
సాక్షి, హైదరాబాద్ : తన పోరాటమంతా నిర్భయంగా మన అభిప్రాయాన్ని చెప్పే హక్కుని పరిరక్షించుకోవడానికేనని సినీ విమర్శకుడు కత్తి మహేశ్ అన్నారు. తనపై కోడిగుడ్లతో దాడి చేసిన వారిపై సినీ విమర్శకుడు మహేశ్ కత్తిపోలీసులకు చేసిన ఫిర్యాదును కొద్ది గంటల్లోనే ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘పోరాటం అంతా నిర్భయంగా మన అభిప్రాయాన్ని చెప్పే హక్కుని పరిరక్షించుకోవడానికి. అది ఎక్కడా నేను సరెండర్ చెయ్యను. నోరు మూసుకునే అవసరం లేదు. వ్యక్తుల్ని టార్గెట్ చెయ్యడం కాకుండా విధానాలు, సమస్యలు, ఆలోచనల గురించి నా అభిప్రాయాల్ని ఎప్పటిలాగే నిష్కర్షగా చెబుతూనే ఉంటాను’అని కత్తి ట్వీట్ చేశారు.
పోరాటం అంతా నిర్భయంగా మన అభిప్రాయాన్ని చెప్పే హక్కుని పరిరక్షించుకోవడానికి. అది ఎక్కడా నేను సరెండర్ చెయ్యను. నోరు మూసుకునే అవసరం లేదు. వ్యక్తుల్ని టార్గెట్ చెయ్యడం కాకుండా విధానాలు, సమస్యలు,ఆలోచనల గురించి నా అభిప్రాయాల్ని ఎప్పటిలాగే నిష్కర్షగా చెబుతూనే ఉంటాను.
— Kathi Mahesh (@kathimahesh) 20 January 2018
గురువారం ఓ టీవీ చానెల్ చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు క్యాబ్‌లో వెళ్తుండగా కత్తి మహేశ్‌పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కోడిగుడ్లతో దాడిచేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనను సీరియస్‌గా పరిగణించిన కత్తి శుక్రవారం మాదపూర్ పోలీస్ స్టేషన్‌లో సినీ నటుడు పవన్‌కల్యాణ్ అభిమానులే దాడి చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశాడు. కత్తిపై తామే దాడి చేశామని హైదరాబాద్‌లోని జగద్గీరిగుట్టకు చెందిన సతీష్, నాని అనే ఇద్దరు యువకులు ముందుకు వచ్చారు. అనంతరం ఓ టీవీ చానెల్ డిబెట్‌లో కత్తికి ఈ యువకుల మధ్య సయోధ్య కుదరడంతో ఆయన కేసును ఉపసంహరించుకున్నారు.