గత ఐదేళ్లు శ్రమించాం.. వచ్చే ఐదేళ్లలో ఫలితాలు

Narendra Modi Mega Roadshow in Varanasi - Sakshi

వారణాసి ఇచ్చిన ధైర్యంతోనే    ఉగ్రవాదులకు దీటుగా సమాధానం

ఐదేళ్లలో దేశంలో ఎక్కడా బాంబు పేలుళ్లు జరగలేదు

వారణాసిలో ప్రధాని మోదీ రోడ్‌షో... గంగానదికి హారతి ఇచ్చిన మోదీ

వారణాసి/దర్భంగా: ఏ ఉగ్రమూకలకైనా సరికొత్త భారత్‌ దిమ్మతిరిగే జవాబు ఇస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. గత ఐదేళ్లలో దేశంలోని ఏ నగరంలోనూ, పుణ్యక్షేత్రాలు, ఆలయాల్లోనూ బాంబు పేలుళ్లు చోటుచేసుకోలేదని గుర్తుచేశారు. ఇటీవల కుంభమేళాను సైతం విజయవంతంగా, ప్రశాంతంగా నిర్వహించామని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో ఉగ్రస్థావరాలపై వైమానికదాడుల నేపథ్యంలో ప్రస్తుతం ప్రపంచదేశాలన్నీ భారత్‌కు అండగా నిలుస్తున్నాయని వెల్లడించారు. పుల్వామా ఉగ్రదాడి  అనంతరం అదే ప్రాంతంలో 42 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టామనీ, తమ ప్రభుత్వం ఇలాగే పనిచేస్తుందని పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సొంత నియోజకవర్గం వారణాసిలో గురువారం మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

అన్నీ చేసేశా అని చెప్పను..
వారణాసి లోక్‌సభ స్థానం నుంచి రెండోసారి పోటీ చేయడంపై మోదీ మాట్లాడుతూ..‘నేను వారణాసిలో ఏయే అభివృద్ధి పనులను చేపట్టాలని భావించానో అవన్నీ పూర్తి చేసేశానని చెప్పను. కానీ ఆ అభివృద్ధి పనులు మాత్రం ఇప్పుడు సరైన దిశలో, వేగంగా జరుగుతున్నాయి. గత ఐదేళ్లలో మేం నిజాయితీగా పనిచేశాం. దాని ఫలితాలు రాబోయే ఐదేళ్లలో ప్రజలు చూడబోతున్నారు’ అని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం ప్రస్తుతం పెనుసమస్యగా మారిపోయిందని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఇటీవల శ్రీలంకలో వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ప్రజలంతా ప్రార్థనల కోసం కుటుంబాలతో కలిసి చర్చిలకు వచ్చారు. కానీ వాళ్లు ప్రాణాలతో ఇళ్లకు తిరిగి వెళ్లలేదు. వాళ్లకు జీవితంలో అన్నీ ఉన్నాయి. కానీ వాటన్నింటిని ఉగ్రవాదులు ఒక్కసారిగా లాగేసుకున్నారు. ఉగ్రవాదంపై కఠినంగా వ్యవహరించకపోతే దేశానికి అన్యాయం చేసినట్లే’ అని స్పష్టం చేశారు.   

అనుమతిస్తే నామినేషన్‌ వేస్తా..
ఉగ్రవాదులకు తమదైన భాషలో జవాబు చెప్పే ధైర్యం కాశీ(వారణాసి) తనకు ఇచ్చిందని ప్రధాని మోదీ అన్నారు. ‘మీ అందరికీ సేవచేసే అవకాశం రావడం నిజంగా నా అదృష్టమే. మీరంతా అనుమతిస్తే మరోసారి నేను నామినేషన్‌ దాఖలు చేస్తా’ అని తెలిపారు. ‘మీ అందరికీ మరోసారి సేవచేసేందుకు ఓట్లడిగే ముందు గత ఐదేళ్లలో ఏం చేశానో చెప్పాల్సిన బాధ్యత, జవాబుదారీతనం నాపై ఉన్నాయి. కానీ కొంతమంది(కాంగ్రెస్‌ పార్టీ) మాత్రం 70 ఏళ్లు పాలించినా ఏం చేశారో చెప్పరు. అది వారిష్టం’ అని చురకలు అంటించారు.

వారణాసిలో నామినేషన్‌ నేడే..
ప్రధాని మోదీ బీజేపీ తరఫున వారణాసిలో శుక్రవారం ఉదయం 11.30 గంటలకు నామినేషన్‌ దాఖలు చేస్తారని బీజేపీ సీనియర్‌ నేత ఒకరు తెలిపారు. తొలుత ఉదయం 9.30 గంటలకు వారణాసిలోని బూత్‌స్థాయి నేతలు, కార్యకర్తలతో మోదీ సమావేశమవుతారని వెల్లడించారు. కాలభైరవుడికి ఉదయం 11 గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నామినేషన్‌ వేసేందుకు వెళతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే, జేడీయూ చీఫ్‌ నితీశ్‌ కుమార్, అకాలీదళ్‌ నేత ప్రకాశ్‌సింగ్‌ బాదల్, ఎల్‌జేపీ అధ్యక్షుడు రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ హాజరవుతారని చెప్పారు. వీరితో పాటు అన్నాడీఎంకే, అప్నాదళ్, నార్త్‌–ఈస్ట్‌ డెమొక్రటిక్‌ అలయెన్స్‌ నేతలు హాజరయ్యే అవకాశముందన్నారు.

లాంతర్ల రోజులు పోయాయి..
బిహార్‌ పర్యటనలో భాగంగా రాష్ట్రీయ జనతాదళ్‌(ఆర్జేడీ) అధినేత లాలూప్రసాద్‌ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులు లక్ష్యంగా మోదీ విమర్శలు గుప్పించారు. బిహార్‌లో లాంతర్లకు(ఆర్జేడీ ఎన్నికల గుర్తు) కాలం చెల్లిందనీ, ఇప్పుడు ఇంటింటికి విద్యుత్‌ అందుబాటులోకి వచ్చిందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘ఈ లాంతర్‌వాలాలు(ఆర్జేడీ నేతలు) ప్రజల ఇళ్లకు విద్యుత్‌ సౌకర్యాన్ని తీసుకొచ్చి ఉండొచ్చు. కానీ వీరంతా తమ కుటుంబాల్లో వెలుగు నింపుకునే పనిలో బిజీగా ఉన్నారు. వీళ్లలో ఒకరు ఫామ్‌హౌస్‌ కడుతుంటే, మరొకరు ఏకంగా షాపింగ్‌ మాల్‌ నిర్మించారు.

ఇంకొకరు అయితే రైల్వే టెండర్ల ద్వారా రెండుచేతులా సంపాదించారు’ అని ఐఆర్‌సీటీసీ కుంభకోణాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. మతవిశ్వాసాల కారణంగా తాను ‘వందేమాతరం’ గేయాన్ని ఆలపించననీ, భారత్‌ మాతాకీ జై అనడానికి తనకెలాంటి అభ్యంతరం లేదని ఆర్జేడీ నేత అబ్దుల్‌ బారీ సిద్దిఖీ చెప్పడంపై మోదీ స్పందిస్తూ..‘డిపాజిట్లు రాకుండా ఓడించాల్సింది ఇలాంటి వ్యక్తులను కాదా?’ అని సభికులను ప్రశ్నించారు. ఈ సందర్భంగా బిహార్‌ సీఎం నితీశ్‌ మాట్లాడుతూ.. రుణమాఫీ విషయంలో కాంగ్రెస్‌ రైతులను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిహార్‌ శరవేగంగా అభివృద్ధి చెందడానికి సాయం అందించినందుకు మోదీకి నితీశ్‌ కృతజ్ఞతలు తెలిపారు.

మోదీ నామస్మరణ..
గురువారం సాయంత్రం మోదీ వారణాసిలో భారీ రోడ్‌షోను నిర్వహించారు. తొలుత బనారస్‌ హిందూ వర్సటీ వ్యవస్థాపకుడు పండిట్‌ మదన్‌ మోహన్‌ మాళవీయ విగ్రహానికి నివాళులు అర్పించిన ర్యాలీని ప్రారంభించారు∙మోదీ 7 కి.మీ పాటు సాగిన రోడ్‌ షోలో బీజేపీ శ్రేణులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. రోడ్‌ షోకు హాజరైన వేలాది మంది బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులు మోదీ.. మోదీ.. భారత్‌ మాతాకీ జై అని ఇచ్చిన నినాదాలతో వారణాసి వీధులు మార్మోగాయి. బీజేపీ చీఫ్‌ అమిత్, యూపీ ముఖ్యమంత్రి యోగి, రాష్ట్ర బీజేపీ చీఫ్‌ మహేంద్రనాథ్‌ సహా పలువురు నేతలు ఈ రోడ్‌ షోలో పాల్గొన్నారు. రోడ్‌ షో ముగింపులో భాగంగా దశాశ్వమేథ ఘాట్‌ కు చేరుకున్న మోదీ, బీజేపీ చీఫ్‌ అమిత్‌షాతో కలిసి గంగానదికి హారతి ఇచ్చారు. ‘వారణాసిలో లభించిన ఆత్మీయత, ప్రేమకు కృతజ్ఞుడిని’ అని ట్వీట్‌ చేశారు.

మాళవీయ విగ్రహానికి నివాళులు అర్పించాక మద్దతుదారులకు మోదీ అభివాదం

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top