పవార్‌తో పవర్‌ పంచుకుంటారా?

NCP chief Sharad Pawar to meet Sonia Gandhi in Delhi - Sakshi

శివసేన రూటు మారుస్తుందా ?

రేపు సోనియాతో, శరద్‌ పవార్‌ భేటీ

రంగులు మారుతున్న మహారాష్ట్ర రాజకీయం

సాక్షి, ముంబై/న్యూఢిల్లీ: రోజుకో రాజకీయం, పూటకో మలుపు, నేతల మధ్య మాటల తూటాలు, కొత్త పొత్తుల కోసం ఆరాటాలు ఇలా మహారాష్ట్ర రాజకీయం రంగులు మారుతోంది. 50:50 ఫార్ములాకే శివసేన పట్టుబట్టడం, అవసరమైతే రాష్ట్రపతిపాలనకైనా సిద్ధపడతామని బీజేపీ తేల్చి చెప్పడంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటులో పీటముడి మరింత బిగుసుకుంది. అధికారం కోసం చావో రేవోకో సిద్ధపడిన శివసేన పవార్‌తో పవర్‌ పంచుకుంటామనే సంకేతాలు పంపుతోంది.

ఇప్పటివరకు ప్రతిపక్షంలోనే కూర్చుంటామన్న ఎన్సీపీ తన రూటు మార్చుకుంటుందా అన్న చర్చ జరుగుతోంది. ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ ఆదివారం ఢిల్లీకి వెళ్లనున్నారు. సోమవారం కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీతో ఆయన భేటీ అవుతారు. దేశ ఆర్థిక పరిస్థితిపై చర్చించడం కోసమే ఢిల్లీ వెళుతున్నానని పవార్‌ బయటకి చెబుతున్నప్పటికీ, బీజేపీని అధికారానికి దూరం చేయడం కోసం కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి శివసేనకు మద్దతు ఇవ్వడంపై  గల సాధ్యాసాధ్యాలను చర్చించడమే ప్రధాన ఎజెండా అన్న ఊహాగానాలు సాగుతున్నాయి.

‘నవంబర్‌ 4, సోమవారం ఢిల్లీలో సోనియాగాంధీతో శరద్‌ పవార్‌ భేటీ అవుతారు. ఆయన ఈ మధ్య ఫోన్‌లో ఆమెతో మాట్లాడారు. వాళ్ల మధ్య ఏయే అంశాలు చర్చకు వస్తాయో ఆ రోజే తెలుస్తుంది’ అని కాంగ్రెస్, ఎన్సీపీ హయాంలో డిప్యూటీ సీఎంగా పని చేసిన అజిత్‌ పవార్‌ చెప్పారు. శివసేన, ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే,  కాంగ్రెస్‌ బయట నుంచి మద్దతు ఇచ్చేలా మూడు పార్టీల మధ్య ఒక అవగాహన కుదురుతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. శివసేన ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలంటూ ఇప్పటికే కాంగ్రెస్‌లో స్వరాలు పెరుగుతున్నాయి. ఆ పార్టీ నేత హుస్సేన్‌ దల్వాయ్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాకు లేఖ రాశారు. సేనకు మద్దతివ్వాలని ఆ లేఖలో ఆయన కోరారు.  

సంకీర్ణ ధర్మానికే కట్టుబడతాం: సంజయ్‌
మహారాష్ట్ర ఫలితాలు వెలువడి పది రోజులు దాటిపోయినా ప్రభుత్వ ఏర్పాటు అంశంలో అడుగు కూడా ముందుకు పడకపోవడం ఉత్కంఠకు దారి తీస్తోంది. చివరిక్షణం వరకు తాము సంకీర్ణ ధర్మానికే కట్టుబడి ఉంటామని శివసేన నాయకుడు సంజయ్‌ రౌత్‌ తెలిపారు. ఈ నెల 9తో 13వ శాసనసభ గడువు ముగిసిపోనుంది. అయినప్పటికీ రెండు పార్టీల మధ్య ప్రభుత్వ ఏర్పాటుపై అధికారిక చర్చలేవీ జరగలేదు. మహారాష్ట్ర ప్రజలు బీజేపీ, శివసేనలకు కలిపి అధికారాన్ని అప్పగించారని, అందుకోసం తాము ఇద్దరూ కలిసే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి వేచి చూస్తామన్నారు.  

ఉద్ధవ్‌ సీఎం కావాలి: అథవాలే
శివసేన తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆదిత్య ఠాక్రేని ముందుకు తీసుకురావడాన్ని కేంద్ర మంత్రి, ఆర్‌పీఐ (ఏ) చీఫ్‌ రామ్‌దాస్‌ అథవాలే వ్యతిరేకించారు. భవిష్యత్‌లో శివసేనకు ఆ అవకాశం వస్తే ఆదిత్య బదులుగా ఉద్ధవ్‌ ఠాక్రే ఆ పదవిని చేపడితే బాగుంటుందని సూచించారు. ఈ విషయంలో శివసేన పునరాలోచించాలని అన్నారు. రామ్‌దాస్, ఇతర బీజేపీ మిత్రపక్షాలతో కలిసి  మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోషియారీను శనివారం కలుసుకున్నారు. అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీనే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పిలవాలని ఆయన గవర్నర్‌ని కోరారు.  

రాష్ట్రపతి మీ జేబులో ఉన్నారా?
ఈ నెల 7లోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోతే మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధిస్తామన్న బీజేపీ సీనియర్‌ నేత సుధీర్‌ మంగన్‌తివార్‌ వ్యాఖ్యలపై శివసేన పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయంలో విరుచుకుపడింది. మహారాష్ట్రకే అవమానం, రాష్ట్రపతి మీ జేబులో ఉన్నారా ? అన్న హెడ్డింగ్‌తో రాసిన సంపాదకీయంలో సుధీర్‌ చేసిన ప్రకటన అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధమంటూ ధ్వజమెత్తింది. ఇలాంటి వ్యాఖ్యలు  ప్రజాతీర్పునే అవమానించినట్టు అవుతుందని రాష్ట్రపతి అధికార పక్షం జేబులో ఉన్నారా అంటూ ప్రశ్నించింది. కొత్త ఎమ్మెల్యేలను భయపెట్టడానికే రాష్ట్రపతి పాలన అస్త్రాన్ని బయటకు తీశారా? అని∙ ఆ సంపాదకీయంలో బీజేపీని శివసేన నిలదీసింది.

కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ శనివారం హరియాణా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్‌సింగ్‌ హుడాను కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ (సీఎల్పీ) నేతగా నియమించారు. కొత్తగా ఎన్నికైన అసెంబ్లీలో హుడా విపక్ష నేతగా వ్యవహరిస్తారని కాంగ్రెస్‌  నేత ఆజాద్‌ వెల్లడించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top