహాలో ప్రజా ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన ముందుకువస్తే తాము సానుకూలంగా స్పందిస్తామని ఎన్సీపీ ముఖ్య అధికార ప్రతినిధి నవాబ్‌ మాలిక్‌ స్పష్టం చేశారు. మహారాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆ పార్టీ చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే అడుగులు వేస్తే ప్రత్యామ్నాయాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.

కాగా ప్రజలు తమకు విపక్ష స్ధానాన్ని కట్టబెట్టినందున, ఎన్సీపీ ప్రతిపక్షంలో కూర్చుంటుందని ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ ప్రకటించిన క్రమంలో నవాబ్‌ మాలిక్‌ ప్రకటన అందరినీ ఆశ్యర్యంలో ముంచెత్తింది. నవంబర్‌ 7 నాటికి నూతన ప్రభుత్వం ఏర్పాటు కాని పక్షంలో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధిస్తారని బీజేపీ నేత సుధీర్‌ ముంగతివర్‌ ప్రకటన పట్ల మాలిక్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో బీజేపీ రాష్ట్రపతి పాలన విధించడాన్ని తాము అనుమతించబోమని, రాష్ట్రానికి ప్రజాస్వామ్య ప్రక్రియలో నూతన దిశను అందిస్తామని స్పష్టం చేశారు. తాము ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని అందించేందుకు సిద్ధమని, శివసేన ఇతర పార్టీలు దీనిపై తమ​ వైఖరిని వెల్లడించాలని కోరారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top