‘రాహుల్‌.. రామలింగంలా మాట్లాడుతున్నారు’ | Sakshi
Sakshi News home page

Published Thu, Jun 7 2018 11:57 AM

MP Minister Compares Rahul Gandhi Speech To Movie Character Chatur Ramalingam - Sakshi

భోపాల్‌ : తమ పార్టీ అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోగా రైతు రుణమాఫీ చేస్తామంటూ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్‌ మంత్రి విశ్వాస్‌ సారంగ్‌ విమర్శలు సంధించారు. ‘మంద్‌సౌర్‌లో రాహుల్‌ గాంధీ మాట్లాడిన మాటలు త్రీ ఇడియట్స్‌ సినిమాలోని రామలింగం కామెడీలా ఉందంటూ’ ఆయన ఎద్దేవా చేశారు.

‘త్రీ ఇడియట్స్‌ సినిమాలో ఎవరో రాసి ఇచ్చిన ఉపన్యాసాన్ని రామలింగం అనే విద్యార్థి చదివి నవ్వులపాలవుతాడు. అలాగే రాహుల్‌ గాంధీ కూడా తనకు రాసి ఇచ్చిన ఉపన్యాసాన్ని బట్టీ పట్టి ఇక్కడ(మంద్‌సౌర్‌లో) చదివారు. ఆయన మాటలు పూర్తిగా నాటకీయం, అపరిపక్వమైనవి. అదొక స్క్రిప్ట్‌ అని స్పష్టంగా తెలిసిపోతోంది. అందులో నిజాలు, గణాంకాలు ఏమీ లేవు. మంద్‌సౌర్‌లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ తీసుకొస్తామని రాహుల్‌ చెప్పారు. ఆ విషయం గురించి ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ వారం క్రితమే ప్రస్తావించారంటూ సారంగ్‌’ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ‘రాహుల్‌ గాంధీ మాట్లాడుతున్నది ఫుడ్‌ చెయిన్‌ గురించి కాదు.. ఫ్రాడ్‌ చెయిన్‌ గురించి అందులో ముఖ్యపాత్రధారి రాబర్ట్‌ వాద్రా అంటూ సారంగ్‌ ఆరోపించారు.

ఆర్థిక భరోసా ఇస్తున్నాం...
రాహుల్‌ గాంధీ హామీ ఇచ్చినట్లుగా పది రోజుల్లోగా రైతు రుణమాఫీ చేయడం అంత తేలికగ్గా సాధ్యమయ్యే విషయం కాదని సారంగ్‌ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మా ప్రభుత్వం రైతులకు వడ్డీలేని రుణాలు అందిస్తూ.. ఆర్థిక భరోసా కల్పిస్తోందని తెలిపారు.  

మేడ్‌ ఇన్‌ మంద్‌సౌర్‌...
మేడ్‌ ఇన్‌ మంద్‌సౌర్ పేరిట సెల్‌ ఫోన్‌ల తయారీ యూనిట్‌ నెలకొల్పుతామంటూ రాహుల్‌ చెప్పడం విడ్డూరంగా ఉందని సారంగ్‌ వ్యాఖ్యానించారు. రాహుల్‌ ముందు మేడిన్‌ అమేథీపై దృష్టిసారించాలంటూ హితవు పలికారు.

కాగా మంద్‌సౌర్‌ జిల్లా పిప్లియా మండీలో పోలీసు కాల్పుల్లో ఆరుగురు రైతులు మృతి చెందిన ఘటనకు ఏడాది పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్‌ నిర్వహించిన ర్యాలీలో రాహుల్‌ ప్రసంగిస్తూ పలు హామీలు ఇచ్చిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement