ములాయంకు మతి చలించిందా?

Mulayam Comments on Narendra modi, is it Memory loss Problem - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘అందరిని కలుపుకొని ముందుకు సాగేందుకు ప్రయత్నించిన ప్రధానమంత్రికి నా అభినందనలు. సభలోని సభ్యులందరూ విజయం సాధించి మళ్లీ సభకు వస్తారని ఆశిస్తున్నాను. ముఖ్యంగా మీరు (మోదీ) మళ్లీ ప్రధాన మంత్రి కావాలని కోరుకుంటున్నాను’ అని సమాజ్‌వాది పార్టీ నాయకుడు ములాయం సింగ్‌ యాదవ్‌ బుధవారం 16వ లోక్‌సభ ఆఖరి  సెషన్‌లో వ్యాఖ్యానించడం ఇంటా బయట సంచలనం సష్టించింది. లక్నో విమానాశ్రయంలో పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ నిర్బంధానికి వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్‌లో ఆందోళన నిర్వహిస్తున్న సమాజ్‌వాది పార్టీ కార్యకర్తలను ములాయం వ్యాఖ్యలు ఇబ్బందికి గురిచేశాయి.

రానున్న ఎన్నికల్లో పాలకపక్ష బీజేపీకి వ్యతిరేకంగా మహా కూటమిని ఏర్పాటు చేసేందుకు ఢిల్లీలో ప్రయత్నాలను ముమ్మరం చేసిన వివిధ పార్టీల నాయకులకు కూడా ములాయం వ్యాఖ్యలు చికాకును కలిగించాయి. ములాయం ఆరోగ్యం దెబ్బతిన్నదని, ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదని సమాజ్‌వాది పార్టీ నాయకులు అంటున్నారు. ‘ములాయం సింగ్‌ యాదవ్‌ తన చుట్టూ ఉన్న ప్రజలనే కాదు. కుటుంబ సభ్యులను కూడా గుర్తించని సందర్భాలు అనేకం ఉన్నాయి. ఆయన జ్ఞాపక శక్తి పూర్తిగా మందగించింది. ఆయన మాటల మధ్య పొందిక ఉండడం లేదు. మోదీ గురించి ఆయన అలా మాట్లాడడానికి అదే కారణమై ఉంటుంది’ అని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని పార్టీ సీనియర్‌ నాయకుడొకరు వ్యాఖ్యానించారు.

‘గత ఏడాది లక్నోలో ములాయం సింగ్‌ యాదవ్‌ తన సోదరుడు శివపాల్‌ యాదవ్‌కు చెందిన ప్రగతిశీల్‌ సమాజ్‌వాది పార్టీ సమావేశానికి వెళ్లినప్పుడు కూడా ఆయన ఇలాగే పొరపాటు వ్యాఖ్యలు చేశారు. తన పార్టీ అనుకొని శివపాల్‌ యాదవ్‌ పార్టీకి మద్దతివ్వాల్సిందిగా ప్రజలను కోరారు. ఇది సమాజ్‌వాది పార్టీ సమావేశం కాదంటూ ప్రేక్షకుల నుంచి అనేక మంది అరిచారు. దాంతో సర్దుకున్న ములాయం సింగ్‌ యాదవ్‌ ఆ పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించినందుకు తన సోదరుడిని అభినందిస్తున్నాను అని చెప్పారు’ అని ఎస్పీ సీనియర్‌ నాయకుడు వివరించారు.

బుధవారం నాడు పార్లమెంట్‌ భవనం నుంచి బయటకు వస్తున్న ములాయం సింగ్‌ యాదవ్‌ను సీనియర్‌ జర్నలిస్ట్‌ రాజ్దీప్‌ సర్దేశాయ్‌ కలుసుకొని ‘మోదీ మరోసారి ప్రధాని కావాలని ఎందుకు కోరుకున్నారు ?’ అని ప్రశ్నించగా, ‘నేను అలాంటిదేమీ అనలేదే! మీరే ఏదో ఊహించుకుంటున్నారు!’ అని ములాయం వ్యాఖ్యానించడం కొసమెరుపు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top