ముస్లింలను బాబు భయపెడుతున్నారు | Mohammed Mustafa commented over chandrababu naidu | Sakshi
Sakshi News home page

ముస్లింలను బాబు భయపెడుతున్నారు

Aug 31 2018 3:23 AM | Updated on Aug 31 2018 3:23 AM

Mohammed Mustafa commented over chandrababu naidu - Sakshi

విలేకరులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే షేక్‌ మొహమ్మద్‌ ముస్తఫా, పక్కన అప్పిరెడ్డి, మేరుగ నాగార్జున, కావటి మనోహరనాయుడు

పట్నంబజారు (గుంటూరు) : మైనారిటీల సదస్సు నిర్వహించి, తిరిగి వారినే అరెస్టులు చేయించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకే దక్కుతుందని గుంటూరు తూర్పు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే షేక్‌ మహమ్మద్‌ ముస్తఫా విమర్శించారు. నారా హమారా.. టీడీపీ హమారా కార్యక్రమంలో ప్లకార్డులతో నిరసన తెలియజేసినందుకు అరెస్టయి రిమాండ్‌లో ఉన్న యువకులను గురువారం ఎమ్మెల్యే ముస్తఫా, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి, ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున, పెదకూరపాడు నియోజకవర్గ సమన్వయకర్త కావటి మనోహర్‌నాయుడు బ్రాడీపేటలోని జిల్లా జైలుకు వెళ్లి పరామర్శించారు.

వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని వారికి భరోసానిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముస్తఫా మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో హక్కుల సాధన కోసం ఎవరైనా నిరసన తెలపవచ్చని, కానీ.. కేసులు పెట్టడం దారుణమన్నారు. ముస్లింలపై ఈగ వాలినా ఊరుకోనని చెప్పే చంద్రబాబు, వారిని హింసించటం ఏమిటని మండిపడ్డారు. బిడ్డలు ఎక్కడ ఉన్నారో తెలీక వారి తల్లిదండ్రులు పడే వేదనను ఎవరు తీరుస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ముస్లింలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ముస్తఫా ఆందోళన వ్యక్తం చేశారు.

మైనార్టీలపై చంద్రబాబు చిన్నచూపు
ముస్లింలు తమ బాధలు చెప్పుకొనేందుకు వస్తే వారిని అక్రమంగా అరెస్టు చేయించటం సిగ్గుచేటని లేళ్ళ అప్పిరెడ్డి అన్నారు. చంద్రబాబు ఇప్పటికీ పరోక్షంగా బీజేపీతో అంటకాగుతూ, మైనారిటీలను చిన్నచూపు చూస్తున్నారని మండిపడ్డారు. బాధిత యువకులను 30గంటల పాటు నిర్బంధించి, అర్ధరాత్రి జైలుకు పంపటం సరికాదన్నారు. మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. పోలీసు వ్యవస్థను చంద్రబాబు తన జేబు వ్యవస్థలా వాడుకుంటూ రాష్ట్రంలో సంకెళ్ల పాలన చేస్తున్నారని ధ్వజమెత్తారు. కావటి మనోహర్‌నాయుడు మాట్లాడుతూ.. చంద్రబాబు నయవంచకుడు, నమ్మకద్రోహి అన్న విషయం సుస్పష్టమైందన్నారు.

ముస్లింలపై చంద్రబాబు కక్ష సాధింపు
మరోవైపు.. ముస్లింలు ఓట్లు వేయరనే భయంతోనే చంద్రబాబు కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సలాం బాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. ముస్లిం విద్యార్థులు, యువకుల అక్రమ అరెస్టును నిరసిస్తూ గురువారం నగరంలోని లాడ్జి సెంటర్‌లో ఉన్న అంబేడ్కర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా సలాంబాబు మాట్లాడుతూ, మైనారిటీలను మోసం చేసేందుకు చంద్రబాబు దొంగ సదస్సులు పెడుతున్నారని విమర్శించారు. హామీలను ప్రశ్నించిన ముస్లింలపై అక్రమ కేసులు పెట్టడం సిగ్గుచేటన్నారు. విద్యార్థులు, యువత పక్షాన ఎంతటి పోరాటాలకైనా వెనుకాడబోమన్నారు. వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు పానుగంటి చైతన్య మాట్లాడుతూ.. హిట్లర్‌ పాలనను ప్రత్యక్షంగా చూస్తున్నామని విమర్శించారు. ప్రశ్నించారని వేధించడం దారుణం అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement